Caste Census: కర్ణాటకలో మరోసారి కులగణన.. కాంగ్రెస్ హైకమాండ్‌ సూచన

Eenadu icon
By National News Team Published : 10 Jun 2025 18:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దిల్లీ: కర్ణాటక ప్రభుత్వానికి కాంగ్రెస్‌(Congress) అధిష్ఠానం కీలక సూచన చేసింది. రాష్ట్రంలో మరోసారి కులగణన చేపట్టే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.  నిర్ణీత కాలపరిమితి లోగా తిరిగి కులగణన చేపట్టాలని సీఎం సిద్ధరామయ్యకు సూచించింది. ఈ మేరకు దిల్లీలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తదితరులతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సహా పలువురు నేతలు సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

ఈ భేటీ అనంతరం కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో పరిస్థితులపై సవివరమైన, ఫలవంతమైన చర్చ జరిగిందన్నారు. తాము చర్చించిన ప్రధాన అంశాల్లో కులగణన ఒకటి అన్నారు. ఈ అంశంపై జూన్‌ 12న కర్ణాటక క్యాబినెట్‌ ప్రత్యేక సమావేశమై చర్చిస్తుందని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన కులగణన విధానాన్ని తాము సూత్రప్రాయంగా ఏకీభవిస్తున్నప్పటికీ.. లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కొన్ని వర్గాల్లో ఆందోళనలు ఉన్నాయన్నారు. గతంలో చేపట్టిన కుల గణన సమాచారం దాదాపు పదేళ్ల క్రితానిది గనక నిర్ణీత కాలపరిమితి (60-80 రోజుల్లో) లోగా తిరిగి కులగణన చేపట్టే అంశాన్ని పరిశీలించాలని కర్ణాటక సీఎంకు పార్టీ సూచించిందన్నారు. దీనిపై సీఎం సిద్ధరామయ్య మరిన్ని వివరాలను అందిస్తారని చెప్పారు.

అలాగే, ఈ భేటీలో కర్ణాటకలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన విషాద ఘటనపైనా చర్చించినట్లు వేణుగోపాల్‌ తెలిపారు. తొక్కిసలాట ఘటన, తదనంతర పరిణామాలను కాంగ్రెస్‌ అగ్రనేతలకు కర్ణాటక సీఎం, పీసీసీ చీఫ్‌ వివరించారని తెలిపారు. ప్రతి ఒక్కరి ప్రాణాన్ని తమ పార్టీ ఎంతో విలువైనదిగా భావిస్తుందన్న కేసీ వేణుగోపాల్‌.. ఈ దురదృష్టకర ఘటనలో ఏం జరిగిందో స్పష్టంగా తెలుసుకొనేందుకు ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించిందన్నారు. ప్రజానుకూల వైఖరితో తమ పార్టీ ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కర్ణాటకను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కర్ణాటక పట్ల కేంద్ర ప్రభుత్వం తీరు ఆమోద యోగ్యం కాదన్నారు. 

2015లో కర్ణాటక వెనుకబడినవర్గాల కమిషన్‌ జస్టిస్‌ కాంతరాజ నేతృత్వంలో కులగణన చేపట్టగా, ఈ డేటా ఆధారంగా కె.జయప్రకాశ్‌ హెగ్డే నేతృత్వంలో పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి గతేడాది సర్కారుకు సమర్పించిన విషయం తెలిసిందే.  కులగణన, ఆర్థిక, సామాజిక సమీక్షపై రూపొందించిన ఈ నివేదికను కర్ణాటక సర్కారు గతంలో ఆమోదించింది. నిపుణులు రూపొందించిన ఈ నివేదికపై భిన్నాభిప్రాయాలు, పలు వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ తాజా నిర్ణయం కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని