logo

Telangana Cabinet: 201 కి.మీ మేర ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి తెలంగాణ కేబినెట్‌ ఆమోదం

Eenadu icon
By Telangana Dist. Team Updated : 23 Jun 2025 22:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

హైదరాబాద్‌: చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి వరకు 201కి.మీ మేర ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సోమవారం సుదీర్ఘంగా భేటీ అయిన కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. రేపటితో రైతులందరికీ రైతుభరోసా పూర్తవుతుందని, 9 రోజుల్లో రూ. 9 వేల కోట్ల మొత్తాన్ని రైతులకు అందజేశామని తెలిపారు. రైతుభరోసా కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో రైతుల సమక్షంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేబినెట్‌ నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లోనూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

‘‘వ్యవసాయం దండగ కాదు.. పండుగ అనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ నీటి వాటాను ఏపీకి అప్పగిస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. బనకచర్ల బంకను మా ప్రభుత్వానికి రుద్దాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో చట్టపరంగా, న్యాయపరంగా ముందుకెళ్తాం. గోదావరి జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకోవద్దని నిర్ణయం తీసుకున్నాం. గోదావరి జలాల విషయంలో జులై మొదటి వారంలో కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినిపిస్తాం. కాళేశ్వరంపై ఈనెల 30లోపు కమిషన్‌కు పూర్తి వివరాలు ఇవ్వాలని నిర్ణయించాం. కాళేశ్వరానికి గత ప్రభుత్వ మంత్రివర్గ ఆమోదం ఉందా? లేదా? వివరాలు ఇవ్వాలని నిర్ణయించాం’’ అని పొంగులేటి వివరించారు. నూతన క్రీడా పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్రీడా కోటాలో రిజర్వేషన్లు పెంచాలని, క్రీడాకారులను ప్రోత్సహించేలా పారితోషికాలు ఇవ్వాలని నిర్ణయించింది.

కేబినెట్‌ భేటీలో తీసుకున్న పలు నిర్ణయాలు.. 

  • రేపు సాయంత్రం 4 గంటలకు రైతునేస్తం కార్యక్రమం ఘనంగా నిర్వహిండం
  • అన్ని కలెక్టరేట్లలో డిసెంబరు 9 నాటికి తెలంగాణ విగ్రహాలు ఏర్పాటు చేయడం 
  • బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు చట్టం, న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయం
  • విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై రెండు రాష్ట్రాల అధికారుల కమిటీల సమావేశం నిర్వహించాలని నిర్ణయం
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను ఈనెల 30 లోగా కమిషన్‌కు అందివ్వాలని కేబినెట్ నిర్ణయం 
  • తెలంగాణ స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం
  • తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ డాక్యుమెంట్ రూపొందించేందుకు ఆమోదం
  • డిసెంబరు 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ ఆవిష్కరించాలని నిర్ణయం
  • సంగారెడ్డి జిల్లాలోని రెండు కొత్త మున్సిపాల్టీలు ఏర్పాటుకు ఆమోదం
  • ఇస్నాపూర్ మున్సిపాలిటీ అప్‌గ్రేడ్‌కు మంత్రివర్గం ఆమోదం
Tags :
Published : 23 Jun 2025 22:32 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని