logo

అక్రమాలకు ఎగబడి... హత్యలకు తెగబడి

మదనపల్లె పట్టణం ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా ఉండేది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేరు కాస్త పోయి భూ కబ్జాలు, దందాలు, అక్రమాలకు నిలయంగా మారిపోయింది.

Published : 27 May 2024 03:53 IST

భూదందాలు... అక్రమ పంపకాలు
హత్యలకు తెగబడుతున్న నేతలు
సెటిల్‌మెంట్లతో పెరుగుతున్న నేరాలు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : మదనపల్లె పట్టణం ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా ఉండేది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేరు కాస్త పోయి భూ కబ్జాలు, దందాలు, అక్రమాలకు నిలయంగా మారిపోయింది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు దాన్ని ఆక్రమించుకోవడం స్థల యజమానికి తెలియకుండా మరొకరికి విక్రయించడం జరుగుతోంది. ఇదేమని ప్రశ్నించే బాధితులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. మదనపల్లె కేంద్రంగా కొందరు గ్రూపులుగా ఏర్పడి ఇదే పనిగా దందాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. వీరికి కొందరు పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారం పూర్తిగా ఉండటంతో తాము ఆడిందే ఆటగా సాగుతోంది. ఏదైనా సమస్య బయటకు వస్తే అప్పటికే అక్కడికి కొన్ని సంఘాల నాయకులు వాలిపోయి తాము మధ్యవర్తిత్వం చేస్తామని సమస్యను తమ చేతుల్లోకి తీసుకుని బాధితులను భయపెట్టడం, వారిపై దౌర్జన్యం చేయడం, వసూళ్లకు తెరతీయడం చేస్తున్నారు. బాధితులు ఎవరైనా పోలీసులకు చెప్పాలన్నా... సంబంధిత దందాలు చేసే వారికి నాయకుల అండదండలున్నట్లు తెలుసుకుని ఫిర్యాదు చేస్తే తమకు న్యాయం జరగదని గుర్తించి తమ సొంత స్థలాలకు కూడా డబ్బు చెల్లించి మిన్నకుండిపోతున్నారు. మదనపల్లెలో ఇలాంటి సంఘటనలు పెరగడం వల్ల కొన్ని బృందాలు విచ్చలవిడిగా దందాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నారు.

కోడ్‌ పేరిట నిఘా నిద్ర

ఇటీవల ఎన్నికలు జరగడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు ఆ విధుల్లో తాము బిజీగా ఉన్నామని అక్రమాలను పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులు వచ్చినా పెడచెవిన పెడుతున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత చూసుకుందాంలే అంటూ వచ్చిన వారికి సర్దిచెప్పి పంపుతున్నారు. మరోవైపు ఇదే అదనుగా లెక్కలు సరిచూసుకునే పనిలో అధికార పార్టీ నేతలు తమ దౌర్జన్యకాండను కొనసాగిస్తున్నారు. దీపముండగానే ఇలు చక్కబెట్టుకోవాలనే చందంగా ఓట్ల లెక్కింపునకు ముందే తమ అక్రమాల లెక్కలు తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఖాళీ స్థలాలు, కాలువలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వారు వాటిని పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ స్థలాల కబ్జాల విషయంలో, పంపకాల విషయంలో సెటిల్‌మెంట్‌ బృందాల మధ్య వివాదాలు తలెత్తి హత్యలకు తెగబడుతున్నారు. విచక్షణా రహితంగా పొడుచుకుని చంపుకునే స్థాయికి చేరుకుంటున్నారు. దీనికి నిదర్శనమే శేషాద్రి హత్య.

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు

  • మదనపల్లె పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీ పరిసర ప్రాంతాల్లో రెండు వర్గాల వారు స్థలం విషయమై గొడవలు పడి స్థలంలో ఉన్న కంచెకు ఏర్పాటు చేసిన రాళ్లను ధ్వంసం చేశారు. దీనిపై రెండో పట్టణ పోలీస్‌ ఠాణాలో కేసు నమోదు అయ్యింది.
  • మదనపల్లె పట్టణంలోని ఎగువ కురవంకకు చెందిన ఓ వ్యక్తికి చెందిన స్థలాన్ని మదనపల్లెకు చెందిన కొందరు ఆక్రమించుకుని తప్పుడు ధ్రువపత్రాలతో వేరొకరికి విక్రయించారు. ఇందులో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులు ఉండటంతో వారిపై కూడా బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
  • బీకేపల్లె ఇందిరమ్మ కాలనీలో ప్రభుత్వం కొంతమందికి ఇళ్ల నిర్మాణాలకు స్థలాలు ఇచ్చింది. ఇల్లు కట్టుకునేందుకు స్తోమత లేని వారు తమ స్థలాలను ఖాళీగా ఉంచారు. వీటిని కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకుని యజమానులకు తెలియకుండానే తప్పుడు ధ్రువపత్రాలతో విక్రయాలు చేశారు. నిజమైన బాధితులు వెళితే తమ స్థలంలో ఇళ్లు కట్టుకుని ఉండటంతో విస్తుపోతున్నారు. వీటన్నింటి వెనుక కొందరు కుల సంఘాల నాయకులు, పార్టీ నాయకులతో పాటు తిరిగే వారు ఉండటం గమనార్హం. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. తరచూ దందాలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం

- ప్రసాద్‌రెడ్డి, డీఎస్పీ, మదనపల్లె

మదనపల్లె పట్టణంలో పలు బృందాలు దందాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు గుర్తించాం. వారందరినీ  స్టేషన్‌కు పిలిచి హెచ్చరిస్తాం. ఎక్కడైనా గొడలవలకు పాల్పడిన, ఎవరినైనా బెదిరించినా బాధితులు నేరుగా వచ్చి స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. బాధితులకు అండగా పోలీసులు ఉంటారు. దందాలకు పాల్పడే వారిని జైలుకు పంపుతాం. అవసరమైతే వారిపై షీట్లు తెరిచి అణచివేస్తాం. సంఘాలు ఏర్పాటు చేసుకుని ప్రజల సమస్యలపై పనిచేయకుండా సొంత లబ్ధికోసం పనిచేస్తున్న వారిపై, గ్యాంగులు నడిపే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. రౌడీషీటర్లు, పాతనేరస్థులు, దందాలు, సెటిల్‌మెంట్‌ చేసేవారి వివరాలు సేకరించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని