logo

క్రీడల్లో మెరికలు... విజయ కిశోరాలు

సాంకేతిక విద్యనభ్యసిస్తూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు జేఎన్‌టీయూ అనంతపురం తరపున సౌత్‌జోన్‌ స్థాయి పోటీలకు ఎంపికై క్రీడల్లో రాణిస్తున్నారు.

Updated : 29 Nov 2023 06:20 IST

ఆరు జిల్లాల జట్లపై చాటిన సత్తా
అయిదు రాష్ట్రాల వర్సిటీలతో పోటీ
న్యూస్‌టుడే, చాపాడు, కొండాపురం, ప్రొద్దుటూరు విద్య

ప్రత్యర్థులతో తలపడుతున్న యువకులు

సాంకేతిక విద్యనభ్యసిస్తూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు జేఎన్‌టీయూ అనంతపురం తరపున సౌత్‌జోన్‌ స్థాయి పోటీలకు ఎంపికై క్రీడల్లో రాణిస్తున్నారు. ఇటీవల నెల్లూరు, వైయస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన వివిధ ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి ఎంపికైన వీరు అయిదు రాష్ట్రాల్లోని అంతర్‌ విశ్వవిద్యాలయాలతో పోటీ పడుతున్నారు. ఒకపక్క చదువుపై శ్రద్ధ పెడుతూ మంచి ఫలితాలతో భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకున్న యువతపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.


పోలీస్‌ శాఖలో కొలువు సాధిస్తా : వాలీబాల్‌ రాష్ట్ర స్థాయిలో పాల్గొని ప్రథమ బహుమతి సాధించా. దక్షిణాధి రాష్ట్రాల స్థాయికి ఎంపికవడం ఆనందంగా ఉంది. కేరళలో వాలీబాల్‌తోపాటు, ఖోఖో జట్టులో కూడా ప్రథమ స్థానం సాధించడం ఆనందం కలిగించింది. బీటెక్‌లో 76 శాతం మార్కులున్నాయి. ఎస్సై ఉద్యోగం సాధించాలని నా లక్ష్యం.

ఎస్‌.నాగధరణి, ఇంజినీరింగ్‌ విద్యార్థిని, కొర్రపాడు


క్రీడలకు ప్రోత్సాహం అవసరం : ఆరో తరగతి నుంచి వాలీబాల్‌ నేర్చుకున్నా. ప్రథమ బహుమతులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండు బంగారు పతకాలు అందుకున్నా. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులకు అన్నింటా ప్రోత్సహిస్తే చక్కగా రాణిస్తారు. చెన్నైలో జరగబోయే సౌత్‌జోన్‌ పోటీలకు వెళ్లనున్నా.

ఎ.అనూష, ఎంబీఏ విద్యార్థిని, అర్కటవేముల


అఖిలభారత స్థాయిలో విజేత  : గతేడాది జేఎన్‌టీయూ తరపున ఆలిండియా స్థాయి తమిళనాడులోని మంగళూరులో బాల్‌బ్యాడ్మింటన్‌ ఆడాను. ప్రథమ స్థానం సాధించా. మళ్లీ రెండోసారి ఎంపికయ్యా. జిల్లా స్థాయిలో మూడుసార్లు ప్రథమ స్థానం సాధించడంతో స్ఫూర్తి కలిగింది. డిప్లొమా చదువుతుండగా జోనల్‌ స్థాయిలో బహుమతులు ప్రథమ, ద్వితీయ (విన్నర్‌, రన్నర్‌గా) బహుమతులు అందుకున్నా. బీటెక్‌లో 80శాతం మార్కులున్నాయి. మంచి ఉద్యోగం సాధించి ప్రజలకు సేవ చేస్తా.

ఎం.పవన్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థి, దొరసానిపల్లె


పోలీసు అధికారి కావాలని లక్ష్యం : ఈ నెల 9న సామర్లకోటలో సౌత్‌జోన్‌ కబడ్డీ పోటీల్లో  ప్రథమ స్థానం సాధించా. 113 విశ్వవిద్యాలయాల క్రీడాకారులు పాల్గొనగా అందులో కువెంపుతో తలపడ్డాం. బీటెక్‌ ప్రథమ సంవత్సరం చదివేటప్పుడు జాతీయ పోటీలు గోవాలో జరిగాయి అక్కడ తమిళనాడు జట్టుపై ప్రథమ స్థానంలో నిలిచాం. బంగారు పతకం సాధించా. ప్రోకబడ్డీలో పాల్గొనడం నా లక్ష్యం. చదువులో 76 శాతం మార్కులున్నాయి. పోలీసు కావాలని ఉంది.

డి.ఖ్యాతివర్ధన్‌రెడ్డి, ఈసీఈ విద్యార్థి, చియ్యపాడు


సాధనలోనే విజయం దాగుంది : షటిల్‌ బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ నేర్చుకున్నా. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి సాధించా. సౌత్‌జోన్‌ పోటీలకు ఎంపికవడం సంతోషంగా ఉంది. సాధన చేసే ఏ ఆటలోనైనా సులభంగా విజేతగా నిలువవచ్చని తెలుసుకున్నా.

బి.శ్రావణి, ఈఈఈ విద్యార్థిని, ప్రొద్దుటూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని