logo

ప్రతి వాహనానికి హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేటు

పదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాహనాలకు హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విధానం కొనసాగుతోంది.

Published : 27 May 2024 03:55 IST

లేకుంటే జరిమానా
వచ్చే నెల నుంచి ముమ్మర తనిఖీలు 
న్యూస్‌టుడే, కడప చిన్నచౌకు 

దేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాహనాలకు హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విధానం కొనసాగుతోంది. ఇటీవల కొత్త వాహనాలకే కాదు, పాత వాహనాలకు కూడా వీటిని బిగించుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం గడువు ఎప్పుడో ముగిసింది. అధికారులు ఎన్నికల హడావుడిలో ఉండడంతో దీనిని కాస్త పక్కన పెట్టారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన తరవాత ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వాహనదారులకు అవగాహన కల్పించి, తప్పనిసరిగా హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను బిగించుకునేలా తనిఖీలు చేయాలని నిర్ణయించారు. ఇది లేకుంటే జరిమానా తప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి

పాత వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్లను బిగించుకోవాలంటే www.siam.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుకింగ్‌ చేసుకోవాలి. ఆ సమయంలో డీలర్‌ వద్ద లేదా ఇంటి వద్దకు వచ్చి బిగించుకుంటారా అనే ఆప్షన్‌ అడుగుతుంది. మనకు ఏది వీలుగా ఉంటుందో దానిని ఎంచుకోవచ్చు. ద్విచక్రవాహనానికి రూ.245, మూడు చక్రాల వాహనాలకు రూ.282, నాలుగు చక్రాల వాహనాలకు రూ.619, భారీ వాహనాలకు రూ.649 చెల్లించాలి.

ఇవీ ప్రయోజనాలు

  • హైసెక్యూరిటీ నంబరు ప్లేట్‌ను ఎంబోజ్‌ అనే ముడి పదార్థంతో తయారు చేస్తారు.  దీనిలో నాణ్యమైన హాలోగ్రామ్, లైజర్‌ నంబరు ఉంటుంది. నకిలీవి తయారు చేస్తే సులువుగా గుర్తించవచ్చు.
  • హాట్‌ యంత్రం ద్వారా నంబర్‌ ప్లేట్లను తయారు చేస్తారు. ఇవి వర్షానికి, ఎండకు దెబ్బతినవు. నంబరు ప్లేట్లు మార్చి అక్రమంగా రవాణా చేసేందుకు అవకాశం ఉండదు. 

వాహనాలకు రక్షణ కవచం

- మీరాప్రసాద్, డీటీసీ, కడప  

హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్లు వాహనానికి రక్షణ కవచంలా పని చేస్తాయి. ఇప్పుడు కొత్త వాహనాలకు బిగిస్తున్నారు. పాతవాటికీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల హడావుడిలో కొంత ఆలస్యమైంది. ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత దీనిపై దృష్టిసారిస్తాం. నంబరు ప్లేట్లు లేకుంటే జరిమానాలు నమోదు చేస్తాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని