logo

శిక్షణ పేరిట నిరుద్యోగులకు కుచ్చుటోపీ

వ్యాపారంలో మెలకువలు నేర్పుతామని ఓ సంస్థ వందలాది నిరుద్యోగులను చేర్చుకుని వారికి శిక్షణనిచ్చి రూ.వేలకు వేలు కట్టించుకోవడంతోపాటు గొలుసు కట్టు విధానంలో మరికొందరిని చేర్పించాలని ఒత్తిడి తెచ్చింది.

Published : 02 Mar 2024 04:20 IST

డబ్బులు కట్టించుకుని నాసిరకం దుస్తుల సరఫరా
పోలీసులకు బాధితుల ఫిర్యాదు... చీటింగ్‌ కేసు నమోదు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : వ్యాపారంలో మెలకువలు నేర్పుతామని ఓ సంస్థ వందలాది నిరుద్యోగులను చేర్చుకుని వారికి శిక్షణనిచ్చి రూ.వేలకు వేలు కట్టించుకోవడంతోపాటు గొలుసు కట్టు విధానంలో మరికొందరిని చేర్పించాలని ఒత్తిడి తెచ్చింది. చివరకు నాసిరకం దుస్తులు అంటగట్టింది. తాము మోసపోయామని గుర్తించిన బాధితులు శుక్రవారం రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సీఐ యువరాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం... సీటీఎం రోడ్డులోని గ్యాబ్రిజ్‌ ఫ్యాషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో మదనపల్లె చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ప్రకటించారు. వారు వ్యాపారం చేసుకునేవిధంగా వస్త్రాలిస్తామని నమ్మబలికారు. దీన్ని నమ్మి వందలాది మంది నిరుద్యోగులు శిక్షణ పొందారు. శిక్షణ పూర్తయిన అనంతరం రూ.45 వేలు కట్టించుకుని నాసిరకం దుస్తులు అంటగట్టారు.

జత దుస్తుల ధర రూ.8 వేలు నుంచి రూ.10 వేల వరకు వసూలు చేశారు. అవి బహిరంగ విపణిలో రూ.1,000 కూడా చేయవని గుర్తించిన కొందరు యువకులు ఇదేమిటని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కుంచేవారిపల్లెకు చెందిన రాజశేఖర్‌, అతని స్నేహితుడు జగదీష్‌ శిక్షణకు వచ్చారు. వారికి గ్యాబ్రిక్‌ ఫ్యాషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థలో ఉద్యోగాలు ఇస్తామని నమ్మించారు. రూ.45 వేలు కట్టాల్సి ఉంటుందని చెప్పడంతో రాజశేఖర్‌ డబ్బు కట్టారు. శిక్షణ ఇచ్చిన సంస్థ తెల్లషర్టు, నల్లప్యాంటు ఇచ్చి మరో అయిదుగురిని సంస్థలో చేర్చాలని షరతు పెట్టి ఒత్తిడి తెచ్చారు. కొన్ని నాసిరకం దుస్తులిచ్చి వాటిని విక్రయించుకుని ఆదాయం పొందాలని సూచించారు. నాసిరకం దుస్తులివ్వడం, చైను లింకు పద్ధతిలో కొందరిని చేర్చమనడంపై సంస్థ ప్రతినిధులను రాజశేఖర్‌ నిలదీయడంతో ఆయన బయటకు పంపేశారు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సంస్థ నిర్వాహకుడిపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. సంస్థ రికార్డులు పరిశీలించి అనుమతి ఉందా లేదా విచారిస్తామన్నారు. బాధితులుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని