logo

‘ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉంది’

వైకాపా కార్యకర్త బెనర్జీపై హత్యాయత్నం కేసులో భరత్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలను అక్రమంగా  అరెస్టు చేశారని వారి కుటుంబసభ్యులు ఆరోపించారు.

Published : 29 Nov 2023 02:42 IST

మాట్లాడుతున్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పక్కన సుబ్బలక్ష్మి, రాజేశ్వరి

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: వైకాపా కార్యకర్త బెనర్జీపై హత్యాయత్నం కేసులో భరత్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలను అక్రమంగా  అరెస్టు చేశారని వారి కుటుంబసభ్యులు ఆరోపించారు. తమకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి నుంచి ప్రాణహాని ఉందని భరత్‌కుమార్‌రెడ్డి తల్లి సుబ్బలక్ష్మి, రామ్మోహన్‌రెడ్డి భార్య రాజేశ్వరి  ఆందోళన వ్యక్తం చేశారు. తెదేపా ప్రొద్దుటూరు నియోజకవర్గ బాధ్యుడు ప్రవీణ్‌కుమారెడ్డితో కలిసి మంగళవారం వారు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గతంలో బెనర్జీ తమ వారిని చంపుతామని పలుమార్లు బెదిరించారన్నారు. ఘటన జరిగిన రోజు బెనర్జీ మొదటగా తమ వారిని అసభ్యకరంగా దూషించి దాడి చేయబోయారని, దీంతోనే క్షణికావేశంతో ఘటన జరిగిందన్నారు. ఇది కావాలని చేసిన దాడి కాదన్నారు. దాడి అనంతరం నుంచి ఈ ఘటనపై ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతున్న విషయాలు తమకు భయాన్ని కలిగిస్తున్నాయన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి తమకు న్యాయం చేయాలని కోరారు.

సీబీఐ విచారణకు సిద్ధమా? : తెదేపా నేత నందం సుబ్బయ్య హత్యకేసు, బెనర్జీపై జరిగిన హత్యాయత్నం కేసుల్లో సీబీఐ విచారణ కోరేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దీనికి ఎమ్మెల్యే సిద్ధమా అంటూ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. భరత్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలను పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారని, ఎమ్మెల్యే రాచమల్లు ఒత్తిడితో పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తారన్న అనుమానాలున్నాయన్నారు. వారిని చట్టపరంగానే విచారణ చేయాలన్నారు. తప్పుడు కేసులు నమోదు చేయించడంలో ఎమ్మెల్యే సిద్ధహస్తుడని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని