logo

kadapa: మందుల్లేవండి... రోగులను తీసుకెళ్లిపోండి!

ఉమ్మడి కడప జిల్లాకు పెద్దాసుపత్రిగా నిలుస్తున్న కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ప్రతిరోజూ జిల్లా నలుమూలాల నుంచి పెద్దసంఖ్యలో రోగులొస్తుంటారు. వీరిని అక్కున చేర్చుకుని వైద్యసేవలందించాల్సిన ఆసుపత్రి అధికారులు, వైద్యులు,

Updated : 24 May 2024 07:59 IST

ఇదీ కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని పరిస్థితి 
న్యూస్‌టుడే, సర్వజన ఆసుపత్రి 

కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చిన రోగులు 

మ్మడి కడప జిల్లాకు పెద్దాసుపత్రిగా నిలుస్తున్న కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ప్రతిరోజూ జిల్లా నలుమూలాల నుంచి పెద్దసంఖ్యలో రోగులొస్తుంటారు. వీరిని అక్కున చేర్చుకుని వైద్యసేవలందించాల్సిన ఆసుపత్రి అధికారులు, వైద్యులు, సిబ్బంది ఇక్కడ మందుల్లేవని, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, వేలూరు ప్రభుత్వాసుపత్రులకు గానీ, ప్రైవేటు ఆసుపత్రులకు గానీ వెళ్లాలని చెబుతుంటే భయమేస్తోందని రోగులు, వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సాధారణ వైద్యసేవలతోపాటు గుండె, పక్షవాతం, కాలేయం, మూత్రపిండాలు తదితర సమస్యలకు వైద్యసేవలందేవి. ప్రస్తుతం ఆసుపత్రి ఆవరణలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవల్లో భాగంగా న్యూరాలజీ, నెప్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ తదితర వైద్య సేవలు అందుబాటులోకొచ్చాయి. కొన్ని విభాగాలకు సంబంధించిన వైద్యులు అందుబాటులో ఉంటూ రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా పెరాలసిస్‌ (పక్షవాతం)కు మందుల్లేవని, కార్పొరేట్‌ ఆసుపత్రులకు గానీ, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, వేలూరు ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాలని సూచించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి అధికారులు మాత్రం మందుల కొరత లేదని, అన్ని రకాల మందులు, పరీక్షలు, స్కానింగ్‌లు అందుబాటులో ఉన్నాయని చెబుతుండడం, వైద్యులు మాత్రం మందుల్లేవని చెబుతుండడం చూస్తుంటే ఇక్కడ ఏం జరుగుతుందో అర్ధం కావడంలేదని రోగులు, వారి సహాయకులు వాపోతున్నారు. మందులకు సంబంధించి రోగులకు ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమాదేవి చెబుతున్నారు. 

వైద్యసేవలకు నిరీక్షిస్తున్న రోగి సుబ్బమ్మ


ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లమంటున్నారు
- సంజీవరెడ్డి, వేంపల్లె

మా అత్త సుబ్బమ్మ పక్షవాతంతో బాధపడుతుండడంతో ఆసుపత్రికి తీసుకొచ్చాము. వైద్యులు పరిశీలించి ఐసీయూలో అయిదు రోజులపాటు చికిత్స అందించాల్సి ఉంటుందని సూచించారు. మూడో రోజే  జనరల్‌ వార్డుకు మార్చగా అక్కడెలాంటి వైద్యసేవలందించలేదు. దీనిపై వైద్యులను ప్రశ్నిస్తే పక్షవాతానికి ఇక్కడ మందుల్లేవని, ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లిపోవాలని సలహా ఇచ్చారు. ఎంతో నమ్మకంతో ఇక్కడకొస్తే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడం అన్యాయం.


ఇక్కడ వైద్యమే లేదన్నారు
- కొండమ్మ, మైదుకూరు  

మా కుమార్తెకు ఇక్కడే ప్రసవమైంది. ఉన్నట్టుండి ఫిట్స్‌ రావడంతో కాన్పుల వార్డు నుంచి ఐసీయూకు తరలించారు. అక్కడ వైద్యులు ఎంఆర్‌ఐ, సిటీస్కాన్‌ పరీక్షలు చేసి మెదడులో రక్తం గడ్డ కట్టిందని, దీనికి ఇక్కడ వైద్యం గానీ, మందులు గానీ లేవని, వెంటనే తీసుకెళ్లిపోవాలని సూచించారు. గత్యంతరం లేక డబ్బుల కోసం బంధువుల వద్ద బంగారం తాకట్టు పెట్టాం. పెద్దాసుపత్రి ఉండీ ఏం లాభం. ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని