BJP: రాహుల్‌ విందులో ఉద్ధవ్‌ ఠాక్రేకు చివరి సీటు.. భాజపా ఎద్దేవా

Eenadu icon
By National News Team Updated : 09 Aug 2025 11:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ‘ఇండియా కూటమి’ (INDIA Bloc) సీనియర్‌ నేతలకు తన నివాసంలో ఇటీవల విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీకి సంబంధించి రాహుల్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఇందులో పాల్గొన్న శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) చివరి వరుసలో కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై భాజపా, శివసేన (యూబీటీ)ల మధ్య మాటల యుద్ధం నడిచింది. 

రాహుల్‌ నిర్వహించిన విందులో ఉద్ధవ్‌ను చివరి వరుసలో కూర్చోబెట్టడం ఆయన్ను అవమానించడమే అవుతుందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) పేర్కొన్నారు. ఎన్డీఏతో కలిసి ఉన్నప్పుడు ఆయన ఎల్లప్పుడూ మొదటి వరుసలోనే కూర్చొనేవారని ఎద్దేవా చేశారు. తమకెప్పుడూ ఆయన గౌరవమే ప్రాధాన్యమన్నారు. కానీ, ఇండియా కూటమిలో ఆయనకు ఎలాంటి గౌరవం దక్కుతుందో చూస్తున్నామన్నారు. దిల్లీ ముందు తలవంచకూడదని ఆయన ఎప్పుడూ చెప్పేవారన్నారు. అధికారం లేని కారణంగా వారికి అలాంటి మర్యాద చేశారని, అది తనను బాధించిందన్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) మాట్లాడుతూ.. ఆత్మగౌరవాన్ని, బాల్‌ఠాక్రే ఆదర్శాలను వదిలేసినవారు ఇలాంటి అవమానాల గురించి పట్టించుకోరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ వారి స్థానం ఏంటో తెలిసొచ్చేలా చేసిందన్నారు. 

భాజపా విమర్శలను ఉద్ధవ్‌సేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) తిప్పికొట్టారు. ఉద్ధవ్‌ను ముందు వరసలోనే కూర్చోమన్నారని, టీవీ స్క్రీన్‌ సరిగ్గా కన్పించాలనే తాము చివరి వరుసలో కూర్చున్నామని తెలిపారు. ఇదే విషయంపై ఆదిత్య ఠాక్రే స్పందిస్తూ.. ఫడణవీస్, శిందేలపై విరుచుకుపడ్డారు. సమావేశంలో ఎక్కడ కూర్చోవాలనేది తమ సొంత నిర్ణయమన్నారు. వారికి చిరాకు పెట్టేది తమ సీటు గురించి కాదని, అక్కడ చర్చిస్తున్న అంశం గురించన్నారు. భాజపాతో కుమ్మక్కై ఎన్నికల సంఘం పనిచేస్తుందనే విషయాన్ని తాము బహిర్గతం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.

భాజపాతో సుదీర్ఘకాలం కలిసి పనిచేసిన శివసేన.. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. అటు ఉద్ధవ్‌ నుంచి విడిపోయిన ఏక్‌నాథ్‌ శిందే.. భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కొంతకాలం శిందే ముఖ్యమంత్రిగా, డిప్యూటీగా ఫడణవీస్‌లు కొనసాగారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారం చేజిక్కించుకోగా.. ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా, డిప్యూటీగా శిందే బాధ్యతలు చేపట్టారు.  ఇటీవల ఉద్ధవ్‌ను ఉద్దేశిస్తూ.. ఫడణవీస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్షంలో కూర్చునేందుకు భాజపాకు అవకాశం లేదని, కానీ మీరు అధికార పక్షంలోకి రావచ్చంటూ పేర్కొన్నారు.

Tags :
Published : 09 Aug 2025 11:04 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు