logo

జగనన్నా... ఇదేనా మాపై కరుణ?

ఇక్కడ సెంటు స్థలంలో రూ.70 వేలు మొదలుకుని రూ.1.80 లక్షల వరకు ఖర్చు చేసి పేదలు వేసుకున్న పునాదులుంటాయి...రూ.6 లక్షలు మొదలుకుని రూ.9 లక్షల వరకు ఖర్చు చేసినా పూర్తి చేసుకోలేని ఇళ్లూ ఉంటాయి.

Updated : 02 Mar 2024 06:34 IST

ఈనాడు కడప, న్యూస్‌టుడే, కడప నగరపాలక: ఇక్కడ సెంటు స్థలంలో రూ.70 వేలు మొదలుకుని రూ.1.80 లక్షల వరకు ఖర్చు చేసి పేదలు వేసుకున్న పునాదులుంటాయి...రూ.6 లక్షలు మొదలుకుని రూ.9 లక్షల వరకు ఖర్చు చేసినా పూర్తి చేసుకోలేని ఇళ్లూ ఉంటాయి. ‘పునాదులు వేసుకోకపోతే పట్టాలు రద్దు చేస్తాం... ఇళ్లు కట్టకోకపోతే సంక్షేమ పథకాలు నిలిపేస్తామని అధికార యంత్రాంగం బెదిరించడంతో వెలిసిన బలవంతపు నిర్మాణాలివి ! జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టించి ఇస్తారన్న ఆశతో దరఖాస్తు చేసుకున్న పేదలు జగనన్న కాలనీ పేరుతో విసిరిన ఆశల వలలో చిక్కుకున్నారు. ఇళ్లు కట్టించి ఇస్తామన్న హామీని నెరవేర్చకపోవడం, ఇచ్చిన స్థలంలో నిర్మాణాలు చేపట్టాల్సిందేనన్న బెదిరింపులతో కడప నగర సమీపంలోని నానాపల్లి ప్రాంతంలో దాదాపు 5 వేల మంది పేదలు అప్పులు చేసి పునాదులు, ఆపై దశ వరకు పనులు చేపట్టారు. సగటున ఒక్కో లబ్ధిదారు రూ.లక్ష అప్పు చేసినట్టు అంచనా. ఇంతా చేసినా ఇంటి నిర్మాణం పూర్తయ్యే అవకాశం లేకుండాపోయింది. జగనన్న కాలనీ పేరుతో సెంటు స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి మొండిచేయి చూపి కనీస అవసరాల కల్పనను మరిచిపోవడంతో లబ్ధిదారుల సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. జగనన్న కాలనీలో ఇంటి కోసం ఆశపడి అప్పులపాలయ్యామని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు.


టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టేశారు : బత్యాల

రాజంపేట, న్యూస్‌టుడే:  వైకాపా ప్రభుత్వం లబ్ధిదారులకు తెలియకుండా టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టిందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు ఆరోపించారు. ఇందుకు సంబంధించి వడ్డీ బ్యాంకుకు చెల్లించకపోవడంతో నేరుగా లబ్ధిదారులకు నోటీసులు అందాయని తెలిపారు. స్థానిక తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గత తెదేపా ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు బలవంతంగా లబ్ధిదారుల నుంచి ఓటీఎస్‌ పేరుతో రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేశారని ధ్వజమెత్తారు. ఏటా అయిదు లక్షల చొప్పున అయిదేళ్లలో 25 లక్షల ఇళ్లను నిర్మించి పేదలకు ఇస్తానన్న హామీని సీఎం జగన్‌ విస్మరించారని విమర్శించారు. నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో సెంటు స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించామని గొప్పలు చెప్పుకోవడం దారుణమన్నారు. ఆయనవెంట నాయకులు సుధాకర్‌, ప్రతాప్‌రాజు, సుబ్రహ్మణ్యంనాయుడు, సంజీవరావు, అశోక్‌, అబూబకర్‌, శ్రీనివాసులు, నరసింహ, రెడ్డయ్యనాయుడు తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని