
విదేశీ ఉద్యోగులకు మరోసారి అమెరికా షాక్
భారత ఐటీ సంస్థలపై పెను ప్రభావం
వాషింగ్టన్: ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీ నిపుణులను అనుమతించే వీసా నిబంధనల సవరణకు అమెరికా ప్రభుత్వం మరోసారి నడుం కట్టింది. హెచ్-1బి పరిధిలోకి వచ్చే విదేశీ నిపుణులకు అమెరికా సంస్థల వాణిజ్య అవసరాల కోసం తాత్కాలిక వీసాలు జారీ చేయటాన్ని నిలిపివేయాలంటూ అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతిపాదించింది. అమెరికా సంస్థలు తమ తాత్కాలిక అవసరాల కోసం బి 1 వీసాలతో విదేశీ నిపుణులను రప్పించుకునే విధానం ప్రస్తుతం విరివిగా అమలులో ఉంది.
మన సంస్థలపై తీవ్రమే..
విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించేందుకు హెచ్ పాలసీకి బదులుగా బి 1 విధానాన్ని ప్రత్యామ్నాయ మార్గంగా మారకుండా అడ్డుకట్ట వేయాలని అమెరికా యోచిస్తోంది. కాగా, ఈ ప్రతిపాదన నిబంధనగా మారితే.. ఆన్సైట్ విధులకుగాను తమ సాంకేతిక సిబ్బందిని బి 1 వీసాలపై పంపే పలు భారతీయ సంస్థలపై తీవ్ర ప్రభావం చూపనుందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఖర్చులు తగ్గించేందుకు..
అమెరికాకు చెందిన ఓ ఆర్కిటెక్చర్ సంస్థ పెరుగుతున్న ఖర్చులను తగ్గించేందుకు స్థానిక ఆర్కిటెక్ట్లను విధుల నుంచి తొలగించి .. ఆ స్థానాల్లో విదేశీ సంస్థ సేవలను వినియోగించుకొనేందుకు అనుమతి కోరింది. ఈ నేపథ్యంలో హెచ్ 1బి వీసాల ద్వారా ఆర్కిటెక్ట్లను రప్పించుకుంటే.. వారికి ప్రభుత్వ నియమాల ప్రకారం స్థానికులతో సమానంగా వేతనాన్ని, ఇతర భత్యాలను చెల్లించాల్సి ఉంటుంది. దానితో తాత్కాలిక అవసరాల కోసం బి1 వీసాలపై విదేశీ ఆర్కిటెక్ట్లను రప్పించుకుంటే.. తక్కువ ఖర్చుతోనే తమ పని పూర్తవుతుందని ఈ సంస్థ భావించింది. అంతేకాకుండా హెచ్ 1బి వీసాలతో పోలిస్తే.. బి1 వీసాల ఫీజు తక్కువ.
ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన తాజా ప్రతిపాదనలతో అమెరికా వీసా విధానం మరింత పారదర్శకంగా మారుతుందని.. ఇక్కడి ఉద్యోగాల కోసం విదేశీయులు, స్థానికులతో పోటీ పడటం కూడా తగ్గుతుందని అధికారులు అంటున్నారు. ఈ నూతన నిర్ణయం అమలులోకి వస్తే ఆ ప్రభావం సంవత్సరానికి ఆరు నుంచి ఎనిమిది వేల విదేశీ ఉద్యోగులపై పడుతుందని వారు అంచనా వేస్తున్నారు.