logo

వివేకా హత్య కేసును నీరుగార్చేందుకు కుట్ర

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును నీరుగార్చేలా తప్పుదారి పట్టించేందుకు తీవ్రస్థాయిలో కుట్ర జరుగుతోందని అప్రూవర్‌ దస్తగిరి ఆరోపించారు. పులివెందులలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Published : 02 Mar 2024 04:32 IST

అప్రూవర్‌ దస్తగిరి

పులివెందుల, న్యూస్‌టుడే : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును నీరుగార్చేలా తప్పుదారి పట్టించేందుకు తీవ్రస్థాయిలో కుట్ర జరుగుతోందని అప్రూవర్‌ దస్తగిరి ఆరోపించారు. పులివెందులలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి తరహాలో తమకు అనుకూలంగా మారితే రాజకీయంగా తమ వాళ్లకు ఇబ్బంది ఉండదని, క్షేమంగా జైలు నుంచి బయటకు వస్తారని ఈ కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి ప్రలోభపెట్టారని వెల్లడించారు. కేసు దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ తీవ్రంగా కొట్టి బలవంతంగా అప్రూవర్‌గా మార్చారని చెప్పాలని భయపెట్టారన్నారు. ఇందుకు రూ.20 కోట్లు ఇస్తామంటూ బేరసారాలకు దిగారని పేర్కొన్నారు. బయట ఉంటే ప్రలోభ పెట్టేందుకు అవకాశం ఉండదని గ్రహించి తనపై అక్రమ కేసు బనాయించి జైలుకు పంపి అక్కడ బేరసారాలకు దిగారని ఆరోపించారు. వివేకా హత్యతో పడిన మచ్చను తుడిచేసుకునేందుకు సీఎం జగన్‌ కొత్త తరహాలో అస్త్రం ప్రయోగించారన్నారు. నన్ను ప్రలోభపెట్టి ఎంపీ అవినాష్‌రెడ్డి, నిందితులు వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై చెడ్డపేరును తొలగించడంతో పాటు వారిని బయటకు తీసుకొచ్చేందుకు కుట్ర పన్నారని పేర్కొన్నారు. హత్య కేసుతో వారికి సంబంధం లేకపోతే నేను చెప్పిన అంశాలన్నీ అవాస్తవాలని ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు. హత్య కేసులో వారి ప్రమేయం ఉండడంతోనే నోరు మెదపడం లేదన్నారు. వివేకా హత్యను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రజల్లో సానుభూతి పొంది 2019 ఎన్నికల్లో సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ప్రజల్లో సానుభూతి పొందేందుకు బలవంతంగా నన్ను అప్రూవర్‌గా మార్చారని చెప్పించేందుకు అన్ని విధాలుగా ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. ఏమి జరిగినా అప్రూవర్‌గానే ఉంటానని, వివేకా కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. పులివెందులలో సీఎం జగన్‌ ఇంటి సమీపంలోనే తన ఇల్లు ఉందని, దేనికైనా సిద్ధమని సవాల్‌ విసిరారు. రాజకీయంగా తనను అణగదొక్కేందుకు యత్నిస్తే సీఎం జగన్‌ ఇబ్బందుల్లో పడతారన్నారు. నేను జైల్లో ఉన్న సమయంలో పులివెందుల పురపాలక కౌన్సిలర్‌ రాజశేఖర్‌రెడ్డి నా భార్య వద్దకు వెళ్లి నీ భర్త బయటకు రావాలంటే సీˆబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ కొట్టి, బలవంతంగా అప్రూవర్‌గా మార్చరని చెప్పించాలంటూ ఒత్తిడి చేశారన్నారు. వైకాపా కార్యాలయంలో రూ.20 కోట్లు ఉన్నాయని, ఆ డబ్బు మీకు ఇస్తామని నా భార్యను ప్రలోభపెట్టారని ఆరోపించారు. నాపై అక్రమకేసులు పెట్టినా ఏ పార్టీలు ఆదుకోలేదని, జైభీమ్‌ భారత్‌ పార్టీ అధినేత జడ శ్రావణ్‌కుమార్‌ తన వైపు నిలబడి బెయిల్‌ ఇప్పించారన్నారు. అందుకే ఆ పార్టీలో చేరానన్నారు. సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని