logo

GHMC Meyor: నేనే వెళ్తున్నా.. మీరెందుకు రారు..?: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌పై మేయర్‌ ఆగ్రహం

Eenadu icon
By Telangana Dist. Desk Updated : 24 Jan 2025 08:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

వీధిలైట్ల సమస్యపై స్థాయీ సంఘం మండిపాటు
13 తీర్మానాలకు ఆమోదం

మాట్లాడుతున్న మేయర్‌ విజయలక్ష్మి, కమిషనర్‌ ఇలంబర్తి 

ఈనాడు, హైదరాబాద్‌: మేయర్‌ హోదాలో తాను నగరంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను పరిశీలిస్తుంటే.. మీరెందుకు హాజరవట్లేదంటూ నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబర్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన స్థాయీ సంఘ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమస్యలపై అధికారులకు అవగాహన ఉండట్లేదని, నిర్లక్ష్యంగా ఉంటున్నారని మండిపడ్డారు. స్థాయీ సంఘం సభ్యులు సైతం మేయర్‌తో స్వరం కలిపారు. నగరంలో వీధి లైట్ల సమస్య ఆరు నెలలుగా ఉందని, పాడైపోయిన లైట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం లేదని పేర్కొన్నారు.  కేబీఆర్‌ పార్కు చుట్డూ కూడళ్లలో చేపట్టాల్సిన భూసేకరణపై పూర్తి వివరాలు ఇవ్వాలని, ఎవరెవరి ఇళ్లను, ఎంత మేర తొలగించాలనే ప్రతిపాదనలను అందజేశాక తీర్మానాన్ని ఆమోదిస్తామన్నారు. కాగితాల్లో చూపించే భూసేకరణ, క్షేత్రస్థాయిలో కనిపించట్లేదని ఆరోపించారు.

అభివృద్ధి పనులకు పచ్చజెండా

నగరాభివృద్ధికి సంబంధించి పలు ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్థాయీ సంఘం సమావేశంలో ఆమోదం లభించింది. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో..13 తీర్మానాలను సభ్యులు ఆమోదించారు.

తీర్మానాలు ఇవీ...

  • 744.22కి.మీ పొడవైన ప్రధాన రహదారులను మొదటి దశ సీఆర్‌ఎంపీ(రహదారుల సమగ్ర నిర్వహణ కార్యక్రమం)లో మాదిరే.. రాబోయే ఐదేళ్లపాటు రూ.2,491కోట్లతో ప్రైవేటు సంస్థల నిర్వహణకు ఇవ్వాలని స్థాయీ సంఘం తీర్మానించింది. లేదంటే మొదటి దశలోని రోడ్లకు మరికొన్ని రహదారులను కలిపి 1,142.54 కి.మీ రోడ్లను రూ.3,825 కోట్ల అంచనా వ్యయంతో ప్రైవేటు నిర్వహణకు ఇవ్వాలని ప్రతిపాదించింది. 
  • హెచ్‌-సిటీలో భాగంగా శేరిలింగంపల్లి జోన్‌లో గుల్మొహర్‌ పార్కు కూడలి నుంచి తారానగర్‌ మీదుగా బీహెచ్‌ఈఎల్‌ కూడలి వరకు రోడ్డును 100-120అడుగుల మేర విస్తరించేందుకు 227 ఆస్తులను సేకరించేందుకు పచ్చజెండా.
  •  జూపార్కు-ఆరాంఘర్‌ పైవంతెనకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేరు పెట్టడం, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులతో మూడు వేర్వేరు ప్రాంతాల్లో పార్కులు, రోడ్డు విభాగినిలను ఏడాదిపాటు నిర్వహిస్తామంటూ ముందుకొచ్చిన ప్రైవేటు సంస్థలతో ఒప్పందం, సీఎస్‌ఆర్‌ నిధులతో కేబీఆర్‌ పార్కు చుట్టూ కుండీల్లో పూల మొక్కలు, ఆకర్షణీయమైన మొక్కలను ఏర్పాటు చేయడం, రూ.29.28కోట్లతో ఏడాది పొడవునా నాలాల్లో పూడికత, లాలాపేట పైవంతెన నుంచి మౌలాలి పైవంతెన వరకు రోడ్డు విస్తరణకు గతంలో ఖర్చు చేయాలనుకున్న రూ.3కోట్లకు, మరో రూ.1.3కోట్లు అదనంగా కేటాయించడం, రూ.7,032కోట్ల హెచ్‌సిటీ పనులను ఆమోదించుకోవడం, గోషామహల్‌ పోలీస్‌ గ్రౌండ్‌ నుంచి ఉస్మానియా ఆస్పత్రి వరకు 9, 12, 18 మీటర్ల వెడల్పుతో రోడ్డు విస్తరణ వంటి తీర్మానాలు సైతం సమావేశంలో ఆమోదం పొందాయి.
Tags :
Published : 24 Jan 2025 08:34 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు