logo

ప్రజాప్రతినిధుల అండదండలతోనే భూకబ్జాలు

అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో జిల్లాలో కోట్ల రూపాయల విలువైన దళిత, బడుగు బలహీన వర్గాలకు చెందిన భూములను వైకాపా నాయకులు కబ్జా చేస్తున్నారని ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ ఆంజనేయులు ఆరోపించారు.

Published : 23 Feb 2024 02:36 IST

మాట్లాడుతున్న ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ ఆంజనేయులు, పక్కన నాయకులు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో జిల్లాలో కోట్ల రూపాయల విలువైన దళిత, బడుగు బలహీన వర్గాలకు చెందిన భూములను వైకాపా నాయకులు కబ్జా చేస్తున్నారని ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ ఆంజనేయులు ఆరోపించారు. కడప ప్రెస్‌క్లబ్‌లో గురువారం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ‘దళితులు-ప్రభుత్వం-సంక్షేమ పథకాలు-సబ్‌ప్లాన్‌ నిధులు’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ ఎంపీ ఆదేశాలకు అధికారులు తలొగ్గి, జగనన్న ఇళ్ల స్థలాల పేరిట ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపించారు. మాసాపేటకు చెందిన స్వాతంత్య్ర సమరయోధునికి ప్రభుత్వం కేటాయించిన భూమిని ఆయన మరణాంతరం వారసులు అనుభవిస్తున్నట్లు దస్త్రాలు ఉన్నప్పటికీ ఓ ప్రజాప్రతినిధి సోదరుడు, కార్పొరేటర్‌ కలసి కబ్జా చేశారని తెలిపారు. సీఎం జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఓ రెవెన్యూ అధికారి హస్తముందని, ఆయన భూఅక్రమాల్లో రూ.కోట్లు దోచుకున్నారని చెప్పారు. రాయలసీమ అభివృద్ధి వేదిక జిల్లా కన్వీనర్‌ ఓబయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రెడ్డెన్న, రామాంజినేయులు, జేవీ రమణ, అవ్వారు మల్లికార్జున, శివారెడ్డి, శ్రీకృష్ణ, సీఆర్‌వీ.ప్రసాద్‌, గుర్రప్ప, జయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని