Mithila: మిథిలలో సాంస్కృతిక పోరాటం!..30 సీట్లపై రెండు కూటముల దృష్టి

Eenadu icon
By National News Desk Updated : 30 Oct 2025 19:37 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

స్థానిక సంప్రదాయాలను గౌరవించే వారికే పట్టం
గత ఎన్నికల్లో ఎన్డీయేకే ఆధిక్యం
7 సీట్లను గెలుచుకున్న ఇండియా కూటమి

బిహార్‌లోని మిథిలాంచల్‌లో కుల రాజకీయాలకన్నా స్థానిక సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించే వారికి, ఉపాధికి ఊతమిచ్చే వారికి ప్రజలు పట్టం కడతారు. అక్కడ పోటీ చేసే అభ్యర్థులు స్థానిక సంప్రదాయాలను సరిగా పాటించలేదంటే వారు బయటివారి కిందే లెక్క. వాటిని పాటిస్తే స్థానికులుగా ఓటర్ల మనసులో స్థానం సంపాదించగలుగుతారు. బిహార్‌ ఉత్తర ప్రాంతంలో ఉన్న మిథిలాంచల్‌ వరద ప్రభావితం ప్రాంతం. ఇక్కడి మొత్తం 30 నియోజకవర్గాల్లో దర్భంగా, మధుబని జిల్లాల్లోని 14 నియోజకవర్గాల్లో ప్రజలు చాలా స్పష్టంగా ఉంటారు. ఈ ప్రాంతంలో పాగ్‌ (మిథిల తలపాగా), మచ్ఛ్‌ (చేపలు), మఖానా (పూల్‌ మఖానా), పాన్‌ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. అభ్యర్థులు ఈ నాలుగు అంశాలనే ప్రస్తావిస్తుంటారు. సోషల్‌ మీడియాలోనూ దీని గురించే చర్చిస్తుంటారు. 


పాగ్‌: పెళ్లిళ్లు, స్నాతకోత్సవాలు, ఇతర మతపరమైన కార్యక్రమాల్లో ఈ మిథిల తలపాగాను ధరిస్తుంటారు. అది ఈ ప్రాంతానికి గౌరవాన్ని, గుర్తింపును ఇస్తుందని స్థానికులు భావిస్తారు. 


మఖానా: మిథిలాంచల్‌ మాగాణుల్లో పండే మఖానా ఈ ప్రాంతంలోని వేల మంది రైతులకు జీవనాధారం. అయినా ఈ పంట ద్వారా రైతులకు ఆదాయం తక్కువగానే వస్తోంది. వ్యాపారులే లాభపడుతున్నారు. దీంతో ప్రతిసారీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ అంశం ఉంటుంది.


మచ్ఛ్‌: మిథిలాంచల్‌లో చేపల వ్యాపారం భారీగా సాగుతుంది. ఇది ప్రధాన ఆదాయ వనరుగా ఉండటంతోపాటు రాజకీయ నాయకులకు డబ్బు సంపాదించి పెడుతోంది. ఈ ప్రాంతంలోని నిషాద్‌ (మల్లా) వర్గానికి చేపల వేటే జీవనాధారం. 


పాన్‌: ప్రజలతో సంబంధాలను నెరపడానికి ఈ ప్రాంతంలో సంప్రదాయ పాన్‌ ఉపయోగపడుతుంది. రాజకీయ పార్టీల నేతలు కూడళ్లలో నిల్చుని తమతో కలిసి పాన్‌ నమలడాన్ని ప్రజలు గౌరవంగా భావిస్తారు. 


పార్టీల హామీలు..

  • మఖానాకు గిట్టుబాటు ధర వచ్చేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకున్నారని ఎన్డీయే ప్రచారం చేస్తోంది. ఈ పంటకు అంతర్జాతీయ మార్కెట్‌ కల్పిస్తున్నారని చెబుతోంది. 
  • మిథిల ప్రాంతాన్ని టూరిజం సర్క్యూట్‌లో చేర్చి పాగ్‌కు మరింత గౌరవం తెచ్చేందుకు కృషి చేస్తున్నామని భాజపా చెబుతోంది.
  • పాగ్‌కు గుర్తింపుతోపాటు సామాజిక న్యాయం అస్త్రాన్ని మహాగఠ్‌బంధన్‌ ప్రయోగిస్తోంది. నిషాద్‌లకు (మత్స్యకారులకు) సంక్షేమ పథకాలను అందిస్తామని, మఖానా రైతులకు సహకార వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని చెబుతోంది. అంతేకాకుండా నిషాద్‌ వర్గానికి చెందిన వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ అధినేత ముకేశ్‌ సహానీకి ఉప ముఖ్యమంత్రి పదవి హామీ ఇచ్చింది. గతంలో ఆయన ఎన్డీయేతో ఉండేవారు. 
  • మల్లా ఓటర్లు.. నదీపరీవాహక ప్రాంత అభివృద్ధిని, ఆధునిక బోట్లను, మంచి ఘాట్లను కోరుకుంటున్నారు.

పట్టణ, గ్రామీణ ఓటర్లలో వ్యత్యాసం

మిథిలాంచల్‌లో పట్టణ, గ్రామీణ ఓటర్ల మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. పట్టణ ప్రాంత ఓటర్లు స్థానిక సంప్రదాయాలకు గౌరవాన్ని కోరుకుంటున్నారు. గ్రామీణ ఓటర్లు తాము గౌరవంగా జీవించడానికి సంబంధించిన అవసరాలను అడుగుతున్నారు. 


ఆ 7 సీట్లలో ఏం జరగనుందో..

  • మిథిల ప్రాంతంలో మొత్తం 30 సీట్లున్నాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో 23 సీట్లను ఎన్డీయే గెలుచుకుంది. అప్పట్లో లోక్‌ జన్‌శక్తి పార్టీ (ఎల్జేపీ) ఒంటరిగా పోటీ చేయడంతో 7 సీట్లలో ఆర్జేడీ కూటమి విజయం సాధించింది. ఈసారి ఈ 7 సీట్లు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఇందులో దర్భంగాలో ఒకటి, సమస్తీపుర్‌లో నాలుగు, మధుబనిలో రెండు ఉన్నాయి. 
  • ఈసారి ఎల్జేపీ తమతోనే ఉండటంతో ఆ 7 సీట్లనూ ఎలాగైనా గెలుచుకోవాలని ఎన్డీయే పావులు కదుపుతోంది. అదే సమయంలో వాటిని చేజార్చుకునేందుకు మహాగఠ్‌బంధన్‌ సిద్ధంగా లేదు. 
  • మిథిల ప్రాంతంలోని 30 సీట్లలో దర్భంగా, మధుబని, సమస్తిపుర్‌ జిల్లాల్లో ఉన్న 17 సీట్లలో ఎల్జేపీ పోటీ చేస్తోంది. అందులోనే ఈ కీలక 7 సీట్లున్నాయి. 
  • గత ఎన్నికల్లో దర్భంగాలోని 10 సీట్లలో ఎన్డీయే 9 చోట్ల గెలిచింది. కానీ దర్భంగా రూరల్‌లో ఓడిపోయింది. అక్కడ ఓటమికి ఎల్జేపీనే కారణం.
  • సమస్తీపుర్, హసన్‌పుర్, విభూతిపుర్, మోర్వా, మధుబని, లవుఖాల్లోనూ ఎల్జేపీ అభ్యర్థుల కారణంగా ఎన్డీయే ఓటమి చవిచూసింది. అన్నిచోట్లా మెజారిటీ కంటే ఎక్కువ ఓట్లను ఎల్జేపీ అభ్యర్థులు సాధించారు.

నేషనల్‌ డెస్క్‌

Tags :
Published : 30 Oct 2025 19:33 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు