logo

వైకాపా పాలనలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ నిర్వీర్యం

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబరు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపు మునిరెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య దుయ్యబట్టారు

Published : 30 Nov 2023 05:52 IST

15న కడపలో సర్పంచుల సమస్యలపై సదస్సు

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబరు, సర్పంచుల సంఘం నాయకులు

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబరు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపు మునిరెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య దుయ్యబట్టారు. కడప నగరంలోని వికాస్‌ పాఠశాలలో బుధవారం ఛాంబరు, సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చి, వారిపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చేస్తోందని విమర్శించారు. ఈ  తీరును నిరసిస్తూ  సర్పంచుల విధులు-నిధుల కోసం కడపలో డిసెంబరు 15న ఉమ్మడి రాయలసీమ పరిధిలోని ఉమ్మడి కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు (జోన్‌-4) జిల్లాలకు సంబంధించి భారీ సదస్సును నిర్వహిస్తామని వెల్లడించారు. సదస్సుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడితో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించామన్నారు. సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుధాకర్‌, కార్యదర్శి వాసు, పంచాయతీరాజ్‌ ఛాంబరు రాష్ట్ర అధికార ప్రతినిధి యల్లారెడ్డి మాట్లాడుతూ సచివాలయాల రాకతో గ్రామాల్లో సర్పంచులకు విలువ లేకుండా పోయిందన్నారు. జగన్‌ సర్కార్‌లో గ్రామాల్లో మంచి నీటి సరఫరా లేక, గుంతల రోడ్లతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, సర్పంచులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని