logo

ఎన్నికలకు సమాయత్తం!

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాధారణ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రత్యేకంగా దృష్టి సారించి సన్నాహాలు చేస్తోంది.

Published : 29 Nov 2023 02:35 IST

అధికారులు, సిబ్బంది గుర్తింపు
ఓటర్ల తుది జాబితాపై కసరత్తు

ఈనాడు, కడప: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాధారణ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రత్యేకంగా దృష్టి సారించి సన్నాహాలు చేస్తోంది. ఈ నెలాఖరులోగా ఎన్నికల సిబ్బంది వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపేందుకు జాబితా తయారు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను పక్కన పెట్టాలనే ప్రయత్నాలను దాదాపు విఫలమైనట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల జాబితాను సైతం సిద్ధం చేశారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది వివరాలను శాఖల వారీగా సేకరణకు కలెక్టర్‌ విజయరామరాజు గతంలోనే ఆదేశాలిచ్చారు. ప్రతి శాఖలో సిబ్బంది, వారి హోదాలకు అనుగుణంగా విధుల కేటాయింపునకు వివరాలు సేకరించారు. గతంలో ఎన్నికల విధులు నిర్వహించిన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో 1,941 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు బద్వేలులో 272, కడపలో 268, పులివెందులలో 301, కమలాపురంలో 249, జమ్మలమడుగులో 315, ప్రొద్దు టూరులో 267, మైదుకూరు నియోజకవర్గంలో 269 వంతున ఉన్నాయి. పోలింగ్‌ నిర్వహణకు వీలుగా దాదాపు పది వేల మంది సిబ్బంది అవసరవుతారనే అంచనా వేశారు. పోలింగ్‌ కంటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నోటిఫికేషన్‌కు ముందుగానే సిబ్బంది ఎంపిక, శిక్షణ, విధులకు హాజరుకు ఆదేశాలు జారీ చేయడం, ఈవీఎంల తనిఖీ, ఎన్నికల సామగ్రి సిద్ధం చేసుకోవడం, తరలింపు, రూట్ మాప్‌లు రూపొందించడం, పోలింగ్‌ కేంద్రాల మౌలిక సదుపాయాలు, ఎన్నికల పర్యవేక్షణకు సీనియర్‌ అధికారుల ఎంపిక తదితరాలు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు వీలుగా అధికారుల నుంచి సిబ్బంది వరకు శిక్షణ ఇవ్వనున్నారు. అధికారుల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు త్వరలోనే జరగనున్నాయి. తుది దశలో భాగంగా పోలింగ్‌ కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలింగ్‌ కేంద్రాల భవనాలు, తాగునీరు తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా? లేవా? అన్నది పరిశీలించి నివేదిక అందించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా గత నెల 27న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గల్లీ నుంచి దిల్లీ వరకు సైతం ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అప్రమత్తమై ఓటర్ల సవరణ ప్రక్రియ పరిశీలకులుగా సీˆనియర్‌ ఐఏఎస్‌ అధికారులను నియమించింది. ఈ మేరకు జిల్లాకు ఎపీˆఎంఎస్‌ఐడీసీˆ ఎండీ డి.మురళీధర్‌ను నియమించగా, ఆయన జిల్లాకు బుధవారం రానున్నారు. రాజకీయ పార్టీలతో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. సోమవారమే జిల్లాకు రావాల్సి ఉన్నప్పటికీ రెండు రోజులు ఆలస్యంగా రానున్నారు. ఈ వ్యవహారంపైనే బూత్‌ లెవల్‌ స్థాయి నుంచి ఈఆర్వోల వరకు నిమగ్నమయ్యారు. ఓటర్ల సవరణలపై అందిన దరఖాస్తుల పరిష్కారంపై వీరంతా దృష్టి సారించారు. మరోవైపు పోలీసు యంత్రాంగం సైతం శాంతిభద్రతల పరంగా చర్యలు తీసుకుంటూ ప్రక్రియను ప్రారంభించింది. పోలింగ్‌ కేంద్రాల వారీగా సమస్యాత్మకమైనవి, అత్యంత సమస్యాత్మకమైనవి గుర్తించి అల్లర్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు పోలీసు అధికారులు కసరత్తు ప్రారంభించారు. పోలింగ్‌కు సన్నద్ధంగా ముందు జాగ్రత్త చర్యలన్నీ వచ్చే నెల 15వ తేదీ నాటికి పూర్తిచేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని