logo

బీటెక్‌ రవిపై ఎందుకంత కోపం?

పులివెందుల.. ఇటీవల మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు బీటెక్‌ రవి అరెస్టుతో జిల్లాలో చర్చకు దారితీసింది. ప్రముఖుల పర్యటన సమయంలో విమానాశ్రయం ముఖద్వారం వద్ద ప్రవేశాల విషయంలో వివాదాలు చోటుచేసుకోవడం సర్వసాధారణం.

Updated : 30 Nov 2023 06:42 IST

అక్రమ కేసు.. అరెస్టు తదితర పరిణామాలన్నీ వివాదాస్పదమే

ఈనాడు, కడప, పులివెందుల,  పులివెందుల గ్రామీణ, వేంపల్లె:  పులివెందుల.. ఇటీవల మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు బీటెక్‌ రవి అరెస్టుతో జిల్లాలో చర్చకు దారితీసింది. ప్రముఖుల పర్యటన సమయంలో విమానాశ్రయం ముఖద్వారం వద్ద ప్రవేశాల విషయంలో వివాదాలు చోటుచేసుకోవడం సర్వసాధారణం. అలాంటిది పది నెలల కిందట తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రాక సందర్భంగా కడప విమానాశ్రయం వద్ద చోటుచేసుకున్న చిన్నపాటి ఘటనకు సంబంధించిన కేసులో బీటెక్‌ రవి అరెస్టు కావడంతో 15 రోజుల పాటు కడప కేంద్ర కారాగారంలో ఉండాల్సి వచ్చింది. ఈయనకు సౌమ్యుడనే పేరుంది. పోలీసులు స్టేషన్‌కు రమ్మంటే వచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తిని అకస్మాత్తుగా దారి మధ్యలో అదుపులోకి తీసుకోవడం, ఆయన నుంచి చరవాణులు స్వాధీనం చేసుకుని నిలిపేయడం, మూడు గంటల పాటు అటు.. ఇటు తిప్పడంతోపాటు చంపాలనే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నియోజకవర్గ కేంద్రమైన పులివెందులలో అధికార వైకాపాకు లేనంతగా తెదేపా కార్యాలయానికి అతి పెద్ద భవంతిని నిర్మించి ఇటీవల భారీ జనం మధ్య ప్రారంభించారు. ఈ భవనం విస్తృత ప్రచారంలోకి రావడం కీలక నేతలకు కంటగింపుగా మారిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తెదేపా చరిత్రలోనే పులివెందులలో కొన్ని నెలల కింద జరిగిన తెదేపా అధినేత చంద్రబాబు సభకు భారీగా జనం తరలివచ్చారు. చంద్రబాబు ప్రసంగానికి విశేష స్పందన లభించింది. వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు జరిగాయి. పులివెందులలో సైతం మార్పు వస్తోందనే ప్రచారం ఊపందుకుంది. చంద్రబాబు అరెస్టు తరుణంలో దీక్షలు సైతం చేపట్టారు. పులివెందులకు చెందిన భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఈ పరిణామాలన్నీ కీలక నేతలకు ఆగ్రహం తెప్పించిన క్రమంలోనే బీటెక్‌ రవి అరెస్టు వరకు వెళ్లిందనే ప్రచారం నడుస్తోంది. ఈయన అరెస్టుతో ఆయనపై సానుభూతి పెరగడం తప్ప సాధించింది ఏమీ లేదని రాజకీయ విశ్లేషణ సాగుతోంది. ఈ విషయయంలో పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ విషయమై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ తీవ్ర స్థాయిలో స్పందించారు. పోలీసు అధికారుల తీరును తీవ్రంగా ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఓ పోలీసు అధికారి లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అధికారిపై పోరాడతామని హెచ్చరించారు. ఇలా బీటెక్‌ రవి అరెస్టుతో వరుస పరిణామాలు చోటుచేసుకున్నాయి.

 బెయిల్‌ మంజూరుతో సంబరాలు : బీటెక్‌ రవికి బెయిల్‌ మంజూరవ్వడంతో పులివెందుల, వేంపల్లెలో బుధవారం తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకొన్నారు. కడప కేంద్ర కారాగారం నుంచి ప్రత్యేక వాహనంలో పులివెందులకు చేరుకున్న ఆయనకు నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి పూలమాలలు వేశారు. అనంతరం బాణసంచా పేల్చారు. కొందరు కార్యకర్తలు ఆయనను భుజాలపై ఎత్తుకుని ఊరేగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని