logo

చరిత ఘనం... వసతులు కనం

సిరులు కురిపించే గనులు... గిరులు... నదులు... ఖాళీ భూములపై నాయకులకు ఉన్న శ్రద్ధ సామాన్యుల సంక్షేమంపై లేదు. శతాబ్దాల చరితగన్న గండికోటకు ఏటా వేలాదిగా పర్యాటకులు తరలి వస్తుంటారు.

Published : 27 May 2024 04:00 IST

సమస్యలతో పర్యాటకుల సంకటం
గండికోట బాగుపట్టని పాలకులు

సిరులు కురిపించే గనులు... గిరులు... నదులు... ఖాళీ భూములపై నాయకులకు ఉన్న శ్రద్ధ సామాన్యుల సంక్షేమంపై లేదు. శతాబ్దాల చరితగన్న గండికోటకు ఏటా వేలాదిగా పర్యాటకులు తరలి వస్తుంటారు... గ్రాండ్‌ కెన్యన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన ఈ గిరి దుర్గానికి వచ్చే సందర్శకులకు అసౌకర్యాలు స్వాగతం పలుకున్నాయి. వాతావరణ మార్పులతో ఈ ఏడాది సీజన్‌ ముందస్తుగా మొదలవగా కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. 

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: వేసవి సెలవుల్లో పిల్లలతో అలా ఏదైనా పర్యటక ప్రదేశానికి వెళ్లొద్దాం.. సంతోషంగా గడుపుదాం.. అని భావించిన జిల్లా వాసులకు ముందుగా గుర్తొచ్చేది జమ్మలమడుగు సమీపంలోని దర్శనీయ ప్రాంతమైన గండికోట. కానీ ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల్లో లోపించిన చిత్తశుద్ధి, అధికారుల నిర్లక్ష్యంతో ఇక్కడ వసతులు కరవై సమస్యలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా పాలకులు దృష్టిపెడితే ఈ ప్రాంతంలో పర్యాటకం పరిడవిల్లుతుంది. 

  • శత్రుదుర్భేద్యమైన గండికోట చుట్టూ అందమైన లోయలు, ప్రాచీన కట్టడాలు, ఎటు చూసిన అబ్బురపరిచే కమనీయ దృశ్యాలు గండికోట ఒడిలో ఒదిగి ఉన్నాయి. కల్యాణి చాళుక్య రాజైన త్రైలోక్యమల్ల మహారాజుకు సామంత రాజుగా ఉన్న కాకరాజు క్రీ.శ.1123, జనవరి 9న గండికోటను నిర్మించినట్లు గండికోట దుర్గం కైఫియత్‌ తెలుపుతోంది. పునాదులు లేకుండానే కొండబండలపై కోట గోడలను నిర్మించడం ఇక్కడి ప్రత్యేకత.
  • గండికోట సందర్శనకు వచ్చిన పర్యాటకులు కోట లోపల కనీసం మంచినీరు కూడా దొరకని పరిస్థితి. పెన్నాలోయలో నీరు పుష్కలంగా ఉన్నా సందర్శకుల దాహార్తిని తీర్చలేని దుస్థితి. జుమ్మా మసీదు ఆవరణలో ఏర్పాటు చేసిన శుద్ధినీటి యంత్రం కూడా నిరుపయోగంగా మారింది. 
  • కోట లోపలికి వెళ్లడానికి రాతిచప్పట ఉండగా లోపలికి వెళ్లిన తర్వాత మొత్తం కంపచెట్లతో అలుముకుంది. ఎక్కడ చూసినా రాళ్ల గుట్టలే దర్శనమిస్తున్నాయి. గండికోటలో సినిమాల చిత్రీకరణలు పెరిగినా వారికి తగిన సౌకర్యాల్లేక ప్రొద్దుటూరులో బస చేయాల్సి వస్తోంది.

ఆకతాయిల అడ్డా

చారిత్రక ప్రదేశమైన గండికోట ఆకతాయిలకు అడ్డాగా మారింది. భద్రతా సిబ్బంది మచ్చుకైనా కనిపించకపోవడంతో వారి ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు రక్షణగా గతేడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ‘టూరిస్ట్‌ పోలీస్‌’ పేరుతో సేవా విభాగాన్ని ప్రారంభించి నిరంతరం నిఘా ఉండేలా అవుట్‌ పోస్ట్‌ ఏర్పాటు చేశారు. సిబ్బంది లేక ఆ గదికి నిరంతరం తాళాలు వేసి ఉంటాయి. దీంతో గండికోటలో భద్రత చర్యలు లేకపోవడంతో ఆకతాయిలు మద్యం మత్తులో పర్యాటకుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సందర్శకుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.


పార్కింగ్‌ సౌకర్యం శూన్యం

ప్రతి శని, ఆదివారాల్లో గండికోటలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వాహనాలను నిలిపేందుకు సరైన పార్కింగ్‌ సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలిపేయడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది.


అమలుకాని నేతల హామీలు 

ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చేలా గండికోటను తీర్చిదిద్దుతామని పాలకులు, అధికారులు హామీలు ఇస్తున్నారే తప్ప ఆచరణలో కనిపించడం లేదు. రూ.3 కోట్లతో నిర్మించిన అడ్వెంచర్‌ అకాడమీ నిర్వహణ లేక వెలవెలబోతుంది. రూ.7.50 కోట్లతో రోప్‌వే నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. పర్యాటకులు భోజనాలు చేసేందుకు సరైన వసతి కూడా లేదు. సీఎం సొంత జిల్లాలోని గండికోటపై ప్రత్యేక దృష్టి సారించలేదని సాహితీ, పర్యాటక ప్రియులు విమర్మిస్తున్నారు. 


మెరుగైన వసతులు కల్పిస్తాం

- బాలకృష్ణ, పురావస్తుశాఖ అధికారి, కడప

స్వదేశీ దర్శన్‌ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జిల్లాలో పర్యాటక ప్రాంతమైన గండికోట అభివృద్ధి పనులు చేపట్టనుంది. శాశ్వత తాగునీటికి, రహదారుల మరమ్మతులు, పర్యాటకులకు మౌలిక వసతులు, వాహనాల పార్కింగ్‌ తదితర సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పిస్తాం. ఉన్నతాధికారులకు ఈ మేరకు ప్రతిపాదనలు పంపాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు