logo

Kadapa: మీ వల్ల మా పరువు పోయింది.. విద్యార్థులకు వైవీయూ అధికారుల బెదిరింపులు

కలుషిత ఆహారంతో విద్యార్థులు ఆసుపత్రి పాలైతే ఘటనకు కారణమైనవారిపై చర్యలు తీసుకోకుండా తమనే యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) అధికారులు బెదిరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. 

Updated : 24 Feb 2024 09:23 IST

ఆరోగ్య సమస్యలుంటే ప్రైవేటు ఆసుపత్రులకెళ్లండి

విశ్వవిద్యాలయం ఎదుట గురువారం ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడుతున్న అధికారులు

న్యూస్‌టుడే, వైవీయూ (కడప): కలుషిత ఆహారంతో విద్యార్థులు ఆసుపత్రి పాలైతే ఘటనకు కారణమైనవారిపై చర్యలు తీసుకోకుండా తమనే యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) అధికారులు బెదిరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.  ‘మీ వల్ల మా పరువు పోయింది. అందరితో మాట పడాల్సి వస్తోంది. ధర్నాలు, రాస్తారోకోలు అంటూ రోడ్డెక్కుతున్నారు. ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారని వారంతా వాపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారి వద్ద ఉండి బాగోగులు చూసుకుంటుంటే తమపై నిందలు వేయడమేమిటని ఆయా సంఘాల బాధ్యులు మండి పడుతున్నారు. కనీసం వైవీయూ అధికారులు విద్యార్థులకు ఓఆర్‌ఎస్‌ పొట్లాలు కూడా అందించలేదని విమర్శించారు. మరోవైపు ఇక నుంచి ఎవరైనా అనారోగ్యం పాలైతే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లవద్దని అధికారులు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఏదైనా సమస్య ఉంటే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలని, కావాలంటే ఖర్చులు భరిస్తామని సూచించినట్లు పేర్కొన్నారు. ఇక నుంచి సమస్యలుంటే నేరుగా తమకే చెప్పాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిపారు.

ఆ కొందరిని కాపాడేందుకు..

విశ్వవిద్యాలయంలోని బాలురు, బాలికల వసతి గృహాలు, వంటశాలల్లో ఇటీవల తమకు కావాల్సిన వారిని కొందరు ఈసీ సభ్యుల సూచనలతో వైవీయూ అధికారులు నియమించారు. ఘటనకు పూర్తి బాధ్యత వారిదేదనని తెలిసినా వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత వార్డెన్‌ వద్దని గతంలో ఉన్నవారినే నియమించాలని కోరినా పట్టించుకోలేదని వారంతా చెబుతున్నారు.

ఆస్పత్రిలో మరికొందరు...

కలుషిత ఆహారం తిని తీవ్ర అనారోగ్యానికి గురై రిమ్స్‌లో చేరిన విద్యార్థినుల పరిస్థితి కాస్త మెరుగైంది. ఆసుపత్రి నుంచి సగం మంది డిశ్ఛార్జి అవగా, మిగిలిన వారిని జనరల్‌ వార్డులో మార్చారు. మరికొందరు శుక్రవారం రిమ్స్‌కు వచ్చారు. ఇదిలా ఉండగా చికిత్స పొందుతున్న వారికి మళ్లీ వైవీయూ హాస్టల్‌ నుంచే ఆహారాన్ని తీసుకురావడం విడ్డూరంగా ఉందని విద్యార్థి సంఘ నాయకులు వాపోయారు. బాలుర వసతి గృహంలో శుక్రవారం రాత్రి విద్యార్థులు తింటున్న ఆహారంలో పురుగులు రావడంతో వారు హాస్టల్‌ సిబ్బందితో గొడవకు దిగారు. రెండు రోజులుగా పరిస్థితి అధ్వానంగా ఉన్నా సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రస్తుత ఘటన నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టి పలు డిమాండ్లను వైవీయూ అధికారులు ముందుంచారు. సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రి పాలైన, వారి వెంట సహాయకులుగా ఉన్నవారికి పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. మొత్తం ఘటనపై విచారణ కమిటీ నియమించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. నాణ్యమైన బియ్యం సరఫరా చేసి, మంచి భోజనం అందించాలని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.20 కోట్లలో కొంత వసతిగృహం అభివృద్ధికి కేటాయించాలని సూచించారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని