logo

ముస్లింలను మోసం చేసిన సీఎం జగన్‌ : తెదేపా

ముస్లిం మైనార్టీలను ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మోసం చేస్తూనే ఉన్నారని, వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ సంక్షేమాన్ని విస్మరించారని తెదేపా నేతలు ఆరోపించారు.

Published : 30 Nov 2023 05:58 IST

 సదస్సులో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఫరూక్‌, పక్కన నేతలు లింగారెడ్డి, చాంద్‌బాషా, శ్రీనివాస్‌, అమీరుబాబు తదితరులు
అరవిందనగర్‌(కడప), న్యూస్‌టుడే: ముస్లిం మైనార్టీలను ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మోసం చేస్తూనే ఉన్నారని, వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ సంక్షేమాన్ని విస్మరించారని తెదేపా నేతలు ఆరోపించారు. కడప నగరంలో బుధవారం ఉమ్మడి కడప జిల్లా తెదేపా ముస్లిం మైనార్టీల సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌ను ముస్లింలు నమ్మడంతో గంపగుత్తగా ఓట్లేశారని, అధికారంలోకి వచ్చాక ఆయన వారి నమ్మకాన్ని వమ్ము చేశారని విమర్శించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కడప జిల్లాలోని 40 మసీదులకు నిధులు మంజూరు చేస్తే, వైకాపా పాలకులు నేటికీ ఇవ్వలేదని ఆరోపించారు. హజ్‌హౌస్‌ను కాపాడుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా వైయస్‌ఆర్‌ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి మాట్లాడుతూ గతంలో 24 వేల మందికి దుల్హన్‌ పథకం అందిస్తే ప్రస్తుత పాలకులు పలు నిబంధనలతో కేవలం 4వేల మందికి మాత్రమే ఇచ్చారని తెలిపారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమాన్ని వైకాపా సర్వనాశనం చేసిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ముస్లింలు ఐక్యంగా ఉండి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. సదస్సు పరిశీలకులు, కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా మాట్లాడుతూ రాష్ట్రంలోని ముస్లిం పేదలు నాలుగున్నరేళ్లగా నిరుపేదలుగా మారారన్నారు. 2014లో రాష్ట్రంలో లోటుబడ్జెట్‌ ఉన్నా రూ.2,500 కోట్లు కేటాయించిన ఘనత చంద్రబాబుదేదన్నారు. తెదేపా ముస్లిం మైనారిటీ విభాగం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అమీరుబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి మైనార్టీల ద్రోహిగా నిలిచారన్నారు. అనంతరం ఇస్లామిక్‌ బ్యాంకు ఏర్పాటు చేయాలని, హజ్‌హౌస్‌ను వెంటనే అన్ని వసతులతో ప్రారంభించాలని, దుల్హన్‌ పథకానికి నిబంధనలు తొలగించాలని, విదేశీ విద్య పూర్తిస్థాయిలో అమలు చేయాలని, రంజాన్‌తోఫాను తిరిగి ప్రారంభించాలని, ఉర్దూ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలని, ముస్లింలకు రక్షణ కల్పించాలని, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను పునరుద్ధరించాలని, ముస్లింలకు కేటాయించిన రూ.2 వేల కోట్లను వారికే ఖర్చు చేయాలని తదితర తీర్మానాలు చేశారు. సదస్సులో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్‌తాజ్‌, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లింలు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని