logo

నాలుగేళ్ల తర్వాతా అదే పరిస్థితి!

పీలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సముదాయానికి అత్యంత ప్రాధాన్యం ఉంది.

Published : 24 Feb 2024 02:40 IST

అధికార పార్టీ నాయకుల సిండికేట్‌
వేలంపాట తాత్కాలికంగా వాయిదా

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: పీలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సముదాయానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. పట్టణంలోని తిరుపతి మార్గంలో ఉండడంతో వ్యాపారానికి అనువుగా ఉంది. రోడ్డు పక్కనే 18 గదులతో ఉన్న వ్యాపార సముదాయాన్ని అద్ద్దెకిస్తున్నారు. వీటి ద్వారా నెలకు రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తోంది. గత నాలుగేళ్ల అనంతరం బహిరంగ వేలం పాటకు శ్రీకారం చుట్టారు.  దీంతో పోటీ పెరిగి మార్కెట్‌కు అదాయం మరింతగా సమకూరే అవకాశం ఉంది. పాలకవర్గం ఆపని చేయకుండా గతంలో ఉన్న వ్యాపారులకే మరోసారి ఇస్తూ నవీకరణ పేరిట కొనసాగించింది. చిత్తూరు, మదనపల్లె మార్గంలో రైల్వే పైవంతెనల నిర్మాణాల కారణంగా మార్కెట్‌ కమిటీ దుకాణ సముదాయాలకు గిరాకీ పెరిగింది. గదులను దక్కించుకోవడానికి ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార వైకాపా నాయకులే ఈ తతంగంలో చక్రం తిప్పేందుకు రంగంలోకి దిగారు. ఎలాగైనా ఇక్కడ గదులను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే శుక్రవారం జరగాల్సిన వేలం పాటను తాత్కాలికంగా వాయిదా వేశారు. వేలం పాట సమయాన్ని ఖరారు చేస్తూ ప్రకటన సైతం జారీ చేయగా, చివర్లో వాయిదా వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆశావహులు డీడీలు కూడా చెల్లించారు. అధికార పార్టీ నాయకులు తమకే గదులు దక్కాలని ఒత్తిళ్లు తేవడంతో వేలం పాటలను వాయిదా వేసినట్లు సమాచారం. కొన్ని అనివార్య కారణాలతో వేలంపాటను వాయిదా వేశామని, త్వరలో తేదీని ప్రకటిస్తామని ఛైర్మన్‌ యల్లయ్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని