logo

కరెంటు కోతలు.. కర్షకులకు వెతలు!

వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా అస్తవ్యస్తంగా మారింది. కరెంటు కోతల కాలం వచ్చేసింది. తొమ్మిది గంటల కోటా కుదించారు.

Published : 23 Feb 2024 02:38 IST

వ్యవసాయ విద్యుత్తు కోటా కుదింపు
అంతరాయాలతోనూ తప్పని అవస్థలు
న్యూస్‌టుడే, కడప, సిద్దవటం

ఒంటిమిట్ట మండలం నరసన్నగారిపల్లెలో మోటారు వద్ద కరెంటు కోసం ఎదురుచూస్తున్న రైతు బాలకృష్ణ

వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా అస్తవ్యస్తంగా మారింది. కరెంటు కోతల కాలం వచ్చేసింది. తొమ్మిది గంటల కోటా కుదించారు. ఉత్పత్తి, డిమాండు, సరఫరా మధ్య అంతరం ఉంది. లోటు ఏర్పడింది. మరోవైపు వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రత్తలు క్రమేణా పెరుగుతూ మరింత భయపెడుతున్నాయి. వెలుగుదివ్వె వినియోగం క్రమేణా పెరుగుతూ వస్తోంది. రెండు గంటలు కత్తిరించారు. అత్యవసర లోడు రిలీఫ్‌ పేరిట, సాంకేతిక లోపాలు, స్థానిక సమస్యలతో తరచూ అంతరాయాలు కలుగుతున్నాయి. మోటార్ల వద్ద రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది.

ఉమ్మడి కడప జిల్లాలో కరెంటు కష్టాలు కర్షకులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు 1,88,065 ఉన్నాయి. దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలోని కడప డివిజన్‌లో 10,708, ప్రొద్దుటూరు 24,011, పులివెందుల 32,052, రాయచోటి 32,936, రాజంపేట 43,786, మైదుకూరు డివిజన్‌లో 44,572 సర్వీసులు ఉన్నాయి. వ్యవసాయ ఫీడర్లు 893 ఏర్పాటు చేశారు. ఈ నెలలో రోజువారీ జిల్లా కోటా 13.560 మిలియన్‌ యూనిట్లు కాగా, గత వారం రోజులుగా చూస్తే కోటాకు మించి వాడేస్తున్నారు. మా ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 9 గంటలు పగటిపూటే నిరంతరాయంగా కరెంటు ఇస్తామని సీఎం జగన్‌, మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఊరూరా ప్రకటించారు. క్షేత్రస్థాయిలో అమలు తీరు ఇందుకు విరుద్ధంగా ఉంది. రూ.కోట్లు గుమ్మరించి విద్యుత్తు ఉపకేంద్రాల సామర్థ్యం పెంచి. కొత్తగా ఫీడర్లు ఏర్పాటు చేసినా మళ్లీ పాత కథే.

  • ఒంటిమిట్ట విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో ఏ గ్రూపులోని దర్జిపల్లి ఫీడరుకు గురువారం ఉదయం 8 నుంచి 8.25 గంటల వరకు సరఫరా చేశారు. ఆ తర్వాత 8.25 నుంచి 9.05 గంటల వరకు అత్యవసర లోడ్‌ రిలీఫ్‌ పేరిట 40 నిమిషాల పాటు ఆపేశారు. తిరిగి 9.05 గంటలకు విద్యుత్తు ఇచ్చారు. ఆనక స్థానికంగా సాంకేతిక సమస్యలతో ఉదయం 11.20 నుంచి 1.05 గంటల వరకు నిలిపివేశారు. ఆ తర్వాత పునరుద్ధరణ చేశారు. బీ ఇబ్రహీంపేట, గంగపేరూరు ఫీడరులో ఉదయం 8.25 నుంచి 9.05 గంటల వరకు కరెంటు నిలిపేశారు. బీ సిద్దవటం మండలం మాచుపల్లెలో ఉదయం 11.20 నుంచి 11.40 గంటల వరకు, తిరిగి 12.34 నుంచి 13.09 గంటల దాకా రెండు దఫాలు విద్యుత్తు సరపరా నిలిపివేశారు. ఇక్కడే కాకుండా ఉమ్మడి కడప పరిధిలో చాలాచోట్ల ఇదే దుస్థితి నెలకొంది.
  • గతేడాది వర్షాభావంతో భూగర్భ జలాలు రానురాను తరిగిపోతున్నాయి. గొట్టపు బావుల్లో నీటిమట్టాలు దిగజారిపోవడంతో సాగునీటి సమస్య రైతులను మరింత వేదనకు గురి చేస్తోంది. ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా ఈఎల్‌ఆర్‌, స్థానిక సమస్యలతో తరచూ విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతోంది. వారం రోజులుగా ఎండలు మండుతున్నాయి. వ్యవసాయ, ఉద్యాన పంటలకు నీటి తడులు ఇవ్వాలంటే రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. విద్యుత్తు కోసం మోటార్ల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. హెచ్చు తగ్గులు, లో ఓల్టోజితో ఒత్తిడికి గురై స్టార్టర్లు, మోటార్లు కాలిపోయి దెబ్బ తింటున్నాయి. రైతులకు మరమ్మతుల భారం ఆర్థికంగా గుదిబండగా మారుతోంది. మరోవైపు నియంత్రికలు కూడా కాలిపోతున్నాయి. వాడకం పెరగడంతో ఉపకేంద్రాలు, ఫీడర్లపై ఒత్తిడి పెరుగుతోంది. సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. వ్యవసాయానికి ఇస్తున్న విద్యుత్తు సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి సారించామని ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ రమణ తెలిపారు. కోటాకు మించి వినియోగం పెరిగినట్లు చెప్పారు. ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే కోల్పోయిన విద్యుత్తును తిరిగి ఇస్తున్నామని వివరించారు.

సరఫరా అధ్వానం

గత కొన్ని రోజులుగా కరెంటు సరఫరా అధ్వానంగా ఉంది. తొమ్మిది గంటలు ఇస్తామన్న ప్రభుత్వం ప్రస్తుతం ఏడు గంటలు ఇవ్వడం గగనమైంది. పంటలకు నీటి తడులివ్వడం చాలా కష్టంగా ఉంది. - సుంకర రామ్మూర్తి, రైతు, నరసన్నగారిపల్లె తరచూ అంతరాయాలు: మాకు మూడెకరాలు ఉండగా, మరో రెండెకరాలు కౌలుకు తీసుకున్నాను. రబీలో వరి సాగు చేశాను. ప్రస్తుతం పొట్ట, వెన్ను దశలో పైరు ఉంది. ఇప్పుడేమో నీటి అవసరం ఎక్కువ. తరచూ విద్యుత్తు సరఫరాలో అంతరాయాలేర్పడుతున్నాయి.

కదిరి శ్రీనివాసులు, రైతు, గొల్లపల్లి


నీటి తడులకు కష్టం

పదెకరాల్లో వరి, రెండెకరాల్లో నువ్వు పంటలు సాగు చేశాను. వ్యవసాయానికి 9 గంటలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా అమలు చేయడం లేదు. ఇప్పుడేమో ఏడు గంటలను కూడా ఒకేసారి సరఫరా చేయడం లేదు. నీటి తడులకు కష్టంగా ఉంది.

చెన్నూరు లక్ష్మీనారాయణ, రైతు, గొల్లపల్లి


మా గోడు ఆలకించడంలేదు

మాకు వెంకటాయపల్లెలో 20 ఎకరాల్లో మామిడి తోట ఉంది. గత పది రోజులుగా విద్యుత్తు సరఫరా అస్తవ్యస్తంగా ఉంది. తోటలకు నీరందించాలంటే కష్టపడాల్సి వస్తోంది. ఏడు గంటలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. మా గోడును ఎవరూ ఆలకించడం లేదు.

వెంకటేశ్వర్లు, రైతు, లింగంపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని