logo

Hyderabad: కి.మీ.రోడ్డుకు.. రూ.3.35 కోట్లు

Eenadu icon
By Telangana Dist. Desk Updated : 22 Jan 2025 08:46 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

బాగున్న రోడ్లనే బాగు చేస్తామంటూ ప్రతిపాదనలు
రూ.3,825 కోట్లతో సీఆర్‌ఎంపీ-2
ఈనాడు, హైదరాబాద్‌

సీఆర్‌ఎంపీ-2 (రహదారుల సమగ్ర నిర్వహణ కార్యక్రమం) పేరుతో జీహెచ్‌ఎంసీ రాబోయే ఐదేళ్లకు 1,142.54 కి.మీ రోడ్లకు రూ.3,825 కోట్లను వెచ్చించేందుకు సిద్ధమైంది. అంటే.. సగటున కిలోమీటరు రోడ్డు నిర్వహణకు రూ.3.35కోట్లు వెచ్చించబోతోంది. ఐదేళ్ల కిందట సీఆర్‌ఎంపీ-1 ప్రాజెక్టు మొదలైనప్పుడు ఈసగటు వ్యయం రూ.2.59 కోట్లు ఉండగా..  తాజా గా  రూ.3.35 కోట్ల కు చేరుకుంది. రాబోయే ఐదేళ్లు పూర్తయ్యే నాటికి ఆ సగటు వ్యయం రూ.4.5కోట్లకు చేరొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. మొదటి దశలో పునర్‌ నిర్మించిన వందలాది కిలోమీటర్ల రోడ్లనే.. రెండో దశలోనూ  కొనసాగించడం అనుమానాలకు తావిస్తోంది.  కొన్నేళ్లుగా నిర్మాణానికి నోచుకోకుండా.. గుంతలతో ప్రజలను ఇబ్బందిపెట్టే అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. బాగున్న రోడ్లపైనే వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తామంటూ ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేసి.. ఆమోదించాలంటూ స్థాయీ సంఘానికి తీర్మానం పంపడంపై ఆరోపణలొస్తున్నాయి.

సీఆర్‌ఎంపీ-1లో..

2020లో సీఆర్‌ఎంపీ-1 మొదలైంది. ఏడు ప్యాకేజీలుగా 709కి.మీ రోడ్లను రూ.1,839కోట్లతో ఐదేళ్లపాటు నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ  పనులు అప్పగించింది. ఈ క్రమంలో మరికొన్ని రోడ్లను చేర్చడంతో జీహెచ్‌ఎంసీ రూ.2,491కోట్లు వెచ్చించింది. మొదటి దశ పూర్తవడంతో.. 2025-2030 కాలానికి రెండో దశకు ఇంజినీర్లు ప్రతిపాదనలు రూపొందించారు.

పాత రోడ్లనే..

సీఆర్‌ఎంపీ-1లో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణం జరిగింది. ఆయా రోడ్లకు, మరో 398.32కి.మీ రోడ్లను కలిపి మొత్తం 1,142.54   కి.మీ రోడ్లకు సీఆర్‌ఎంపీ-2 ప్రతిపాదించారు. అవసరమైనచోట వరదనీటి కాలువలను నిర్మించి, నిర్వహించడం, ప్రధాన దారుల్లోని  వరదనీటి కాలువలు, మ్యాన్‌హోళ్ల నిర్వహణ రెండోదశలో భాగమని ఇంజినీర్లు చెబుతున్నారు.

Tags :
Published : 22 Jan 2025 08:44 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు