Rahul Gandhi: బిహార్‌లో భాజపా రిమోట్‌ కంట్రోల్‌ సర్కారు: రాహుల్‌ గాంధీ

Eenadu icon
By National News Team Updated : 29 Oct 2025 16:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్: నీతీశ్‌ కుమార్‌ను ఎదురుగా పెట్టి బిహార్‌లో భాజపా రిమోట్‌ కంట్రోల్‌ సర్కారును నడుపుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ (LoP Rahul Gandhi) ఆరోపించారు. భాజపా నేతృత్వంలోని కేంద్రం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని విమర్శించారు. ప్రతిపక్షాలు పట్టుబట్టడం వల్లే మోదీ ప్రభుత్వం కుల గణనకు అంగీకరించిందన్నారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections) నేపథ్యంలో ముజఫ్ఫర్‌పుర్‌లో నిర్వహించిన తన తొలి ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు. మహారాష్ట్ర, హరియాణాల్లో ఓట్ల చోరీ జరిగిందని, బిహార్‌లోనూ ఇది పునరావృతమవుతుందని ఆరోపించారు.

‘‘బిహార్‌ ప్రభుత్వం రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా నడుస్తోందని తేజస్వీ యాదవ్‌ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. భాజపా (BJP) కేవలం నీతీశ్‌ కుమార్‌ను వాడుకుంటోంది. దేశసంపద కొంతమంది సంపన్నుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. బిహార్‌ వంటి ప్రాంతాలు పేదరికంలో కూరుకుపోవడానికి ఇదే కారణం. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టంపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. ఛఠ్‌ పూజ సందర్భంగా దిల్లీలోని యుమునా నది ఘాట్‌ వద్ద పూజలు చేయనున్నట్లు ప్రకటించిన ఆయన.. ఆ తర్వాత అది కృత్రిమంగా నిర్మించిందని తెలుసుకుని వెనకడుగు వేశారు’’ అని రాహుల్‌ (Rahul Gandhi) విమర్శించారు. ఓట్ల కోసం ప్రధాని మోదీ ఎంతకైనా వెళ్తారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

రాజకీయాల్లో ఏ సీటూ ఖాళీగా లేదు: అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు

బిహార్‌ (Bihar News)లో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడతామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రజలు తమ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆధునిక నలంద విశ్వవిద్యాలయానికి కాంగ్రెస్‌ హయాంలోనే నాంది పడిందన్నారు. భవిష్యత్తులో అమెరికన్లు సైతం తమ ఉన్నత విద్య కోసం ఇక్కడి వస్తారని జోస్యం చెప్పారు.

రూ.500కే సిలిండర్: తేజస్వీ యాదవ్‌

తాము అధికారంలోకి వస్తే రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్లు అందజేస్తామని ఆర్జేడీ నేత, ‘మహాగఠ్‌బంధన్‌’ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ ప్రకటించారు. ఇటీవల కాలంలో ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకున్న అనేక ప్రజాకర్షక చర్యలు.. గతంలో తాను ఇచ్చిన హామీలకు నకలు అని విమర్శించారు. బయటి వ్యక్తుల నియంత్రణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. అవినీతి, శాంతిభద్రతలపై రాజీలేని వైఖరిని అవలంబిస్తానని తెలిపారు.

రాహుల్‌ వ్యాఖ్యలను ఖండించిన భాజపా..

ప్రధాని మోదీపై రాహుల్‌ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా ఖండించింది. ఆయన వీధి రౌడీలా మాట్లాడారంటూ మండిపడింది. ‘‘ప్రధానికి ఓటు వేసిన ప్రతి వ్యక్తిని ఆయన అవమానించారు. ఓటర్లను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీ చొరబాటుదారులకు బహిరంగంగా అండగా నిలుస్తున్నారు’’ అని దుయ్యబట్టింది.

 

Tags :
Published : 29 Oct 2025 16:10 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు