logo

అడ్డుకున్నా ఆపలేదు!

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో అధికారులు విఫలమవుతున్నారు. అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉంటున్నారు.

Published : 23 Feb 2024 02:33 IST

వైకాపా నేతల కబ్జాలో రూ.కోటి విలువైన ప్రభుత్వ స్థలం
గతంలో ఆక్రమణలు తొలగించినా తిరిగి నిర్మాణాలు
- న్యూస్‌టుడే, పీలేరు

2021, ఆగస్టులో తొలగిస్తున్న అక్రమ కట్టడాలు

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో అధికారులు విఫలమవుతున్నారు. అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉంటున్నారు. జిల్లా రాజకీయాలను శాసిస్తున్న ఓ కీలక నేత అండదండలతో రూ.కోటి విలువైన ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైంది. పీలేరు పంచాయతీ పరిధిలో తిరుపతి మార్గంలో సర్వే సంఖ్య 901లో ఎకరన్నర రహదారులు, భవనాలశాఖకు చెందిన స్థలం ఉంది. ఇందులో కొందరు అధికార వైకాపా నాయకులు నిర్మాణాలు చేస్తుండగా, 2021, ఆగస్టులో అధికారులు అడ్డుకున్నారు. మదనపల్లె ఆర్డీవో జాహ్నవి ఆధ్వర్యంలో పీలేరు తహసీల్దారు పుల్లా రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు, సిబ్బంది పోలీసుల సహకారంతో యంత్రాలతో అక్రమ కట్టడాలు తొలగించారు. తాజాగా అక్రమార్కులు తిరిగి ఆక్రమిత స్థలంలో నిర్మాణాలు ప్రారంభించారు. ఇక్కడ జరుగుతున్న నిర్మాణాల జోలికి పోవద్దని సదరు నేత అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. తిరుపతి మార్గం పక్కన రూ.కోటి విలువైన స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూడడం మినహా ఆపడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. ‘తిరుపతి మార్గంలో సర్వే నంబరు 901లో అక్రమ నిర్మాణాలను గతంలో తొలగించారు. ఇక్కడ నిర్మాణాలు చేయరాదని అప్పటి ఆర్‌అండ్‌బీ అధికారులు హెచ్చరించారు. తిరిగి నిర్మాణాలు చేస్తుంటే మేమేం చేయలేక ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాం’ అని పీలేరు ఆర్‌అండ్‌బీ డీఈ చంద్రశేఖర్‌ తెలిపారు. ‘గతంలో ఒకసారి అక్రమ నిర్మాణాలు తొలగించారు. అప్పట్లోనే ఆర్‌అండ్‌బీ అధికారులు వారి స్థలానికి ప్రహరీ నిర్మించుకుని ఉంటే ఆక్రమణలు పునరావృతమయ్యేవి కావు’ అని పీలేరు తహసీల్దారు మహబూబ్‌బాషా పేర్కొన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని