logo

పెద్దలకు పరిహారం.. పేదలకు పరిహాసం!

శ్రీకృష్ణదేవరాయ గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం రెండో దశలో చేపట్టాల్సిన ఉద్దిమడుగు జలాశయం భూసేకరణలో పెద్దలకు మాత్రమే పరిహారం అందింది. వైకాపా ప్రభుత్వంలో కీలక ప్రజా ప్రతినిధులు సిఫార్సు చేసినవారు మాత్రమే లబ్ధి పొందారు.

Published : 02 Mar 2024 04:24 IST

వైకాపా మద్దతుదారులకే లబ్ధి ఉద్దిమడుగు
జలాశయం భూసేకరణ తీరిది
న్యూస్‌టుడే, కడప, సిద్దవటం

శ్రీకృష్ణదేవరాయ గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం రెండో దశలో చేపట్టాల్సిన ఉద్దిమడుగు జలాశయం భూసేకరణలో పెద్దలకు మాత్రమే పరిహారం అందింది. వైకాపా ప్రభుత్వంలో కీలక ప్రజా ప్రతినిధులు సిఫార్సు చేసినవారు మాత్రమే లబ్ధి పొందారు. సన్న, చిన్నకారు రైతులకు రిక్తహస్తం చూపారు. మరోవైపు జలాశయం నిర్మాణ పనులకు మోక్షం లభించకపోవడంతో జలసంకల్పం సాకారం కాలేదు.

గాలేరు-నగరి సుజల స్రవంతి రెండో దశ ప్యాకేజీ-4లో సిద్దవటం మండలం భాకరాపేట సమీపంలో నిర్మించతలపెట్టిన ఉద్దిమడుగు జలాశయం భూసేకరణ పరిహారం పందేరం జరిగింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు రంగంలోకి దిగి చక్రం తిప్పారు. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తమకు అనుకూలమైన వారికి ప్రయోజనం చేకూర్చేవిధంగా పావులు కదిపారు. రెండేళ్ల కిందట బద్వేలు ఉప ఎన్నికల నేపథ్యంలో ఉద్దిమడుగు జలాశయం నిర్మాణ ప్రాంతం పరిధిలోని భూములు, కట్టడాలు, వృక్షాలకు పరిహారమివ్వాలని ఆమాత్యుల దృష్టికి తీసుకొచ్చారు. నియోజకవర్గంలో ఓటు బ్యాంకు ఉన్న నేతలకు ఇక్కడ భూములున్నాయని, వారికి మేలు చేకూర్చాలని సిఫార్సులు చేయడంతో దస్త్రం చకచకా కదిలింది. వైకాపా పెద్దల అండదండలున్న ఒంటిమిట్ట, సిద్దవటం, కడప, అట్లూరు మండలాలకు చెందినవారికి పరిహారం చెల్లించారు. అనంతరం మరికొందరు న్యాయపోరాటం చేసి పరిహారం పొందారు. ఇక్కడ అయిదు రీచ్‌లుండగా, ఎక్కడైతే ప్రధాన పనులు మొదలు పెడతారో అక్కడవారికి ప్రాధాన్యమివ్వాలనే విషయం తెలుగుగంగ, జీఎన్‌ఎస్‌ఎస్‌ భూసేకరణ అధికారులు విస్మరించారు. తమకు నచ్చిన మెచ్చిన 1, 2 రీచ్‌ల్లోని రైతులకే పెద్దపీట వేశారు. ఎగువ ప్రాంతంలో మునకలో చేరే అధికార పార్టీ నాయకులు, మద్దతుదారులకు చెందిన పంట పొలాలకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం రూ.25 కోట్లకు పైగా పరిహారం చెల్లించారు. ఎలాంటి పలుకుబడి లేని సన్న, చిన్నకారు రైతులకు చెందిన భూములు రీచ్‌-5లో ఉండగా, వారికి పరిహారమివ్వాలనే విషయం విస్మరించారు. తమకు పరిహారమివ్వాలని గత కొన్ని నెలలుగా రైతులు అడుగుతున్నా నిధుల్లేవంటూ పక్కన పెట్టేశారు. మరోవైపు ఉద్దిమడుగు జలాశయం నిర్మాణపనులు చేయకపోవడంతో ఉత్తిదేనా అనే మాట కర్షకుల నోట వినిపిస్తోంది.
ఏఏ పనులు చేయాలంటే... : జలవనరు నిల్వ సామర్థ్యం 1.04 టీఎంసీలు తొలుత 2005, అక్టోబరు 15న రూ.152.8 కోట్లతో చేపట్టాలని పాలనామోదం ఇచ్చి టెండర్లు పిలిచారు. ఓ గుత్తేదారు సంస్థ పనులు దక్కించుకోగా 2007, జూన్‌ 25న రూ.111.96 కోట్లకు ఒప్పందం జరిగింది. 2011, జూన్‌ 24న లోపు పూర్తి చేయాలని గడువిచ్చారు. జలవనరు నిర్మాణంతో 10 వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరివ్వాలని రూపకల్పన చేసినా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. సిద్దవటం, ఒంటిమిట్ట,  నందలూరు, రాజంపేట, పుల్లంపేట, ఓబులవారిపల్లె, చిట్వేలి, రైల్వేకోడూరు మండలాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. ఈ ప్యాకేజీలో కాలువ 119 నుంచి 141.35 కిలోమీటర్లు తవ్వి మధ్యలో ఉద్దిమడుగు జలాశయాన్ని నిర్మించాల్సి ఉన్నా పనుల్లో ఎలాంటి కదలిక లేదు. పనుల అంచనాలను 2021-22 ధరలను అనుసరించి సవరించాలని ప్రతిపాదించారు. మట్టి కట్ట, స్పిల్‌వే  పనులకు రూ.414.282 కోట్లు, నిర్మాణ సామగ్రి, విద్యుత్తు స్తంభాలు, తీగల మార్పునకు రూ.25.41 కోట్లు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), సీనరేజి రుసుం చెల్లింపులకు రూ.64.63 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. భూసేకరణలో భాగంగా అటవీభూమి 1,065 ఎకరాలు,  రైతుల భూములు 552.44 ఎకరాల సేకరణకు రూ.209.1 కోట్లు అవసరమని అంచనా వేశారు.  
అనుమతులు రాగానే పనులు : ఉన్నతస్థాయి నుంచి అనుమతులు రాగానే ఉద్దిమడుగు జలాశయం నిర్మాణపనులు చేపడతాం.  నిధులు కేటాయించాలని భూసేకరణ అధికారుల నుంచి అభ్యర్థనలొచ్చాయి. ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.  
- డి.వెంకట్రామయ్య, ఎస్‌ఈ, తెలుగుగంగ సర్కిల్‌, కడప

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని