logo

జలయజ్ఞం..కల భగ్నం!

సీఎం జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలని చేపట్టిన జలయజ్ఞం పనులు ముందుకు కదలడం లేదు.

Updated : 02 Mar 2024 06:34 IST

భూసేకరణ సమస్యతో కదలని పనులు
సీఎం ఇలాకాలో ఎత్తిపోతల పథకం తీరిది
న్యూస్‌టుడే, కడప, కొండాపురం

సీఎం జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలని చేపట్టిన జలయజ్ఞం పనులు ముందుకు కదలడం లేదు. నీటిపారుదలశాఖ సాంకేతిక నిపుణుల్లో కొరవడిన దూరదృష్టి, భూసేకరణ సమస్య, నిధుల కొరత వెరసి కర్షకుల కల భగ్నమైంది. తొలుత సీఎం జగన్‌ మెప్పు పొందాలని ఇంజినీర్లు ఆర్భాటం చేశారు. పరిహారం తక్కువగా ఇస్తున్నారని భూములివ్వడానికి రైతులు వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పైపులైను స్థానంలో సొరంగం తవ్వాలని అధ్యయనం చేస్తున్నారు. గత మూడేళ్లుగా చూస్తే కనీసం 10 శాతం కూడా ప్రగతి లేకపోవడం గమనార్హం.  

శ్రీకృష్ణదేవరాయ గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగంగా గండికోట జలాశయాన్ని 26.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఇక్కడ నుంచి పెంచికల బసిరెడ్డి జలాశయం (పీబీఆర్‌)లోకి కృష్ణా జలాలు 8.30 టీఎంసీలు, జీకేఎల్‌ఐ నుంచి పైడిపాళెంలోకి 6 టీఎంసీల నీటిని తరలించాలని పదేళ్ల కిందట ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రెండింటినీ విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల కిందట నిర్ణయం తీసుకుంది. రాయలసీమ కరవు నివారణ పథకం (ఆర్‌డీఎంపీ) కింద పనులు చేపట్టాలని జిల్లా నీటిపారుదలశాఖ ఇంజినీర్లు ప్రతిపాదించారు. పనులు చేపట్టడానికి 2020, ఆగస్టు 26న రూ.3,556.76 కోట్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సాంకేతిక అనుమతులు 2020, డిసెంబరు 5న రూ.3,015 కోట్లకు ఇచ్చారు. సీఎం జగన్‌ అదే ఏడాది డిసెంబరు 24న పులివెందులలో శంకుస్థాపన చేశారు. నీటిపారుదలశాఖ సాంకేతిక నిపుణులు టెండర్లు పిలవగా, మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ సంస్థ 0.160 శాతం తక్కువకు పనులు పొందింది. అనంతరం 2021, మార్చి 8న రూ.2,601.28 కోట్లకు ఒప్పందం జరిగింది. తొలుత 2024, జులై 3వ తేదీ లోపు పనులు పూర్తిచేయాలని గడువిచ్చారు. అనంతరం 2026, ఫిబ్రవరి 28లోపు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఎత్తిపోతల పంపుహౌస్‌ల నిర్మాణం, గొట్టాల ఏర్పాటు, అనుసంధాన కాలువల తవ్వకం, సొరంగం పనులకు 600 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూసేకరణ ప్రక్రియ నత్తనకడన సాగుతోంది. మట్టి, కాంక్రీటు, విద్యుత్తు, ఇతర పనులకు కలిపి రూ.4.39 కోట్లు చెల్లించారు. గత కొన్ని నెలలుగా చూస్తే పనుల్లో ఎలాంటి పురోగతి లేదు.


పైపులైను స్థానంలో సొరంగం

గండికోట జలాశయం నుంచి పైడిపాళెం వరకు సుమారు 12 కిలోమీటర్ల పొడవునా రెండు వరుసల పైపులైను వేయాలని తొలుత నిర్ణయించారు. వెయ్యి క్యూసెక్కుల నీటిని తరలించే విధంగా ఆకృతి రూపొందించారు. జీకే-సీబీఆర్‌ (పీబీఆర్‌) వరకు మరో 27 కిలోమీటర్ల పొడవునా నాలుగు వరుసల గొట్టాలు (రెండు వేల క్యూసెక్కుల సామర్థ్యం) ఏర్పాటు చేయాలి. నీటిని తోడేందుకు మోటార్లు, పంపులు, పంపుహౌస్‌ల నిర్మాణం, అనుసంధాన కాలువ తవ్వకం, విద్యుత్తు సరఫరాకు ఉప కేంద్రాల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. భూసేకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రధాన రహదారులు, గ్రామాలకు పక్కన, మండల కేంద్రాల శివారులో ఎకరాకు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు ఇస్తామని చెబుతున్నారు. రైతులు మాత్రం ఇంత తక్కువ ధరకు భూములివ్వలేమని తెగేసి చెబుతున్నారు. కొన్నిచోట్ల ప్రైవేటుగా చూస్తే ఎకరా ధర రూ.అరకోటి పలుకుతోంది. ఇంత చెల్లించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. దీంతో భూసేకరణ గుదిబండగా మారింది. పైపులైను స్థానంలో భూగర్భంలో సొరంగం తవ్వాలని నిర్ణయించి క్షేత్రస్థాయిలో సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నారు. ఎత్తిపోతల పథకం పూర్తయితే పులివెందుల నియోజకవర్గంలో పీబీసీ ఆయకట్టు 55,580 ఎకరాలు, సీబీఆర్‌ కుడి కాలువ కింద 59,500, జీకేఎల్‌ఐ కింద 47,500, పీబీసీ ఎత్తిపోతల పథకం ద్వారా 12 వేలు, ఎర్రబల్లె ఎత్తిపోతల పథకం కింద 25 వేల ఎకరాలకు లబ్ధి చేకూరుతుంది. సీఎం జగన్‌ స్వయంగా శంకుస్థాపన చేసి మూడేళ్లు దాటినా 10 శాతం పురోగతి లేకపోవడం గమనార్హం.


పనులు చేపడతాం

- ఎం.మల్లికార్జునరెడ్డి, సీఈ, జలవనరులశాఖ, కడప

గండికోట నుంచి జీకేఎల్‌ఐ, జీకే-సీబీఆర్‌ ఎత్తిపోతల పథకాల ద్వారా కృష్ణా జలాలు తరలించాలని తొలుత పైపులైను వేయాలని నిర్ణయించాం. భూములివ్వడానికి రైతులు ముందుకు రావడం లేదు. సొరంగం ద్వారా పైడిపాళెం, పీబీఆర్‌లోకి నీటిని తరలించాలని నిర్ణయించి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో ఆకృతి మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ అనుమతితో పనులు చేయిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని