logo

కరవు కాటుతో కందిపోతున్న కర్షకులు

కరవు కాటుతో జిల్లాలో సాగవుతున్న ఖరీఫ్‌ కంది పంట వాడుముఖం పట్టింది. పంటను కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో కంది సాధారణ విస్తీర్ణం 3,453 హెక్టార్లు కాగా, విపణిలో మంచి ధరలు ఉండడంతో అధికంగా 5,117 హెక్టార్లలో సాగు చేశారు

Published : 30 Nov 2023 05:55 IST

ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు వంక నుంచి ట్రాక్టరు ఇంజిన్‌ ద్వారా తరలిస్తున్న నీరు

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, కడప: కరవు కాటుతో జిల్లాలో సాగవుతున్న ఖరీఫ్‌ కంది పంట వాడుముఖం పట్టింది. పంటను కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో కంది సాధారణ విస్తీర్ణం 3,453 హెక్టార్లు కాగా, విపణిలో మంచి ధరలు ఉండడంతో అధికంగా 5,117 హెక్టార్లలో సాగు చేశారు. అక్టోబరులో సాధారణ వర్షపాతం 130.4 మి.మీ.గాను 4.2, నవంబరులో 76.9 మి.మీ.గాను 25.6 మి.మీ. మాత్రమే వర్షం కురిసింది. దీంతో బెట్టకు కందిపోతున్న పైరును చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు. పంట పొలాల సమీపంలోని కాలువలు, వాగులు, వంకల్లోని నీటిని ట్రాక్టర్లు, ఆయిల్‌ ఇంజిన్ల సాయంతో తోడి నీటితడులు అందిస్తున్నారు. ఎకరాకు నీటిని తోడేందుకు బాడుగ వ్యయం రూ.6,500, కూలీకి రూ.1000 నుంచి రూ.1,500 ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. సాగు కోసం వెచ్చించిన పెట్టుబడి దక్కుతుందని ఆశతో నీటితడులు అందిస్తున్నామంటున్నారు. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 7-9 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని,  ప్రస్తుత పరిస్థితులతో 2-3 క్వింటాళ్లు రావడం గగనమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం సొంత జిల్లాలో కరవు పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా పట్టించుకోవడం లేదని వారు కన్నీటిపర్యంతమవుతున్నారు.


పంటను చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు

 ఈ ఏడాది 16 ఎకరాల్లో కంది సాగు చేశాను. ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి పెట్టాను. రెండు నెలల నుంచి చినుకు జాడ లేక వాడుముఖం పట్టింది. చేలోకి వెళ్లి పైరును చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు. అన్ని అనుకూలిస్తే ఎకరాకు 7-8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈసారి కనీసం 2 క్వింటాళ్లు చేతికందే పరిస్థితి లేదు. సాగుకి పెట్టిన పెట్టుబడి వస్తుందని ఆశతో నీటితడులందిస్తున్నాం. ఇందుకు ఎకరాకు ట్రాక్టరు బాడుగ రూ.6,500, ఒక్కో కూలికి రూ.1000 ఖర్చు చేస్తున్నాం. మా పరిస్థితి దయనీయంగా ఉంది.

భాస్కర్‌రెడ్డి, రైతు, తిప్పలూరు, ఎర్రగుంట్ల మండలం


మంచి పదును కోసం ఎదురుచూస్తున్నాం

వర్షాధారంగా పత్తి పంటను మూడెకరాల్లో, కంది పైరు రెండున్నర ఎకరాల్లో వేశాను. రెండు నెలలుగా మంచి పదును కురుస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నాం. వరుణుదేవుడు కరుణ చూపలేదు. మాకు వ్యవసాయ బోర్లు లేవు. వర్షాన్ని నమ్ముకొని పంటలు వేస్తే కష్టాలు తప్పడం లేదు. వాడిపోయి ఎండకాలిపోతోంది. కనీసం పెట్టిన ఖర్చులు కూడా చేతికి దక్కే పరిస్థితి లేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి ముందుకు రావాలి.
 వీరయ్య, రైతు, కోనాపురం, ముద్దనూరు మండలం


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని