Bengaluru: బెంగళూరు రోడ్లపై గుంతలు.. వారంలో పూడ్చేయాలి: సీఎం

Eenadu icon
By National News Team Published : 21 Oct 2025 17:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగళూరు రహదారుల దుస్థితి, ట్రాఫిక్‌ సమస్యలపై కొంతకాలంగా కర్ణాటక సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా, ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్‌ వంటి ప్రముఖులు ఈ సమస్యలను లేవనెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వారంలోగా బెంగళూరు రోడ్లపై ఉన్న అన్ని గుంతల (Potholes in Bengaluru Roads)ను పూడ్చేడాలని ఆదేశించారు. నగరంలోని ఐదు కార్పొరేషన్ల పరిధిలోని గుంతల మరమ్మతులకు అక్టోబర్ 31 వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. గాంధీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వైట్ టాపింగ్ సహా రోడ్ల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.

బెంగళూరు రోడ్ల సమస్యలపై తాను గ్రేటర్ బెంగళూరు అథారిటీ చీఫ్ కమిషనర్ మహేశ్వర్ రావు, ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి, పట్టణాభివృద్ధి శాఖ తుషార్ గిరినాథ్ సహా ఇతర అధికారులతో చర్చించినట్లు సీఎం తెలిపారు. అయితే ఈ ఏడాది ఎక్కువ వర్షాలు పడడం వల్ల రోడ్లపై పడిన గుంతలను పూడ్చడం ఆలస్యమయ్యిందని సిద్ధరామయ్య (CM Siddaramaiah) పేర్కొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు కొనసాగుతున్నాయని.. వైట్ టాపింగ్ చేయడం వల్ల రోడ్లు 25 నుంచి 30 ఏళ్లపాటు మన్నికగా ఉంటున్నాయన్నారు. అందుకే అన్ని రోడ్లకు వైట్ టాపింగ్ చేయిస్తున్నామన్నారు. 

వారి వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం అందరు ఎమ్మెల్యేలకు నిధులు అందిస్తున్నామని..దీనికి బడ్జెట్‌లో రూ. 8వేల కోట్లు కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. గత కొంతకాలంగా బెంగళూరు రోడ్ల (Bengaluru Roads) పరిస్థితిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బయోకాన్‌ పార్క్‌కు వచ్చిన ఓ విదేశీ విజిటర్‌.. నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానని బయోకాన్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా ఓ పోస్టులో వెల్లడించారు. దీనిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (Dk Shivakumar) వ్యంగ్యంగా బదులిచ్చారు. ఇది కాస్తా చర్చనీయాంశం అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి అధికారులకు రోడ్ల మరమ్మతులపై ఆదేశాలు ఇవ్వడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు