logo

పాలకుల పాపం... రైతులకు శాపం!

గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగంగా నిర్మించిన నర్రెడ్డి శివరామిరెడ్డి సర్వరాయసాగర్‌ జలాశయం నిర్వహణను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు.

Published : 29 Nov 2023 02:51 IST

ఆయకట్టుకు అందని సాగునీరు
ఇదీ సర్వరాయ సాగర్‌ దుస్థితి

సర్వరాయసాగర్‌ కాలువలో జల ప్రవాహానికి అడ్డుగా జమ్ము

గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగంగా నిర్మించిన నర్రెడ్డి శివరామిరెడ్డి సర్వరాయసాగర్‌ జలాశయం నిర్వహణను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అదే రైతుల పాలిట శాపంగా మారింది. ఏళ్ల తరబడి ఎదురుచూసినా అన్నదాతలకు కన్నీళ్లు తప్పడం లేదు. కరవు పీడిత ప్రాంతంలోని ఆయకట్టుకు నేరుగా సాగునీరందడంలేదు. పనులన్నీ అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రాజెక్టు ద్వారా 25,511 ఎకరాలకు సాగునీరివ్వాలని రూపకల్పన చేసి ఒకటిన్నర దశాబ్దం కిందట పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 3.060 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.769 టీఎంసీల నీరుంది. గండికోట నుంచి కృష్ణా జలాలను విడుదల చేయడంతో మంగళవారం 100 క్యూసెక్కులు చేరగా, కుడి కాలువకు 30 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయంలో నీరు నిలిచే అంతర్భాగంలో ప్రధాన రాతి కట్టడం సగం లోపే చేశారు. దీంతో 1.50 టీఎంసీలు కూడా నిల్వ చేసే పరిస్థితి లేదు. ఎక్కువగా జలాలుంటే వెలుపల వైపున ఊట వస్తోంది. పంట పొలాల్లోకి నీరు చేరడంతో సమీప గ్రామాల్లోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కుడి ప్రధాన కాలువ 16.005 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా, భూసేకరణ సమస్యతో 7.650 కిలోమీటర్లు మాత్రమే తవ్వారు. మెట్ట భూములకు సాగు నీరిచ్చేవిధంగా 17 ఉప కాలువలు 55.09 కి.మీ మేర తవ్వాల్సి ఉండగా, కనీసం 10 శాతం కూడా చేయలేదు. ఎడమ ప్రధాన కాలువ 9.350 కి.మీలకుగానూ ఇప్పటివరకు 8 కి.మీ తవ్వారు. కరవు ప్రాంతంలో బీడువారిన భూములకు నీరివ్వడానికి 11 ఉప కాలువలు 25.287 కి.మీ పొడవునా ఏర్పాటు చేయాల్సి ఉండగా కనీసం ఒక్క కి.మీ కూడా తవ్వలేదు. జలాశయం నీటిని భారతి సిమెంటు పరిశ్రమతోపాటు సీఎం జగన్‌ సమీప బంధువు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న చేపల చెరువులకు వినియోగిస్తున్నారు. రైతుల పొలాలకు మాత్రం నిర్దేశించిన ఆయకట్టులో నాలుగో వంతు కూడా నేరుగా అందడం లేదు. ప్రధాన కాలువల్లోనూ నీటి ప్రవాహానికి అడుగడుగునా అడ్డంకులుండగా, నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జమ్ము ఏపుగా పెరిగిపోయింది. కాలువలో వస్తున్న నీటిని మోటార్ల ద్వారా రైతులు తోడుకుని సాగు చేసిన పైర్లకు జీవ తడులు అందించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఉప, పంట కాలువలు ఏర్పాటు చేసి ఉంటే వర్షాభావంతో పంటలు దెబ్బతినకుండా కాపాడుకునే పరిస్థితి ఉండేది. గత కొన్నేళ్లుగా జల నడకలకు కీలకమైన కాలువల మాటను మరిచారు. ఈ పనులు పూర్తయ్యేదెన్నడు, పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందేదెన్నడు అని కర్షకులు ప్రశ్నిస్తున్నారు. లీకులు, ఊట నియంత్రణకు కట్ట పటిష్ట పనులు చేయాలని సాంకేతిక నిపుణుల బృందం సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల పనులను చేపట్టారు. అసంపూర్తిగా ఉన్న కట్ట రాతికట్టడం, కాలువల పనులన్నీ పూర్తవ్వగానే ఆయకట్టుకు నీరందించడానికి చర్యలు తీసుకుంటామని జీఎన్‌ఎస్‌ఎస్‌ ఎస్‌ఈ మల్లికార్జునరెడ్డి ‘న్యూస్‌టుడే’కి తెలిపారు.

అసంపూర్తిగా కాలువ నిర్మాణ పనులు

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, కడప

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని