logo

దూసుకెళ్లిన కారు... యువకుడి మృతి

రహదారి పక్కన నిలబడి ఉన్న వ్యక్తిపైకి కారు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గుర్రంకొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

Published : 02 Mar 2024 04:08 IST

గుర్రంకొండ, న్యూస్‌టుడే : రహదారి పక్కన నిలబడి ఉన్న వ్యక్తిపైకి కారు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గుర్రంకొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు... మండలంలోని తలారివాండ్లపల్లెకు చెందిన హరీష్‌కుమార్‌ (24) మార్కెట్యార్డు వద్ద హాటల్‌ ముందు నిలుచున్నాడు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాళ్యంకు చెందిన కొందరు కూలీలు తమ సొంత ఊరికి వెళ్లడానికి వస్తున్న అద్దె కారు బెంగళూరుకు వెళ్తూ గుర్రంకొండలో బ్యారికేడ్‌ను ఢీకొంది. దీంతో అది ఎగిరి యువకుడిపై పడి తలకు బలమైన గాయమైంది. స్థానికులు మదనపల్లె ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. హరీష్‌కు ఏడాది క్రితమే వివాహం కాగా కొడుకు పుట్టాడు. మూడు నెలల బాలుడికి పేరు పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటుండగా అంతలోనే మృత్యువు రూపంలో కారు పొట్టనబెట్టుకుంది. ఈ విషయాన్ని చెబుతూ భార్య లలిత కన్నీరు మున్నీరుగా విలపించడం స్థానికులను కంటతడిపెట్టించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.ఐ. నాగార్జునరెడ్డి చెప్పారు.


చికిత్స పొందుతూ వ్యక్తి...

సుండుపల్లి, న్యూస్‌టుడే: మండల పరిధిలోని ముడుంపాడు గ్రామం జనార్దనరెడ్డి నగర్‌ కాలనీకి చెందిన మేకల ద్వారకనాథ్‌(43) విద్యుత్తు తీగ తగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందినట్లు ఎస్సై హుస్సేన్‌ తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 23న తాను కాపలాగా ఉన్న మామిడి తోటలో మేతకు వచ్చే కుందేళ్లకు విద్యుత్తు తీగలాగారు. ఈ క్రమంలో రాత్రివేళ ద్వారక్‌నాథ్‌కు విద్యుత్తు తీగ తగలడంతో కాలికి గాయమైంది. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


ఎస్‌ఆర్‌ ఇవ్వలేదని ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం

ఓబులవారిపల్లి, న్యూస్‌టుడే: ఓబులవారిపల్లి మండలంలో పని చేస్తూ వైయస్‌ఆర్‌ జిల్లా చాపాడు మండలానికి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుడు జాన్‌వెల్సన్‌ స్థానిక విద్యా వనరుల కార్యాలయం వద్ద బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నతాధికారులు తనకు ఎస్‌ఆర్‌ ఇవ్వకుండా ఎనిమిది నెలల పాటు ఎల్‌పీసీ ఇవ్వకుండా అయిదు నెలలుగా వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. రూ.30 వేలు డబ్బులివ్వాలని డిమాండ్‌ చేయడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పారు. వెంటనే విద్యాశాఖ సిబ్బంది అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై చిన్న పెద్దయ్య అక్కడికి చేరుకుని అధికారులతో మాట్లాడి ఆయన ఎస్‌ఆర్‌ ఇప్పించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని