Job for medal: పతకం పట్టు.. ఉద్యోగం కొట్టు..!

Eenadu icon
By National News Team Updated : 16 Dec 2023 23:10 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

పట్నా: బిహార్‌ ప్రభుత్వం (Bihar Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి చెందిన అథ్లెట్లు ఎవరైనా పతకం గెలిస్తే.. వారికి ప్రభుత్వ ఉద్యోగం (Bring Medal Get Job) ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు రూపొందించిన నూతన క్రీడా విధానాన్ని ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) ప్రకటించారు. పట్నాలో ఏర్పాటు చేసిన ఓ క్రీడా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పతకం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరూ ఇకపై ప్రభుత్వ ఉద్యోగులేనని వ్యాఖ్యానించారు. నిరుద్యోగం ప్రజల పాలిట శత్రువన్న ఆయన.. ఉన్నత చదువులు చదివిన వారికి కూడా కొలువులు దొరకడం కష్టమైందని చెప్పారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకే ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ చొరవతో ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.

రాష్ట్రంలో 81 మంది క్రీడాకారులను తాజాగా అధికారి స్థాయి ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు తేజస్వీ యాదవ్‌ తెలిపారు. వీరికి బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (బీడీవో) స్థాయి ఉద్యోగాల్లో చోటు కల్పిస్తామని, త్వరలోనే వారు ఉద్యోగాల్లో చేరేందుకు ఉత్తర్వులు కూడా వెలువడుతాయిని చెప్పారు. ‘‘ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు కేవలం ఉద్యోగం మాత్రమే ఇవ్వడం లేదు. వారిని ఓ అధికారి స్థానంలో కూర్చోబెడుతోంది’’ అని తేజస్వీ అన్నారు. అలాగని, చదువును నిర్లక్ష్యం చేయొద్దని విద్యార్థులకు సూచించారు.

కష్టపడి చదివి డిగ్రీలు సాధించాలి తప్ప.. తప్పుడు మార్గంలో వెళ్లి.. చిక్కులు కొని తెచ్చుకోవద్దని తేజస్వీ హెచ్చరించారు. తన తల్లిదండ్రులిద్దరూ ఒకప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉండేవారని, ఆ సమయంలో నకిలీ డిగ్రీ కావాలనుకుంటే తనకు పెద్ద కష్టమేమీ కాదని చెప్పారు. కానీ, తప్పుడు దారిలో వెళ్లకుండా నిజాయితీగా కష్టపడి డిగ్రీ పూర్తి చేశానని చెప్పుకొచ్చారు. విద్యార్థులు మొబైల్స్‌పై దృష్టి పెట్టకుండా ఏకాగ్రతను చదువుపై మళ్లించాలని సూచించారు. తేజస్వీ యాదవ్‌ తల్లి రబ్రీదేవి, తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ గతంలో బిహార్‌ ముఖ్యమంత్రులుగా పని చేసిన సంగతి తెలిసిందే.

Tags :
Published : 16 Dec 2023 22:47 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని