logo

జమ్మలమడుగులో ఐపీసీ కాదని వైసీపీ చట్టం అమలు

ఎన్నికల వేళ శాంతిభద్రతల అమలు అత్యంత సున్నితమైంది. అదీ జమ్మలమడుగు లాంటి ప్రాంతంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలి.

Updated : 27 May 2024 04:49 IST

ఎన్నికల నిబంధన ఉల్లంఘన
144 సెక్షన్‌ తోసిరాజని ఎగ్జిబిషన్‌
పోలీసులతో వైకాపా నేత ఒప్పందం
కొనసాగుతున్న అధికార పార్టీ ఆగడాలు
ఈనాడు, కడప

న్నికల వేళ శాంతిభద్రతల అమలు అత్యంత సున్నితమైంది. అదీ జమ్మలమడుగు లాంటి ప్రాంతంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అందుకే తెదేపా కడప ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి, జమ్మలమడుగు కూటమి, వైకాపా అభ్యర్థులు ఆదినారాయణరెడ్డి, సుధీర్‌రెడ్డిలను గృహ నిర్బంధం చేయడంతో పాటు రాష్ట్ర ఎల్లలు సైతం దాటించారు. జమ్మలమడుగుతో పాటు నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల వేళ జమ్మలమడుగులో ఓ వైకాపా కీలక నేత ఎగ్జిబిషన్‌ నిర్వహించుకోవడానికి లోపాయికారిగా పోలీసులు పచ్చజెండా ఊపారు. ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని సోమవారం నుంచి నిర్వహించుకోవడానికి సన్నాహాలు కొలిక్కివచ్చాయి. రూ.లక్షలతో ముడిపడిన ఈ వ్యవహారంలో అటు తితిదేకు.. ఇటు నగర పంచాయతీకి రూపాయి ఆదాయం లేకుండా మొత్తం తన ఖాతాలో వేసుకోవడానికి వైకాపా నేత దందా ఆరంభించారు. మరో ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్‌ను తలపించేలా బహిరంగంగా వ్యవహారం ఇక్కడ నడుస్తోంది.

జమ్మలమడుగులో శ్రీనారాపుర వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఈ నెల 20న ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా.. 30 వరకు కొనసాగనున్నాయి. ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీనారాపుర వేంకటేశ్వర ఆలయ ఆవరణలో దుకాణాలు, ఎగ్జిబిషన్‌ నిర్వహించడంతో సందడిగా ఉంటుంది. ఉత్సవాల అనంతరం కూడా కొనసాగింపుగా సుమారు రెండు వారాల పాటు పండుగ వాతావరణం నెలకొంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13న పోలింగ్‌ సందర్భంగా జమ్మలమడుగు పట్టణంలో కూటమి, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తడంతో 144 సెక్షన్‌ విధించారు. దుకాణాలు, ఎగ్జిబిషన్‌కు తితిదే అధికారులు అనుమతివ్వలేదు. ప్రశాంత వాతావరణంలో బ్రహ్మోత్సవాలు  వైభవంగా నడుస్తున్నాయి. ఏటా దుకాణాలు ఏర్పాటు, ఎగ్జిబిషన్‌తో దోపిడీకి పాల్పడుతున్న వైకాపా నేత.. ఈసారి ఆ అవకాశం రాలేదని నిరాశ చెందారు. ఎలాగైనా తన కార్యాన్ని నెరవేర్చుకోవాలన్న తలంపుతో వైకాపా నాయకుడు తన రూటే సపరేటు అన్నట్లుగా ఎలాంటి అనుమతుల్లేకుండా ప్రైవేటు స్థలంలో ఎగ్జిబిషన్‌ ఏర్పాట్లు చేయడం విమర్శలకు తావిస్తోంది.


ఏమిటీ దందా.. ఎవరా నేత?

మ్మలమడుగు వైకాపా నాయకుడు, వార్డు కౌన్సిలరు అయిన బడా నేత ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో దుకాణాల ఏర్పాటు, ఎగ్జిబిషన్‌ నిర్వహణతో అక్రమాలు సాగిస్తున్నారు. కొన్నేళ్లుగా దందా ఈ సాగించిన నేత.. అక్రమాల రుచి మరిగారు. తితిదే ఆలయ ప్రాంగణంలో అనుమతులు రాకపోవడంతో ప్రైవేటు స్థలంలో నిర్వహించుకుంటానంటూ కొత్త ఎత్తుగడ ఎత్తారు. పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం ఎదురుగా, నారాపుర వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఎడమవైపున ఓ ప్రైవేటు స్థలాన్ని లీజుకు తీసుకుని ఎగ్జిబిషన్‌ ఏర్పాట్లు కొలిక్కితెచ్చారు. గతేడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా సదరు వైకాపా నాయకుడు సంజీవరాయుడు పేరిట రూ.15.10 లక్షలకు ఎగ్జిబిషన్‌ను వేలంలో దక్కించుకున్నారు. ఈ సమయంలోనూ తనకు ఎవరూ పోటీ రాకుండా దందా నడిపారు. ఈ ఏడాది సైతం నామినేషన్‌పై తనకే లీజుకు ఇవ్వాలని.. రూ.5 వేలు పెంచి రూ.15.15 లక్షలు చెల్లిస్తానంటూ ఏర్పాట్లు ప్రారంభించారు. పట్టణంలో నెలకొన్న శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని దుకాణాలు, ఎగ్జిబిషన్‌ నిర్వహణ ఈసారి వద్దంటూ తితిదే ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. ఈ పరిణామం వైకాపా నేతకు మింగుడుపడలేదు. తితిదే స్థలంలో కాకుండా ప్రైవేటు స్థలంలో నిర్వహించుకుంటానంటూ సన్నాహాలు పూర్తి చేశారు. ప్రైవేటు స్థలంలో కాబట్టి.. తితిదే తనకు సంబంధంలేదంటూ పట్టించుకోలేదు. శాంతిభద్రతల పరంగా సున్నితమైన ప్రాంతంలో వ్యవహారం సాగుతున్నా.. పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు? నగర పంచాయతీలో జరుగుతున్న వ్యవహారంపై ఆ విభాగం ఎందుకు మౌనంగా ఉంది? అన్న అంశాలపై జిల్లాలో చర్చ సాగుతోంది. సాధారణంగా ఇలాంటి వాటికి పోలీసు, నగర పంచాయతీ, అగ్నిమాపక విభాగాల నుంచి అనుమతులుండాలి. లేని పక్షంలో ఆయా విభాగాలు అడ్డుకోవాల్సి ఉంది. ఒకేచోట భారీ ఎత్తున దుకాణాలు వెలవడం, ఎగ్జిబిషన్‌తో పెద్ద ఎత్తున జనం గుమికూడే వ్యవహారం కావడంతో 144 సెక్షన్‌ అమలయ్యే పరిస్థితి ఉండదు. సున్నితమైన ప్రాంతంలో జరిగే కదలికలపై పోలీసు యంత్రాంగం నిఘా ఉండాల్సి ఉంది. వైకాపా నేత ఏర్పాట్లపై పోలీసులు కిమ్మనకుండా ఉండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ రూ.కోట్లల్లో వ్యాపారాలు నడిచే అవకాశం ఉన్నా.. రూపాయి లీజు లేకుండా మరో పెద్ద మోసానికి పాల్పడుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు