logo

ఇల్లే ఆవాసం.. కుడితే కైలాసం

దోమ చిరుప్రాణి. చూస్తే అల్పం. అది చేసే కాటుతో జరిగే నష్టం అనంతం. ఇటీవల వాతావరణంలో వచ్చిన మార్పులు, కురుస్తున్న వర్షాలతో పల్లె, పట్టణాల్లో మశక దండు చీకటి పడగానే దండయాత్ర చేస్తున్నాయి.

Updated : 27 May 2024 04:48 IST

చుట్టుముడుతున్న దోమల దండు
పల్లె, పట్టణాల్లో పారిశుద్ధ్య లోపం
స్వచ్ఛ పనులపై చేతులెత్తేసిన సర్కారు
స్వీయ జాగ్రత్తలే జనానికి రక్ష
న్యూస్‌టుడే, కడప

దోమ చిరుప్రాణి. చూస్తే అల్పం. అది చేసే కాటుతో జరిగే నష్టం అనంతం. ఇటీవల వాతావరణంలో వచ్చిన మార్పులు, కురుస్తున్న వర్షాలతో పల్లె, పట్టణాల్లో మశక దండు చీకటి పడగానే దండయాత్ర చేస్తున్నాయి. మురుగు కాలువల నిర్వహణ అధ్వానంగా ఉంది. నివాసాల చెంతనే నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. తాగునీటి గొట్టాలు నీటి సరఫరా ఒత్తిడితో పగిలిపోతున్నాయి. లీకులు ఏర్పడుతున్నాయి. సకాలంలో మరమ్మతులు చేయడం లేదు. రక్షిత జలం కలుషితమవుతోంది. ఈ జలాన్ని సేవించిన ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఊరు, వాడ అనే తేడా లేదు. పేద, మధ్య తరగతి, సంపన్న వర్గాలు అనే వ్యత్యాసం లేకుండా పంజా విసిరిన జ్వరాల బారిన పడుతున్నారు. కొందరు వైరల్‌.. మరికొంతమంది టైఫాయిడ్‌.. ఇంకొందరు ప్రాణాంతక డెంగీతో ఆసుపత్రి పాలవుతున్నారు. నయం కోసం వైద్య ఖర్చులకు రూ.వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. పడకేసిన పారిశుద్ధ్యంపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అంతులేని అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అదే ప్రజల పాలిట శాపంగా మారింది. 


డెంగీ : ఎడిస్‌ దోమ ముఖ్యంగా పగటి పూట మాత్రమే కుడుతుంది. అదీ చీకటికి ముందు రెండు, మూడు గంటల్లోనే ఎక్కువగా ఈ దోమకాటు ఉంటుంది.


 

జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు డెంగీ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు 3,169 మందికి వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 86 మందికి పాజిటివ్‌ వచ్చింది. వైయస్‌ఆర్, కర్నూలు, నెల్లూరు, తిరుపతి జిల్లాలతోపాటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వైద్యం పొందిన వారి సంఖ్య ఇంతకంటే రెట్టింపు ఉంటుందని అంచనా. టైఫాయిడ్‌ 125 మందికి వచ్చినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నా బాధితులు మరింత ఎక్కువగా ఉన్నారు. పంచాయతీలు, పురపాలక, నగరపాలకకు వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులు చాలాచోట్ల ఖాళీ అయ్యాయి. తాగునీటి పథకాలు, వీధి దీపాలుకు వాడే విద్యుత్తు బిల్లుల బకాయిలు చెల్లించాలని ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు రావడంతో సర్దుబాటు చేశారు. క్లాప్‌ మిత్రలు, కాపలాదారులకు కొంతమేర వేతనాలు ఇచ్చారు. చాలాచోట్ల పద్దు ఖాళీ అయింది. మురుగు కాలువల నిండా పూడిక చేరింది. వర్షాలకు మునుపే డ్రైనేజీలో పేరుకుపోయిన మట్టి, రాళ్లు, ఇతర వ్యర్థాలను తొలగించాల్సిన తరుణమిదే. మొన్నటి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు సార్వత్రిక సంగ్రామంపై దృష్టి సారించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపలేదు. ఒకవేళ ప్రభుత్వం మారితే మార్గదర్శకాలను మార్పు చేస్తారని భావనతో చాలాచోట్ల నిధులను ఇబ్బడిముబ్బడిగా వాడేశారు. అతి తక్కువగా నిధులు ఉన్నాయి. దోమల ఉత్పత్తి నివారణ కోసం ఫాగింగ్‌ చేయడం లేదు. పొగ వదలడానికి రసాయనాలు, ఇంధనం కావాలి. కొనుగోలు చేయడానికి రూకలు లేకపోవడంతో పక్కన పెట్టేశారు. ఈసారి ముందస్తుగా వర్షాలు కురిశాయి. చిరు జల్లుల నుంచి మోస్తరుగా వానలు కురవడంతో గ్రామీణ గడపలో, పట్టణ ప్రాంతాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. 

లక్షణాలు

అధిక జ్వరం, ఆకలి వేయకపోవడం, వాంతులు, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కీళ్లు, కండరాల నొప్పులు.

వైద్యం

నివారణ లేదు. విశ్రాంతి తీసుకోవడం, ఫ్లూయిడ్‌లు, ప్యారాసిటమోల్‌ వాడాలి. ఆస్ప్రిన్‌ మాత్ర ఇస్తే రక్తస్రావం అధికం అయ్యే అవకాశాలున్నాయి. అందుకే డెంగీ జ్వర బాధితులు ఆ మాత్రను తీసుకోరాదు.

ఏం చేయాలి

శరీర ఉష్ణోగ్రత 39 సెంటిగ్రేడ్ల కంటే తక్కువగా ఉండేలా చూడాలి. మూడు రోజుల కంటే ఎక్కువగా జ్వరం వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.


ఈ జాగ్రత్తలతో దూరంగా...

డెంగీ జ్వరాలు రాకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు చేరకుండా చూసుకోవాలి. టైగర్‌ (ఏడీస్‌) దోమ కారణంగా డెంగీ జ్వరం వ్యాపిస్తుంది. ఈ దోమ మంచినీటిలో పెరుగుతుంది కాబట్టి నీటి నిల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కూలర్లలో నీటి నిల్వను తరచూ శుభ్రం చేసుకోవాలి. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలి. తాగేసిన టెంకాయ చిప్పలు, పాత టైర్లు, నీళ్ల కుండీలు నీటిని నిల్వ చేసే తొట్టెలను శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా చెరువుల్లో దోమల లార్వాలు పెరగకుండా గంబూసియా చేపలు పెంచుకోవాలి.


దోమల నివారణకు చర్యలు 

- మనోరమ, జిల్లా మలేరియా అధికారిణి, కడప  

జిల్లాలో మురుగు నిల్వ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. కాలువల్లో పూడిక తొలగించాలని ఆదేశించాం.  ఎక్కడైతే మురుగు కుంటలు నిల్వ ఉన్నాయో గుర్తించి వెంటనే యాప్‌లో చిత్రాలను అప్‌లోడ్‌ చేయాలని చెప్పాం. అక్కడ దోమల నివారణ చర్యలు తీసుకుంటున్నాం. గతేడాది కంటే డెంగీ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాదిలో ఇప్పటికి 86 కేసులు నమోదయ్యాయి. సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని