logo

సూక్తులు చెప్తారు... కత్తులు దూస్తారు!

తనను తాను దళిత, గిరిజన బాంధవుడిగా అభివర్ణించుకునే సీఎం జగన్‌ పాలనలో అణగారిన వర్గాలపై దారుణ దమనకాండ కొనసాగుతోంది.

Updated : 23 Feb 2024 05:46 IST

అణగారిన వర్గాలపై తరచూ దాడులు, దౌర్జన్యాలు
ఆపై బాధితులపై తప్పుడు కేసులతో చిత్రహింసలు
తాజాగా బద్వేలులో వైకాపా నాయకుల అకృత్యాలు

తనను తాను దళిత, గిరిజన బాంధవుడిగా అభివర్ణించుకునే సీఎం జగన్‌ పాలనలో అణగారిన వర్గాలపై దారుణ దమనకాండ కొనసాగుతోంది. ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ’ అంటూ దళిత, ముస్లిం వర్గాల దీనజనోద్ధారకుడిలా ఊదరగొట్టే ఆయన హయాంలో ఆ వర్గాల బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వారికి పోలీస్‌స్టేషన్లలో న్యాయం జరగకపోగా, ఆపై వారిపైనే తప్పుడు కేసులు సైతం నమోదు చేస్తున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనూ ఏమాత్రం తగ్గకుండా వైకాపా నేతలు తమ పంధాను కొనసాగిస్తున్నారు.

ఈనాడు, కడప


దళిత ఎమ్మెల్యే నియోజకవర్గంలోనే...!

గాయపడిన జయన్న

బద్వేలు నియోజకవర్గానికి దళిత ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ సామాజికవర్గానికి చెందిన జయన్నపై వైకాపా నేతలు విచక్షణారహితంగా దాడి చేశారు. పొలంలో సాగునీటి పైపులైన్లు అమర్చుకునే విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. అట్లూరు మండలం దిన్నెమీదపల్లెకు చెందిన జయన్నకు గ్రామ సమీపంలో పొలాలున్నాయి. పంటలకు నీటిని పారించడానికి ఏర్పాటు చేసిన పైపులను పక్కనున్న మణ్యంవారిపల్లెకు చెందిన వైకాపా నేతలు తిరుపతిరెడ్డి, రామనాథరెడ్డి వాడుకుంటున్నారు. పైపులు వాడుకోవద్దని జయన్న ఆక్షేపించడాన్ని వైకాపా నేతలు జీర్ణించుకోలేక దాడికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి జరిగిన ఘటనపై గురువారం పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. బాధితుడు మాట్లాడుతూ భూఆక్రమణలు అడ్డుకుంటున్నాననే తనపై హత్యాయత్నం జరిగిందని, రామనాథరెడ్డి భార్య వెలుగు యానిమేటర్‌ సుభద్రమ్మ చెప్పుతో కొట్టారన్నారు. తనకూ తన కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు. తిరుపతిరెడ్డి, రామనాథరెడ్డి, సుభద్రమ్మపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎ.ఎస్‌.ఐ. మోహన్‌బాబు తెలిపారు.


దాడులు చేసి... ఆపై బాధితులపైనే కేసులు పెట్టి...

బాధితుడు రామ్మోహన్‌

భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారన్న కక్షతో వైకాపా నేత, ఆయన అనుచరులు ఎస్సీ వర్గానికి 10 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కొమ్మివారిపల్లి ఎన్టీఆర్‌ కాలనీలో గతంలో చోటుచేసుకుంది. కాలనీలో 47 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. తెదేపా హయాంలో 16 మంది ఎస్సీలకు నివాస పట్టాలిచ్చారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ భూమిపై ఉమ్మడి కడప జిల్లా ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడి కన్ను పడింది. స్థలం ఆక్రమించి అందులో నివాసాలు నిర్మించి ఇతరులకు అమ్మేశారు. ఈ విషయమై పలువురు ఎస్సీలు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆక్రమణకు పాల్పడిన వ్యక్తికి నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో వైకాపా నేతలు మాపైనే ఫిర్యాదు చేస్తారా?.. అంటూ కర్రలు, ఇనుప రాడ్లతో ఎస్సీలపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచిన ఘటన సంచలనం కలిగించింది.


జమ్మలమడుగులో బీసీలపై దాడులు

వైకాపా నేతల దాడిలో గాయపడిన ఎర్రగుంట్ల మండలం దండుపల్లిలోని బీసీ వర్గానికి చెందిన

బాధితుడిని పరామర్శిస్తున్న తెదేపా జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జి భూపేష్‌రెడ్డి, నాయకులు (పాత చిత్రం)

జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం దండుపల్లె గ్రామంలోని బీసీలపై అధికార వైకాపాకు చెందిన అగ్రవర్ణాలు ఇటీవల దాడులు చేశాయి. దండుపల్లెలో ఇరు పార్టీల జెండాలు కట్టే విషయంలో తలెత్తిన వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని వైకాపా నాయకులు తెదేపాకు చెందిన వ్యక్తులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనూ వివాదాలకు ఆజ్యం పోస్తూ సామాజికవర్గాన్ని సైతం దృష్టిలో పెట్టుకోకుండా విచక్షణారహితంగా దాడులకు దిగారు. పోలీసులు నామమాత్రంగా కేసు నమోదు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


సీఎం ఇలాకాలోనూ దళితుడి హత్య!

కృష్ణయ్య (పాత చిత్రం)

సీఎం జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడూరు గ్రామానికి చెందిన దళితుడు కృష్ణయ్యను గతంలో దారుణంగా హత్య చేశారు. బొగ్గుల బట్టీ విషయమై తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. అంతకు ముందు కృష్ణయ్య కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేశారు. కలెక్టరు, ఎస్పీలకు ఫిర్యాదు చేసిన అనంతరం తీసుకున్న చర్యలతో పోలీసు రక్షణలో వారంతా గ్రామానికి చేరుకోగా నెల రోజులకే హత్యకు గురయ్యారు. వైకాపా సానుభూతిపరులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు.


వైకాపా దురాగాతాలపై పోరాటం

అక్బర్‌బాషా

నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన అక్బర్‌బాషాకు వైయస్‌ఆర్‌ జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లి గ్రామం వద్ద పొలం ఉంది. తన పొలాన్ని సీఎం జగన్‌ బంధువు ఆక్రమించుకుని సాగు చేస్తున్నారని, న్యాయస్థానం ఆదేశాలను సైతం లెక్క చేయడంలేదంటూ గతంలో తమ పొలం వద్ద అక్బర్‌బాషా దంపతులు సెల్ఫీ వీడియో తీసి విడుదల చేశారు. గతంలోనూ పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నం చేసిన అక్బర్‌బాషాకు న్యాయం చేస్తామని వైకాపా జిల్లా నేతలు హామీ ఇచ్చారు. అయినప్పటికీ న్యాయం జరగకపోగా, తన పొలాన్ని ఆక్రమించుకున్న వ్యక్తులు పంటలు సైతం సాగు చేస్తుండడంతో తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. న్యాయం మాత్రం జరగడంలేదు. సామాజిక న్యాయం అంటూ వైకాపా చేపట్టిన బస్సు యాత్రను ప్రశ్నిస్తూ తన నిరసనను తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని