logo

వసుతుల్లేక...ఉండలేక !

ఒంటిమిట్ట మండలం మంటపంపల్లె, చింతరాజుపల్లె, కోనరాజుపల్లె, రాచగుడిపల్లె, ఒంటిమిట్ట, మంగంపేటలోని జగనన్న కాలనీల్లో ఎక్కడా మౌలిక వసతులు కల్పించలేదు

Updated : 03 Apr 2024 06:13 IST

జగనన్న కాలనీల్లో శాశ్వత సదుపాయాలు కరవు

ఒంటిమిట్ట మండలం మంటపంపల్లె, చింతరాజుపల్లె, కోనరాజుపల్లె, రాచగుడిపల్లె, ఒంటిమిట్ట, మంగంపేటలోని జగనన్న కాలనీల్లో ఎక్కడా మౌలిక వసతులు కల్పించలేదు. మట్టి రహదారులు దయనీయంగా ఉన్నాయి. అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి.

  •  సిద్దవటం మండలం మాధవరం-1, సిద్దవటం, ఉప్పరపల్లి జగనన్న కాలనీల్లో వీధులు అధ్వానంగా ఉన్నాయి. రాళ్లు, రప్పలు, గుంతలు ఏర్పడ్డాయి. సీసీ రోడ్ల ఊసే లేదు. వీధి దీపాల జాడ లేదు. నీటి ట్యాంకులు నిర్మించలేదు. కొన్ని ఇళ్లు పూర్తయినా వసతులు లేకపోవడంతో ఎవరూ నివాసం ఉండడం లేదు.  
  • రాజంపేట మండలం పోలి, పోలి ఎస్సీ, ఎస్టీ కాలనీ, ఊటుకూరు, మిట్టమీదపల్లి, బ్రాహ్మణపల్లి, కారంపల్లె, బోయనపల్లి జగనన్న కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మించలేదు. తాగునీటి కటకటతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

-న్యూస్‌టుడే, ఒంటిమిట్ట, సిద్దవటం, కొండాపురం, రాజంపేట గ్రామీణ: సొంతిల్లు లేని నిరుపేదలకు పక్కాగృహాలు మంజూరు చేస్తాం.. సొంత గూడు కల సాకారం చేస్తాం.. మౌలిక వసతులు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. క్షేత్రస్థాయిలో శాశ్వత వసతుల  మాటను పాలకులు విస్మరించారు. తాత్కాలిక పనులు చేసి చేతులు దులుపేసుకున్నారు. వైకాపా పాలన కాలం ముగింపు దశకు వచ్చినా, చేసిన వాగ్దానం మాత్రం నెరవేరలేదు. వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని పల్లె, పట్టణ ప్రాంతాల్లో 954 చోట్ల జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఒక్కో లబ్ధిదారుకు ఒకటిన్నర సెంటు, పుర, నగరపాలకల్లో సెంటు విస్తీర్ణంలో స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో లేఅవుట్లు వేశారు. ఇప్పటివరకు నగదు రూపంలో రూ.769.67 కోట్లు, సిమెంటు కోసం రూ.212.14 కోట్లు, విద్యుత్తు వసతి, తాగునీటి సరఫరాకు రూ.25 కోట్లకు పైగా ఖర్చు చేశారు.

ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి?

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పథకం నిధులతో తాత్కాలికంగా మట్టి దారులు ఏర్పాటు చేసి సరిపెట్టేశారు. సిమెంటు రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. జగనన్న కాలనీల ఏర్పాటు, పక్కాగృహాల మంజూరులో చూపిన ఉత్సాహం మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపలేదు. అదే పేదల పేరిట శాపంగా మారింది. కొన్నిచోట్ల ఉపాధి హామీ పథకం పద్దుతో పనులకు అనుమతిచ్చారు. ఎన్నికల సంవత్సరం కావడంతో గుత్తేదారులు, అధికార పార్టీ నాయకులు పనులు చేయడానికి ముందుకు రాలేదు. అంచనాలు, ప్రతిపాదనలు, ఉత్తర్వులు కాగితాల్లోనే పదిలంగా ఉన్నాయి. ప్రగతి ఊసే లేదు. మురుగు పారుదల వ్యవస్థ కాలువలను ఏర్పాటు చేయలేదు. తాగునీటి నిల్వ కోసం తాత్కాలిక ప్లాస్టిక్‌ ట్యాంకులు ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో కుళాయిలను ఏర్పాటు చేయలేదు. భూతల, భూఉపరితల జలాశయాలను నిర్మించలేదు. వీధి దీపాలను అమర్చలేదు. వసతులకు ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలని గ్రామీణులు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని