logo

ఆహ్లాద తీరం... అభివృద్ధికి దూరం

అక్కడ ఎటుచూసినా చూడముచ్చటేసే ఆహ్లాదకర వాతావరణం. కనుచూపుమేర జల సోయగం. ఎత్తయిన గిరులు..  పచ్చని చెట్లు రా రమ్మంటూ స్వాగతం పలుకుతాయి. అరుదైన పక్షిజాతులు, వన్యప్రాణులు సందడి చేస్తాయి

Updated : 30 Nov 2023 06:40 IST

సోమశిల వెనుక జలాల ప్రాంతంలో ప్రగతి తీరిదీ

నిరుపయోగంగా వన విహారి కేంద్రానికి ఎంపిక చేసిన స్థలం

న్యూస్‌టుడే, కడప: అక్కడ ఎటుచూసినా చూడముచ్చటేసే ఆహ్లాదకర వాతావరణం. కనుచూపుమేర జల సోయగం. ఎత్తయిన గిరులు..  పచ్చని చెట్లు రా రమ్మంటూ స్వాగతం పలుకుతాయి. అరుదైన పక్షిజాతులు, వన్యప్రాణులు సందడి చేస్తాయి... ఇలాంటి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని రూపొందించిన ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. నెల్లూరు జిల్లాలో నిర్మించిన సోమశిల జలాశయంతో ఉమ్మడి కడప జిల్లాలో 105 గ్రామాలు పూర్తిగా, మరో తొమ్మిది పల్లెలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. ఇక్కడ నిర్వాసితులకు 90 శాతానికి పైగా దశలవారీగా పరిహారం చెల్లించారు. ఆ తర్వాత ఉమ్మడి కడపతోపాటు నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలను కలిపి ‘పెనుశిల నరసింహ అభయారణ్యం’గా చేయాలని 1997లో ప్రభుత్వం నిర్ణయించారు. ఆ తర్వాత ఒంటిమిట్ట మండలం కోటపాడు సమీపంలో సాముదాయక అటవీ పర్యావరణ పర్యాటక పథకం (ఏకో టూరిజం) ఏర్పాటుకు 2010లో అప్పటి కేంద్రమంత్రి ఎ.సాయిప్రతాప్‌, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. దీనిపై ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు.

 బోటు షికారేది?

ఒంటిమిట్ట, అట్లూరు, సిద్దవటం, గోపవరం, నందలూరు, పెనగలూరు, చిట్వేలి మండలాల ప్రాంతంలో వెనుక జలాలు నిల్వ ఉంటాయి. ఈ ప్రాంతంలో బోటు షికారుతో పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేయాలని నాడు ప్రణాళికలు రూపొందించినా అమలు కాలేదు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘వన విహారి’ని తెరపైకి తీసుకొచ్చారు. మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.2 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. తొలివిడతలో 2020 ఆగస్టు 30న రూ.50 లక్షలు ఇస్తామని ఉన్నతాధికారులు ముందుకొచ్చారు. మూడేళ్లయినా అతీగతీ లేదు. అక్కడ రహదారి అధ్వానంగా ఉంది. వన్యప్రాణుల చిత్రాలతో ఏర్పాటు చేసిన సూచికలు పాడై కళాహీనంగా ఉన్నాయి. కేవలం సరిహద్దు దిమ్మెలు మాత్రమే నిర్మించారు. అనుమతి లేకుండా సాగిస్తున్న చేపల వేట వివాదాస్పదం అవుతోంది.
గస్తీకి సుస్తీ : సోమశిల వెనుక జలాల పరిసర ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా, అనధికారిక చేపల వేట,  వన్యప్రాణుల వేటగాళ్లను కట్టడి చేయాలని ఏడేళ్ల కిందట డీజిల్‌తో నడిచే బోటును కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. కొన్నాళ్లు పనిచేసిన తర్వాత అది మొరాయించింది. దానికి మరమ్మతులు చేయించలేదు. మాధవరం, పొన్నాపల్లి, చింతలకుంట, ముత్తుకూరు బీట్ల పరిధిలో నదికి అటు ఇటు నీరు ఉండటంతో క్షేత్రస్థాయిలో గస్తీ చేయడం కష్టంగా మారింది.  


వన విహారి అభివద్ధికి చర్యలు

సోమశిల వెనుక జలాలు నిల్వ ఉన్న ప్రాంతాన్ని పర్యాటకపరంగా తీర్చిదిద్దుతాం.  కోటపాడు సమీపంలో వన విహారి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఈ సారి రూ.55 లక్షలు నిధులు కేటాయించారు. ప్రాధాన్యత క్రమంలో ఇక్కడ మౌలిక వసతులు కల్పిస్తాం. పెనుశిల నరసింహ అభయారణ్యంలో నిఘా పెట్టాం. పంటల సాగు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకొంటాం.
సందీప్‌రెడ్డి, జిల్లా అటవీ అధికారి, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని