logo

ఉపాధి మొక్కలు.. నిధులకు దిక్కులు!

రాళ్ల నేలలో రతనాల పంటలు పండించాలి. మెట్ట భూముల్లో ఉద్యాన తోటల సాగుకు ఊతమివ్వాలి. సంప్రదాయ పైర్లతో నష్టపోయినా కర్షకులను పండ్ల తోటల వైపు నడిపించాలి.

Published : 29 Nov 2023 02:58 IST

సన్న, చిన్నకారు రైతులకు తప్పని అవస్థలు
ఇదీ నరేగాలో పండ్ల తోటల సాగు దుస్థితి

‘రాళ్ల నేలలో రతనాల పంటలు పండించాలి. మెట్ట భూముల్లో ఉద్యాన తోటల సాగుకు ఊతమివ్వాలి. సంప్రదాయ పైర్లతో నష్టపోయినా కర్షకులను పండ్ల తోటల వైపు నడిపించాలి. ఔత్సాహిక అన్నదాతలను వెన్నుతట్టి ప్రోత్సహించాలి. కరవును జయించేలా బిందు వైపు అడుగులు పడేలా తోడ్పాటునందించాలి. సన్న, చిన్నకారు రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. అధిక ఫలసాయం పొందటానికి ఉపాధి హామీ పథకం నిధులతో ఊతమివ్వాలి’ అని అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో నాటిన మొక్కల సంరక్షణకు రైతులు అవస్థలు పడుతున్నారు. అందరికీ సకాలంలో నిర్వహణ పద్దు రావడం లేదు. దుక్కులు, నీటితడులు, ఎరువుల బిల్లుల చెల్లింపులకు నిధుల కొరత వెంటాడుతోంది. ఫలితంగా సన్న, చిన్నకారు రైతులకు కన్నీళ్లు తప్పడంలేదు.

ఒంటిమిట్ట మండలం రాచగుడిపల్లెలోని మహిళా రైతు వారణాసి పుల్లమ్మకు చెందిన అయిదెకరాల్లో ఈ ఏడాది జులై 15న డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి స్వయంగా బత్తాయి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నాలుగున్నర నెలలు గడిచిపోయాయని, ఇంతవరకు సేద్యం దుక్కులు, నీటి తడులు, ఎరువుల బిల్లులు చెల్లించలేదని లబ్దిదారు వాపోతున్నారు. డబ్బులు ఇవ్వాలని పలుమార్లు  ఉపాధిహామీ పథకం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని కన్నీటి పర్యంతమవుతున్నారు.

న్యూస్‌టుడే, కడప, సుండుపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. వైయస్‌ఆర్‌, అన్న మయ్య జిల్లాల్లో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 65 మండలాల్లో 3,615 పనులు చేపట్టాలని అనుమతిచ్చారు. ఈసారి 8,091.79 ఎకరాల్లో మొక్కలు నాటించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. అన్ని రకాలు కలిపి 6,77,891 మొక్కలను నాటించాలని ప్రణాళిక రూపొందించారు. ఎకరా విస్తీర్ణంలో సాగుకు నేరేడు 40, సపోట 60, చింత 60, మామిడి 70, జామ 100, చీనీ 100, నిమ్మ 110, సీతాఫలం 240, దానిమ్మ 267, డ్రాగన్‌ఫ్రూట్‌ 450 (అరెకరా)లో మొక్కలిస్తున్నారు. అనుమతిచ్చిన నర్సరీల్లో తెచ్చుకోవాలని డ్వామా అధికారులు ఎంపిక చేసిన లబ్ధిదారులకు కూపన్లు ఇస్తున్నారు. ఇప్పటికీ 3,530 పనుల్లో 6,39,783 గుంతలు తవ్వారు. రెండు జిల్లాల్లో కలిపి 3,421 పనుల్లో 7,710.43 ఎకరాల్లో 6,11,053 మొక్కలు నాటించారు. సాగునీటి వనరుల్లేని ప్రాంతాల్లో ఒక తడికి మొక్కకు రూ.5.40 వంతున నెలకు నాలుగు సార్లు నీరందించ డానికి నిధులివ్వాల్సి ఉంది. ఏడాదికి ఎరువులు వేయడానికి ఒక్కో మొక్కకు రూ.25 చెల్లించాలి. ఆరు నెలలకొకసారి రూ.12.50 మేర ఇవ్వాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయినా చాలామందికి బిల్లులు చెల్లించలేదు. సాగుకి ముందే లోతు దుక్కులు చేసుకున్న వారికి డబ్బులు చెల్లించాల్సి ఉన్నా ఆ ఊసే లేదు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. రైతుల ఖాతాల్లో సక్రమంగా డబ్బులు జమ చేస్తున్నారా లేదా అని పరిశీలన చేయడం లేదు. ఇదే అన్నదాతలకు శాపంగా మారింది. నరేగాతో భరోసా లభిస్తుందని ఆశించిన కర్షకులకు కన్నీళ్లు తప్పడం లేదు.

గత నాలుగేళ్లుగా రిక్తహస్తమే...

ఈ ఏడాదిలోనే కాకుండా 2019-20, 2020-21, 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లోనూ చాలామందికి రావాల్సిన నిధులు అందలేదు. క్షేత్ర, సాంకేతిక సహాయకులు, ఏపీవోలు, ఏపీడీల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం మొక్కకు చెల్లిస్తున్న ధర కంటే ప్రైవేటు నర్సీరీల్లో అదనంగా 50 శాతానికి పైగా పలుకుతున్నాయి. రకం, ఎత్తు, దిగుబడి, కాయల నాణ్యతను పరిగణనలోకి తీసుకొని వ్యాపారులు వసూలు చేస్తున్నారు. డ్వామా యంత్రాంగం ఇస్తున్న కూపన్లు తీసుకుని అదనంగా చెల్లించాల్సి రావడంతో రైతులపై భారం పడుతోంది. వాస్తవంగా ఈ ఏడాది ఆగస్టులోగా సాగు పనులు పూర్తి చేయించాలని నిర్ణయించినా వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడాది డిసెంబరు వరకు పొడిగించారు. మరోవైపు బెట్ట పరిస్థితులతో నాటిన మొక్కల సంరక్షణ హలధారికి భారంగా మారుతోంది. నరేగా పద్దు విడుదల చేయడంలోనూ జాప్యం జరుగుతోంది. పని గుర్తింపు సంఖ్య (ఐడీ), బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు, పట్టాదారు పుస్తకాల్లో భూమి వివరాల నమోదులో పొరపాట్లు జరగడంతోనే కొంత ఆలస్యమవుతోందని సిబ్బంది చెబుతున్నారు. బిల్లుల చెల్లింపు విషయంపై మాట్లాడే సిబ్బందిపై అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క రైతులందరికీ సకాలంలో బిందు సేద్యం పరికరాలివ్వడంలేదు. నీటి తడులకు డబ్బులిస్తామని చెప్పడంతో కొంతమంది బిందు సేద్యం పరికరాలపై ఆసక్తి చూపడంలేదు.


వివరాలు సేకరించి చెల్లిస్తాం

ఉపాధిహామీ పథకం కింద సాగు చేస్తున్న లబ్ధిదారులకు నిర్వహణ నిధులు చెల్లిస్తున్నాం. అక్కడక్కడ కొందరికి డబ్బులందలేదని మా దృష్టికి వచ్చింది. ఎవరికైతే నిధులు జమకాలేదో సమాచారం సేకరించి త్వరలో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం.

పి.యధుభూషణ్‌రెడ్డి, పీడీ, డ్వామా, కడప


అడుగుతున్నా పలకడంలేదు

మాకున్న అయిదెకరాల్లో ఈ ఏడాది జులై 15న డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి వచ్చి చీనీ మొక్కలు నాటారు. ఇప్పటికే నాలుగున్నర నెలలు గడిచిపోగా, ఇంతవరకు దుక్కులు, నీటితడులు, ఎరువుల డబ్బులు ఇవ్వలేదు. పలుమార్లు అధికారులను అడిగినా పలకడం లేదు. నిర్వహణ డబ్బులు చెల్లించి ఆదుకోవాలి.

వారణాసి జనార్ధన్‌, రైతు, రాచగుడిపల్లె, ఒంటిమిట్ట మండలం


ఇంతవరకు ఇవ్వలేదు

మెట్ట భూమిలో రెండు నెలల కిందట మామిడి మొక్కలు నాటాను. మాకైతే డబ్బులివ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని సిబ్బందిని అడిగితే వస్తే ఇస్తామని చెబుతున్నారు. బిందుసేద్యం పరికరాలివ్వాలని విన్నవించగా ఎకరాకు రూ.10 వేలు కట్టాలని చెబుతున్నారు. అంత డబ్బు కట్టే ఆర్థిక స్థోమత మాకు లేదు.

ఎన్‌.పెంచలయ్య, రైతు, రాచగుడిపల్లె, ఒంటిమిట్ట మండలం


ఎదురుచూపులే మిగిలాయి

నాలుగేళ్ల కిందట ఉపాధిహామీ పథకం కింద రెండున్నర ఎకరాల్లో మామిడి తోట సాగు చేశాను. తొలి ఏడాది డబ్బులిచ్చారు. అన్ని పనులు జరిగినట్లు కొలతల పుస్తకంలో నమోదు చేశారు. అనంతరం నిర్వహణ నిధులివ్వలేదు. అధికారులను పలుమార్లు అడిగినా ఫలితం లేదు. మాకు ఎదురుచూపులే మిగిలాయి.

ఎల్‌.రవి, రైతు, వావిలొడ్డు, సుండుపల్లి మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని