logo

పల్లె వంక చూడని ఆర్టీసీ బస్సు

ప్రతి మారుమూల గ్రామానికి బస్సులు నడపాలనేది ఆర్టీసీ ప్రధాన ఉద్దేశం కాగా, ప్రస్తుతం అమలు కావడం లేదు.

Published : 24 Feb 2024 02:40 IST

చిన్నచౌకు (కడప), న్యూస్‌టుడే: ప్రతి మారుమూల గ్రామానికి బస్సులు నడపాలనేది ఆర్టీసీ ప్రధాన ఉద్దేశం కాగా, ప్రస్తుతం అమలు కావడం లేదు. అధికారులు మాత్రం ప్రైవేటు వాహనాల సంఖ్య పెరగడంతో గ్రామీణ ప్రాంతాలకు బస్సులను ఆపేశామని చెబుతున్నారు. నష్టాలొస్తున్నాయని సాకు చూపించి ఇప్పటికీ కొన్ని ఊళ్లకు సర్వీసులు నడపడంలేదు. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల మైదుకూరు, బద్వేలు డిపోల్లో మొత్తం 598 బస్సులున్నాయి. ప్రతిరోజూ 2.28 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా, 1.47 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. రోజుకు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఆదాయం వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 972 గ్రామాలుండగా, 170 ఊళ్లకు బస్సులు వెళ్లడం లేదు. కడప నుంచి కొండపేటకు ఇప్పటికీ బస్సులు లేవు. గతంలో చెన్నూరు ఊళ్లోకి వెళ్లేది. ఇప్పుడు అది కూడా రద్దు చేశారు. సిద్దవటం నుంచి పలు గ్రామాలకు కూడా సర్వీసుల్లేవు. కొన్ని మార్గాలు సరిగా లేకపోవడంతో రద్దు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల నిష్పత్తి శాతం తక్కువగా ఉందని మరికొన్ని గ్రామాలకు తిప్పడం లేదు. ఈవిషయమై ఆర్‌.ఎం.గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్డు సౌకర్యం బాగుండి ప్రజలు ఆదరిస్తే సర్వీసుల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని