logo

కూరగాయల నిల్వలో ‘సౌర’భం

తోపుడు బండ్లపై పేదలు కూరగాయల వ్యాపారం చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఎండకు ఎండి ఒక్కరోజు కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా వాడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతుంటారు.

Updated : 02 Mar 2024 06:35 IST

మిట్స్‌ విద్యార్థుల నూతన ఆవిష్కరణ
న్యూస్‌టుడే, మదనపల్లె విద్య

తోపుడు బండ్లపై పేదలు కూరగాయల వ్యాపారం చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఎండకు ఎండి ఒక్కరోజు కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా వాడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతుంటారు. అలాగే మరోవైపు రైతులు తాము పండించిన కూరగాయలను ధరలున్న సమయంలో అమ్ముకుంటారు. ధరలు లేని సమయంలో పడేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అటు వ్యాపారులకు, ఇటు రైతులకు ఉపయోగపడేలా విద్యుత్తు వినియోగించకుండా కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఏదైనా తయారు చేయాలని నిర్ణయించుకున్నారు మిట్స్‌ (మదనపల్లె ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌).విద్యార్థులు. వీరి ఆలోచనలకు అధ్యాపకుల సహకారం తోడు కావడంతో ‘పర్యావరణ కాలుష్య రహిత సోలార్‌ కోల్డ్‌ స్టోరేజీ’ని రూపుదిద్దుకుంది.

ఏవిధంగా తయారు చేశారంటే...: మిట్స్‌ మెకానికల్‌ విభాగం చివరి సంవత్సరం చదువుతున్న వెంకట్‌ పవన్‌కుమార్‌, మహబూబ్‌బాషా, హరిప్రసాద్‌, భరత్‌ బృందంగా ఏర్పడ్డారు. వీరికి ప్రొఫెసర్‌ ముప్పా లక్ష్మణరావు సలహాలు, సూచనలిచ్చారు. దీంతో కోల్డ్‌ స్టోరేజీ యంత్రాన్ని తయారీని ప్రారంభించారు. చెక్కను ఉపయోగించి బాక్సును తయారు చేసి అందులో థర్మాకోల్‌ను అమర్చారు. బాక్సు లోపల రెండు భాగాలుగా చేసి ఒక భాగంలో సగం వరకు ఇసుక నింపారు. ఒక మట్టి కుండను తీసుకుని ఇసుకపై అమర్చారు. అయిదు వోల్ట్‌ల సామర్థ్యం గల ఫ్యాన్‌ను మట్టికుండపై అమర్చారు. సోలార్‌ ద్వారా 12 వోల్ట్‌ల బ్యాటరీని రీఛార్జి చేసి ఫ్యానుకు అనుసంధానించారు. మట్టి కుండలో నీరు పోసి ఫ్యాన్‌ వేశారు. ఫ్యాను గాలి పైపు ద్వారా బాక్సులో ఉన్న మరో ఖాళీ స్థలంలోకి పంపారు. చల్లగాలి ఆ బాక్సులోకి రావడంతో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల వరకు తగ్గాయి. ఇందులో కూరగాయలు నిల్వ ఉంచితే ఏడు రోజుల నుంచి పది రోజుల వరకు తాజాగా ఉండేలా తయారు చేశారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉండటంతో అందుకోసం పర్యావరణ బ్యాటరీ ఆపరేటెడ్‌ మూడు చక్రాల వాహనాన్ని తయారు చేశారు. కోల్డ్‌ స్టోరేజీ బాక్సును మూడు చక్రాల వాహనానికి అమర్చారు. గుంతల రహదారిలో ప్రయాణించే సమయంలో బాక్సుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. విద్యుత్తు వాహనానికి రెండు సోలార్‌ ప్యానళ్లను అమర్చారు. దీని ద్వారా బ్యాటరీ నిరంతరం ఛార్జింగ్‌ అవుతుంది.

ఏవిధంగా ఉపయోగపడుతుందంటే...: విద్యార్థులు తయారు చేసిన పర్యావరణ కాలుష్య రహిత సోలార్‌ కోల్డ్‌ స్టోరేజీ యంత్రం రైతులతో పాటు వ్యాపారులకు ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా కూరగాయలు తీసుకెళ్లి విక్రయించుకుంటే వారం రోజుల కిందట కోసిన కూరగాయలు కూడా తాజాగా ఉంటాయి. రైతులు తాము పండించిన కూరగాయలకు ధరలు లేని సమయంలో వారం నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంచుకునేందుకు కోల్డ్‌ స్టోరేజీ పనిచేస్తుంది. మూడు చక్రాల బ్యాటరీ యంత్రం 300 నుంచి 400 కిలోల బరువు మోయగల సామర్థ్యం ఉండటంతో చాలా రకాల కూరగాయలను నిల్వ ఉంచుకోవచ్చు. బ్యాటరీ యంత్రంతో కలిపి కోల్డ్‌స్టోరేజీ తయారీకి రూ.40 వేలు నుంచి రూ.45 వేల వరకు ఖర్చవుతుందని విద్యార్థులు చెబుతున్నారు. యంత్రం పేటెంట్‌కు దరఖాస్తు చేసుకున్నామన్నారు. రైతులు, చిరు వ్యాపారులకు ఉపయోగపడేలా కోల్డ్‌ స్టోరేజీని తయారు చేసిన విద్యార్థులను కరస్పాండెంట్‌ డాక్టర్‌ విజయభాస్కర్‌చౌదరి, ప్రిన్సిపల్‌ యువరాజ్‌, అధ్యాపకులు, విద్యార్థులు అభినందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని