logo

Karnataka: డీకేతో ‘ఢీ కొట్టినట్లే’

Eenadu icon
By Karnataka News Desk Updated : 23 Oct 2025 10:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

సిద్ధు చక్రం తిప్పేదెలా?                 స్వరం పెంచిన యతీంద్ర  

ఈనాడు, బెంగళూరు: ‘మా నాన్న సిద్ధరామయ్య రాజకీయ చరమాంకంలో ఉన్నారన్నది నా అభిప్రాయం. 2028 ఎన్నికల్లో పోటీ చేయనని ఇదివరకే చెప్పారు. అందుకే.. ఆయన రాజకీయ చివరి దశ అని అన్నా’నంటూ విధానపరిషత్‌ సభ్యుడు యతీంద్ర సిద్ధరామయ్య వివరణ ఇచ్చాక.. రాజకీయ వర్గాలు కొత్త ఆలోచనల్లో మునిగిపోయాయి. నాన్న రాజకీయ భవిష్యత్తుపై నేను కొత్తగా చెప్పిందేమీ లేదని యతీంద్ర వివరణ ఇచ్చారు. మంత్రి సతీశ్‌ జార్ఖిహొళిపై చేసిన వ్యాఖ్యలనూ సమర్థించుకున్నారు. ‘ఔను.. సతీశ్‌ జార్ఖిహొళికి నాన్నలా సామాజిక న్యాయం, కాంగ్రెస్‌ సిద్ధాంతాల్లో కీలకమైన లౌకికతత్వం, ప్రగతిశీల భావజాలం ఉంది. అలాంటి వారు ఎందరో పార్టీలో ఉన్నారు. మాలాంటి యువతకు ఆయన నాయకత్వం వహిస్తారనేది నా అభిప్రాయం. అలాగని.. నేను రేపే నాన్న రాజకీయ ప్రయాణం ముగుస్తుందని చెప్పలేదు’ అంటూ నవంబరు తర్వాత నాయకత్వ మార్పుపై వస్తున్న వదంతులపైనా వివరణ ఇచ్చారు.
ః బయటకు స్పష్టంగా కనిపించకపోయినా సిద్ధరామయ్య- ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మధ్య అంతర్గత పోరు సుస్పష్టం. సిద్ధులా అహింద(అల్ప సంఖ్యాక, వెనుకబడిన, దళిత) వర్గాలకు నాయకత్వం వహించేందుకు డీకే సిద్ధంగా లేరని సామాజిక, ఆర్థిక, విద్యా సమీక్షపై పరోక్షంగా చేస్తున్న విమర్శలను అవలోకనం చేసుకున్న వారెవరైనా చెబుతారు. ఈ విషయంలో సతీశ్‌ స్పందన భిన్నం. బడుగుల నేతగా పేరు గడిస్తున్న వారిలో జార్ఖిహొళి కీలకం. దళిత సముదాయంలో మల్లికార్జున ఖర్గే, డాక్టర్‌ జి.పరమేశ్వర్, ఎస్‌టీ విభాగం నుంచి సతీశ్‌ జార్ఖిహొళి మాత్రమే సీఎం పదవికి పోటీ పడగలిగిన వారు. పార్టీకి అత్యంత బలమైన ఓటు బ్యాంకుగా భావించే ‘అహింద’లను కాదనుకునే సాహసం అధిష్ఠానం చేయదని కూడా పార్టీ నేతలకు తెలుసు. ఈ కారణంగా డీకే వంటి బలమైన సామాజిక వర్గ నేతకు అంత సులువుగా సీఎం పట్టా ఇవ్వలేకపోతోంది. కేపీసీసీ అధినేతగా, బలమైన పార్టీ నిధిని ఏర్పాటు చేయగలిగిన డీకేకు అవకాశం ఇవ్వాలనుకుంటే క్షణాల్లో బరిలో దిగేందుకు సతీశ్‌ వంటి నేతలు సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో అహిందలకు నాయకుడిగా ఉండే వారికే సిద్ధు మద్దతిస్తారనే వాదన కాదనేవారు లేరు. ఈ కసరత్తును ఓ బాలుడిలా గమసిస్తూ వచ్చిన యతీంద్ర బహిరంగ వేదికపై నోరు జారారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

యతీంద్ర మాటల తూటాలు పేలిన వెంటనే డీకే తనదైన శైలిలో స్పందించారు. ‘అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలి. ఆ పిడికిలి శక్తి ఇచ్చిన వారే నాయకుడు. పార్టీలో సేవలే తప్ప ముఠా నాయకులు లేరు. సీఎంతోపాటు నేను పార్టీ ఏం చెబితే అది చేస్తాం’ అని వివరించారు. ఉన్నత పీఠాన్ని సాధించేందుకు ఎంత పోటీ ఎదుర్కోవాలో డీకేకు తెలియంది కాదు. పార్టీకి చేసిన సేవలను అధిష్ఠానం ఎప్పుడైనా గుర్తించకపోతుందా? అన్న ఆశతో ఆయన ఎదురు చూస్తున్నారు. ఆ పరిణామక్రమం సాధ్యమా? అన్నదే కోటి డాలర్ల ప్రశ్న.
2028 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను నడిపించే నాయకుడెవరు? వచ్చే విధానసభ ఎన్నికల్లో సిద్ధరామయ్య పోటీ చేస్తారా? సిద్ధరామయ్య సామాజిక న్యాయ దీక్షను అందిపుచ్చుకునే నేత ఎవరు? సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య వర్గ పోరాటం నడుస్తోందా? 
అనేకానేక ప్రశ్నలకు ఎమ్మెల్సీ యతీంద్ర బుధవారం చేసిన కొన్ని వ్యాఖ్యలు దాదాపు బదులిచ్చాయి. ఒక రకంగా పార్టీ నేతలకే అంతు చిక్కని సందేహాలకు తెలిసీ తెలియని రాజకీయ పరిజ్ఞానంతో యువ నేత గుట్టు విప్పేశారు. సిద్ధుకు సతీశ్‌ గట్టి మద్దతుదారు.

Tags :
Published : 23 Oct 2025 02:09 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు