logo

తవ్వుతున్నదెవరో... తరలిస్తున్నదెవరో?

నదుల్లో ఇసుక తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతోంది. తవ్వుతున్నదెవరు, తరలిస్తున్నదెవరని ఎక్కడ ఎవరిని అడిగినా మాకు తెలియదనే సమాధానమే వస్తోంది. ఊరూపేరూ లేకుండానే అక్రమ రవాణా సాగుతుండడం గమనార్హం.

Updated : 30 Nov 2023 06:40 IST

ఎక్కడ  ఎవరిని అడిగినా తెలియదనే సమాధానం
జేపీ సంస్థతప్పుకొన్నా ఆగని ఇసుక తవ్వకాలు
అన్ని రేవుల్లో యథేచ్ఛగా  కొనసాగుతున్న దందా
ఈనాడు, కడప

  అన్నమయ్య జిల్లా  పెద్దతిప్పసముద్రం మండలం అంకిరెడ్డిపల్లె వద్ద సంపతికోట వాగులో ఇసుక తరలింపులో ట్రాక్టర్ల సందడి

నదుల్లో ఇసుక తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతోంది. తవ్వుతున్నదెవరు, తరలిస్తున్నదెవరని ఎక్కడ ఎవరిని అడిగినా మాకు తెలియదనే సమాధానమే వస్తోంది. ఊరూపేరూ లేకుండానే అక్రమ రవాణా సాగుతుండడం గమనార్హం. గతంలో జేపీ సంస్థ ముసుగులో తవ్వకాలు సాగగా, తాజాగా టెండర్లు వ్యవహారం తేలకుండానే రేవుల్లో ఇసుక మాయమవుతోంది. నదుల్లో ఎంత తవ్వుతున్నారో, ఎంత తరలించుకుపోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అసలు ఇసుక వ్యాపారం ఎవరి చేతుల్లో ఉంది, ఏం జరుగుతోందనే తెలియకుండానే రూ.కోట్ల విలువైన సహజ సంపద తరలిపోతోంది.  ఫలితంగా ఒకపక్క అధిక ధరలతో భవన నిర్మాణదారులకు భారంగా మారుతుండగా, మరోపక్క కరవు తాండవిస్తున్న నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి.

 నదుల్లో ఇసుక తవ్వకాలు, రవాణాకు జేపీ సంస్థ గడువు తీరిపోయిందంటూ ఇటీవల గనులశాఖ అధికారులు హడావుడి చేసి రేవులను మూసివేశారు. అనంతరం కొంతమంది అధికార వైకాపా నేతలు రేవుల్లో రంగప్రవేశం చేసి ఇసుక తవ్వకాలు, రవాణాను ప్రారంభించారు. కొత్తవారి చేతిలో అనధికారికంగా రేవులను పెట్టడానికి సాగిన నాటకం వెలుగులోకి వచ్చింది. వైయస్‌ఆర్‌ జిల్లా సిద్దవటం మండల పరిధిలోని  పెన్నానది తీరంలోని ఎస్‌.రాజంపేట, జంగాలపల్లె, టక్కోలి, మూలపల్లె వద్ద ఇసుక తవ్వకాలు, రవాణా అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. పాపఘ్నినది తీరంలోని పెండ్లిమర్రి మండలం నందిమండలం సమీపంలోని కొత్తగంగిరెడ్డిపల్లె, వీరపునాయునిపల్లె సంగమేశ్వరస్వామి ఆలయ సమీపంలో భారీఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇలా వైయస్‌ఆర్‌ జిల్లా మొత్తంగా కొత్తగా రంగప్రవేశం చేసిన వ్యక్తులు అక్రమంగా ఇసుక దందా సాగిస్తున్నారు. వీరి గుట్టు బయటపడకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇసుక రేవుల సమీప గ్రామాల ప్రజలు ఎవరు తవ్వుతున్నదంటూ ఆరా తీయడం మినహా సమాచారం మాత్రం లభించకపోవడం గమనార్హం.

 పీటీఎంలో రైతులపై దయ లేకుండా!

అన్నమయ్య జిల్లా చెయ్యేరు నదిలో గత నాలుగేళ్లుగా భారీఎత్తున తవ్వకాలు, రవాణా కొనసాగుతోంది. జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతల కనుసన్నల్లో దందా సాగుతోంది. పెద్దతిప్పసముద్రం మండలం అంకిరెడ్డిపల్లె వద్ద సంపతికోట వాగులో ఇసుక అక్రమ రవాణాను అధికార వైకాపాకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు సాగిస్తున్నారు. ఇక్కడ నుంచి నిత్యం 100 ట్రాక్టర్లలో అక్రమంగా తరలిపోతుండడంతో వాగులో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇప్పటికే కరవుతో అల్లాడిపోతున్నామని, పంటలను కాపాడుకోలేని స్థితిలో బోర్లు ఎండిపోతున్నాయని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నా ఇసుకాసురులు మాత్రం తవ్వకాలు ఆపడంలేదు. గట్టిగా నిలదీసే పక్షంలో దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయిస్తుండడంతో వెనుకడుగు వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైకాపా నేతలు మాత్రం తమ జేబులు నిండితే చాలనేవిధంగా వ్యవహరిస్తున్నారు. ఇదే తరహాలో వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని పలు మండలాల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. బెంగళూరు నగరంలో ఇసుకకు డిమాండు ఉండడంతో కొందరు నేతలు లారీలతో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు నేతలు ఇదో ఆర్థిక వనరుగా మార్చుకుని దందా కొనసాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని