logo

ఎమ్మెల్యేx పురాధ్యక్షురాలు

మదనపల్లె పురపాలక సంఘంలో అధికార వైకాపా నేతల మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే నవాజ్‌బాషా, పురాధ్యక్షురాలు మనూజ మధ్య నెలకొన్న వివాదం తాజాగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వద్దకు చేరింది.

Updated : 30 Nov 2023 06:47 IST

ఎంపీ వద్దకు మదనపల్లె వివాదం

 న్యూస్‌టుడే, మదనపల్లె పట్టణం: మదనపల్లె పురపాలక సంఘంలో అధికార వైకాపా నేతల మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే నవాజ్‌బాషా, పురాధ్యక్షురాలు మనూజ మధ్య నెలకొన్న వివాదం తాజాగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వద్దకు చేరింది. మదనపల్లెకు వచ్చి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి సమస్యకు పరిష్కారం చూపుతానని ఎంపీ హామీ ఇచ్చినట్లు సమాచారం. గత నాలుగు నెలలుగా వీరి మధ్య కొనసాగుతున్న పంచాయితీ ముదిరి పాకాన పడింది. ఎమ్మెల్యే పురపాలక సంఘం పరిపాలనాపరమైన వ్యవహారాల్లో మితిమీరిన జోక్యంతో పురాధ్యక్షురాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పురపాలక సంఘంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో ఛైర్‌పర్సన్‌ ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తుండడంతో ఇటీవల జరిగిన ‘జగనన్న సురక్ష, ఆరోగ్యసురక్ష, వై ఏపీ నీడ్స్‌ జగన్‌.?’ కార్యక్రమాలకు  మనూజ దూరంగా ఉన్నారు. దీనికితోడు నిర్వహించిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమంలో భాగంగా శిబిరాల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఛైర్‌పర్సన్‌ మనూజ చిత్రం లేకపోవడంతో ఆమె అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోపక్క పురపాలక సంఘంలో ఛైర్‌పర్సన్‌కు తెలియకుండానే అజెండాను తయారు చేసి సంతకాలకు మాత్రం పంపుతుండడంపై ఆగ్రహించిన ఆమె అజెండాపై సంతకాలు చేయకపోవడంతో కౌన్సిల్‌ సమావేశం రద్దయింది. గత నెల 31వ తేదీన జరిగిన సాధారణ సమావేశంలో మెజారిటీ వైకాపా పాలకపక్షం కౌన్సిలర్లు అజెండాలోని అంశాలన్నింటిని ఆమోదించి ఒక్క క్షణం కూడా సమావేశంలో ఉండకుండా బయటకు వెళ్లిపోవడంపై విస్తుపోయిన ఛైర్‌పర్సన్‌ చేసేదిలేక మిన్నకుండిపోయారు. కౌన్సిల్‌ సమావేశాల్లో కౌన్సిలర్లు ఎలా వ్యవహరించాలో ముందుగానే సూచించడం, దీన్ని ఉల్లంఘించిన వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడంతోపాటు వారిని కట్టడి చేయడానికి వారి వార్డుల్లో సమాంతర పాలన నడిపిస్తున్నారు. దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయిన ఇంజినీరింగ్‌ అధికారులు: పురపాలక సంఘం కార్యాలయంలోని ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న డీఈఈ శిరీష, ఏఈఈ స్నేహప్రియ దీర్థకాలిక సెలవుపై వెళ్లిపోయారు.  వీరు మాట వినలేదన్న కారణంతో సెలవుపై వెళ్లాలని ఆదేశాలివ్వడంతో విధిలేని పరిస్థితిలో వారు వెళ్లాల్సివచ్చింది. వీరి సెలవును ధ్రువీకరించుకోవడానికి చరవాణిలో కమిషనర్‌ను మాట్లాడే ప్రయత్నం చేయగా ఆమె బదులివ్వలేదు. ఈ విషయమై డీఈఈ, ఏఈఈలను అడగ్గా తాము సెలవులో ఉన్నట్లు ధ్రువీకరించారు. ప్రస్తుతం కమిషనర్‌, డీఈ, ఆర్వో, టీపీఎస్‌ మాత్రమే ఉన్నారు. మూడేళ్ల కిందట 27 మంది పొరుగు సేవల ఉద్యోగులను తొలగించారు. ప్రస్తుతం చాలా వరకు పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి సాధ్యమేనా..? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని