logo

అరాచక పాలన అంతానికి ఐక్య పోరాటం

రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను అంతం చేయడానికి ఎన్నికల యుద్ధంలో తెదేపా-జనసేన పార్టీలు ఐక్య పోరాటానికి సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని..

Published : 29 Nov 2023 02:41 IST

తెదేపా, జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో నేతలు

ఐక్యత చాటుతున్న తెదేపా, జనసేన పార్టీల నాయకులు

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను అంతం చేయడానికి ఎన్నికల యుద్ధంలో తెదేపా-జనసేన పార్టీలు ఐక్య పోరాటానికి సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్‌, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్‌ పిలుపునిచ్చారు. బి.కొత్తకోటలో మంగళవారం తెదేపా-జనసేన పార్టీల తంబళ్లపల్లె నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. రానున్న ఎన్నికల్లో వైకాపా ఓటమికి ఇరు పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాలపై పలువురు నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేకపోగా, తెదేపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలపై.అక్రమ కేసులు బనాయించి భయాందోళనకు గురిచేస్తోందని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చిన తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం వైకాపా దిగజారుడు పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. అధికార పార్టీ నాయకుల భూ ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయని, పాపఘ్ని నదిలోని ఇసుకను కర్ణాటకకు అక్రమంగా తరలించి సొమ్ము  చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు హరిప్రసాద్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌ రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించడానికి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారని, ఇరు పార్టీల శ్రేణులు క్షేత్రస్థాయిలో ఐక్యంగా పనిచేసి విజయానికి తోడ్పడాలని కోరారు. రానున్న ఎన్నికల్లో తెదేపా-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో దుర్మార్గపు పాలన ముగిసిపోయి సుపరిపాలన వస్తుందన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైకాపాను ఓడించాలని ఓటర్లు నిర్ణయించుకున్నారన్నారు. తెదేపా తంబళ్లపల్లె నియోజకవర్గ పరిశీలకుడు గురువారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతో తెదేపా, జనసేన పార్టీలు కలిశాయని, రానున్న ఎన్నికల్లో వైకాపా అధికారాన్ని కోల్పోడం ఖాయమన్నారు. సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి, జిల్లా న్యాయ విభాగం అధ్యక్షుడు అమరనాథ్‌, నాయకులు సాయినాథ్‌, రెడ్డిమోహన్‌, శ్రీనివాసులు, శ్రీనాథరెడ్డి, సుకుమార్‌, నారాయణస్వామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని