logo

TS High court: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వినతిపై నిర్ణయం తీసుకోండి: ఈసీకి హైకోర్టు సూచన

Eenadu icon
By Telangana Dist. Team Updated : 02 May 2024 20:22 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: బ్యాలెట్‌ పేపరులో మార్పులపై చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి, వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి విశ్వేశ్వర్‌రెడ్డితో పాటు 46 మంది నామినేషన్‌ దాఖలు చేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు వాదించారు. పిటిషనర్‌ పేరు ఉన్న మరో వ్యక్తి కూడా నామినేషన్‌ వేశారన్నారు. జాబితాలో సీరియల్‌ నెం.2గా పిటిషనర్‌ పేరు, ఐదో పేరుగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (S/O కాంతారెడ్డి) అనే మరో అభ్యర్థి ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్‌ ప్రచారానికి వెళ్తుంటే 5వ నెంబరు అభ్యర్థా అని అడుగుతున్నారని చెప్పారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్లు ఒకే చోట ఉంటే ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని, ఈ రెండు పేర్ల మధ్య కనీసం 10 నెంబర్లు వ్యత్యాసం ఉండేలా బ్యాలెట్‌ పేపర్‌లో మార్పులు చేసేలా ఆదేశించాలని కోరారు. దీనికి సంబంధించి గత నెల 30న ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించామన్నారు. వినతి పత్రంపై నిర్ణయం తీసుకునే దాకా సీరియల్ నెంబర్లు కేటాయించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 

ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున పిటిషనర్ వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం బ్యాలెట్ పేపర్లో మార్పులు చేయాలంటూ ఎన్నికల సంఘానికి ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే పిటిషనర్ సమర్పించిన వినతి పత్రంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించింది.

Tags :
Published : 02 May 2024 20:11 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని