logo

చిన్నారిని మింగేసిన కాలువ!

రక్షణ గోడ లేని కాలువలో పడి ఓ చిన్నారి మృతిచెందిన హృదయవిదారక ఘటన ప్రొద్దుటూరు పట్టణంలో చోటుచేసుకుంది. అప్పటివరకు ముద్దుముద్దుగా మాట్లాడుతూ...  బుడిబుడి అడుగులు వేస్తూ సందడి చేసిన రెండేళ్ల చిన్నారి మృత్యువాత పడడంపై తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

Published : 02 Mar 2024 04:27 IST

రక్షణ గోడ లేకపోవడంతో ప్రమాదం

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: రక్షణ గోడ లేని కాలువలో పడి ఓ చిన్నారి మృతిచెందిన హృదయవిదారక ఘటన ప్రొద్దుటూరు పట్టణంలో చోటుచేసుకుంది. అప్పటివరకు ముద్దుముద్దుగా మాట్లాడుతూ...  బుడిబుడి అడుగులు వేస్తూ సందడి చేసిన రెండేళ్ల చిన్నారి మృత్యువాత పడడంపై తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. స్థానిక నరసింహపురం బీసీ కాలనీలో గురువారం సాయంత్రం పుల్లప్పగారి జస్విత (2) తన అక్క ప్రగతితో కలిసి అంగడిలో తినుబండారాలు కొనుక్కునేందుకు వచ్చి రక్షణ గోడ లేని నాలుగు అడుగుల లోతున్న కాలువలో పడిపోయింది. ఘటన జరిగిన సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడం, అక్క గమనించకపోవడంతో 15 నిమిషాల తర్వాత ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులతోపాటు తండ్రి రాజా కాలువలోకి దిగి జస్విత బయటకుతీశారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను వెంటనే ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాప పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కడప నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సలహా మేరకు కర్నూలుకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించడంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. కాలువకు రక్షణ గోడ నిర్మించకపోవడంతోనే తమ పాప చనిపోయిందని తల్లిదండ్రులు, స్థానికులు ఆక్రోశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని