US-China: వాణిజ్య పోరుకు తాత్కాలిక విరామం

Eenadu icon
By Editorial News Team Published : 01 Nov 2025 01:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

హకార భావనతో స్వచ్ఛమైన భాగస్వామ్యాలను, అంతర్జాతీయ సంబంధాలను అభివృద్ధి పరచుకోవడం సాధ్యమేనా? అమెరికా, చైనాలు ఎప్పటికైనా నిజమైన పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకోగలవా? అంటూ హెన్రీ కిసంజర్‌ సందేహపడ్డారు. ఒకరికి జరిగే లాభం మరొకరికి నష్టమయ్యే పద్ధతిలో వాషింగ్టన్, బీజింగ్‌ సంబంధాలు ఉండాల్సిన అవసరం లేదని ఆయన విశ్లేషించారు. కొన్ని అంశాలపై ఏకాభిప్రాయ సాధన కష్టమే కావచ్చు కానీ, అంతమాత్రాన ఘర్షణలకు దిగితే అసలుకే మోసం వస్తుందని హెచ్చరించారు. దానికి భిన్నంగా నడుచుకుంటూ, చైనాతో వ్యవహారశైలిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చిన అమెరికా- ప్రపంచాధిపత్య కాంక్షతో బీజింగ్‌ బుసలుకొట్టడం ప్రారంభించిన దరిమిలా ఎనిమిదేళ్ల క్రితం దాన్ని వ్యూహాత్మక ప్రత్యర్థిగా ప్రకటించింది. వాణిజ్య యుద్ధాలు, సాంకేతికతలపై ఆంక్షలతో చైనాను కట్టడి చేయడానికి ప్రయత్నించింది. ఆ రెండు అగ్ర ఆర్థికశక్తుల మధ్య దట్టమైన ఘర్షణాత్మక వాతావరణం మూలంగా ప్రపంచ జీడీపీకి 0.8 శాతం మేర కోతపడనుందని 2019లో ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఆ తరవాత కాస్త ఉపశమించిన పరిస్థితులు- డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి శ్వేతసౌధాధిపతి అయ్యాక మళ్లీ విషమించాయి. ట్రంప్‌ సుంకాలకు ప్రతిగా అరుదైన ఖనిజాల సరఫరాను చైనా బిగబట్టడంతో ఉభయపక్షాల నడుమ ఉద్రిక్తతలు ఎగదన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల అధ్యక్షుల తాజా సమావేశం సఫలం కావడం- విశ్వ వాణిజ్య సమీకరణాలను మార్చేస్తున్న అవాంఛనీయ సమరానికి తాత్కాలికంగానైనా విరామం ఇవ్వనుంది!

బహుళపక్ష సహకార వేదికలను కాలదన్నుతూ అవధులు దాటిన ఆర్థిక జాతీయవాదాన్ని తలకెత్తుకున్న ట్రంప్‌- విచక్షణారహిత సుంకాల బాదుడుతో అంతర్జాతీయ సరఫరా గొలుసులను తీవ్ర ఒడుదొడుకుల్లోకి నెట్టారు. చైనాపైనా అదే స్థాయిలో గుడ్లురిమారు. అమెరికా వ్యవసాయోత్పత్తుల దిగుమతులను నియంత్రించడం మొదలు అరుదైన ఖనిజాలపై ఆధిపత్యాన్ని ఆయుధంగా ప్రయోగించడం, తన ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్కెట్లను చూసుకోవడం తదితరాల ద్వారా బీజింగ్‌- ట్రంప్‌ టారిఫ్‌లకు భయపడేది లేదని తేల్చిచెప్పింది. అలా సంక్షోభం ముదురుతుండటంతో చైనాతో సంధి చేసుకోక తప్పని పరిస్థితి అమెరికాకు అనివార్యమైంది. ఆ క్రమంలో సోయాబీన్ల కొనుగోలుకు చైనాను ఒప్పించడం వంటి బుసాన్‌ భేటీ ఫలితాలు స్వదేశంలో ట్రంప్‌నకు రాజకీయ లబ్ధి చేకూర్చుతాయి. అయితే, అంతర్జాతీయ వ్యవహారాల్లో చైనాకు తమతోపాటు అగ్రాసనం వేయించే ధోరణిని అమెరికా గత అధ్యక్షులెవరూ బహిరంగంగా ప్రదర్శించలేదు. దానికి మారుగా ‘జీ-2’ అంటూ అమెరికా, చైనాల పరపతిని సమంచేస్తూ ట్రంప్‌ సంబోధించడం- ప్రపంచ పెత్తనంకోసం ఉవ్విళ్లూరుతున్న బీజింగ్‌కు ‘గుర్తింపు’ పరంగా దక్కిన పెద్ద విజయమే!

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో గడచిన కొన్నేళ్లలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అక్కడ చైనా ప్రాబల్య విస్తరణను అడ్డుకోవడానికి ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలు చతుర్భుజ కూటమిగా ఏర్పడ్డాయి. లోగడ క్వాడ్‌కు గట్టిగా మద్దతు పలికిన ట్రంప్‌ ఇప్పుడు స్వీయ ప్రయోజనాల వెంపర్లాటలో దాని భవితను అనిశ్చితిలోకి నెట్టేస్తున్నారు. జిన్‌పింగ్‌తో చెయ్యికలిపి చైనాపై సుంకాలను పదిశాతం తగ్గించిన ఆయన- వాణిజ్య ఒప్పంద సాకార ప్రయత్నాల్లో భాగంగా పరోక్షంగా ఇండియాపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని నిలబెట్టుకుంటూ జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు భారతావని ఆచితూచి అడుగులు వేయాలి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.