logo

సమన్వయ లోపం.. ప్రజలకు ప్రాణ సంకటం

శాఖల మధ్య సమన్వయ లోపం... ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. కడప నగరంలో ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

Published : 24 Feb 2024 02:42 IST

నేలకొరిగిన విద్యుత్తు స్తంభాలు 
తప్పిన పెను ప్రమాదం

నివాసాలపై వాలిన విద్యుత్తు స్తంభాలు

న్యూస్‌టుడే, కడప గ్రామీణ: శాఖల మధ్య సమన్వయ లోపం... ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. కడప నగరంలో ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల విద్యుత్తు స్తంభాలు అడ్డుగా ఉన్నాయి. అలాంటి చోట ప్రణాళికతో పనులు చేయాల్సి ఉండగా, అధికారులు ఇష్టారాజ్యంగా చేయడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముత్రాసుపల్లెలో గురువారం రాత్రి జరిగిన సంఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. పెనుప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని గురుకుల్‌ విద్యాపీఠ్‌ ఎదురుగా ఉన్న రహదారి... మద్రాసు రోడ్డులో చిన్నచౌక్‌ పోలీసుస్టేషన్‌ మీదుగా ప్రధాన మార్గానికి చేరుకుంటుంది. ఈ మధ్యలో మురుగు కాలువల నిర్మాణం చేపట్టారు. ఇక్కడ జేసీబీతో భారీ గుంతలు తీస్తున్నారు. విద్యుత్తు స్తంభానికి అతి సమీపంలో మట్టి తీయడంతో ఒక్కసారిగా అది నేలకూలింది. తీగలపై ఒత్తిడితో అదే వరుసలో మరో రెండు స్తంభాలు కూడా నివాస భవనాలపై వాలాయి. ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ కాలువలో పడిపోయింది. రాత్రి కావడంతో అక్కడ జనాలు లేరు. అదే పగలైతే పెను ప్రమాదం వాటిల్లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

కాలువలో పడిన విద్యుత్తు నియంత్రిక 

అవగాహన లోపం...

మురుగు కాలువ పనులు కావడంతో చుట్టుపక్కల మట్టి నీటి చెమ్మతో నాని మెత్తగా మారుతుంది. అలాంటి చోట ఆరిన తర్వాత మట్టి తీయాలి. స్తంభాలకు అతి సమీపంలో తవ్వకూడదు. తప్పదనుకుంటే విద్యుత్తు శాఖ అధికారులకు సమాచారం అందించి, వారి ఆధ్వర్యంలో చేయాలి. గురువారం రాత్రి స్తంభాలు కిందకు వాలగానే ట్రిప్‌ అయి విద్యుత్తు సరఫరా ఆగిపోయిందని లేకపోతే పరిస్థితి తీవ్రంగా ఉండేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. లక్ష్మీరంగా కూడలి నుంచి బుగ్గవంక వరకు కూడా కాలువల పనులు జరుగుతున్నాయి. ఇక్కడా లోతుగా స్తంభాల అంచున తవ్వడంతో  కొద్దిపాటి గాలి వీచినా అవి నేలకొరిగేలా ఉన్నాయి. గతంలో కలెక్టర్‌ బంగ్లా కూడలి నుంచి రిమ్స్‌ రోడ్డు అభివృద్ధిలో భాగంగా పనులు చేసే సమయంలో వరుసగా పదుల సంఖ్యలో స్తంభాలు పడిపోయి, అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో వ్యవహరించి, ప్రమాదాలు చోటుచేసుకోకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

లక్ష్మీరంగా కూడలిలో స్తంభాలకు దగ్గరగా తవ్విన కాలువ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని