Piyush Goyal: స్టార్టప్‌లపై వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది: పీయూష్ గోయల్

Eenadu icon
By National News Team Updated : 05 Apr 2025 10:02 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత స్టార్టప్‌ (startups)లను ఉద్దేశిస్తూ కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ (Piyush Goyal) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మన స్టార్టప్‌లు ఐస్‌క్రీమ్‌లు, చిప్స్ తయారీ వద్దే ఆగిపోకుండా చైనా తరహాలో ఏఐ వంటి అంశాలపై దృష్టిసారించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను పలువురు తప్పుబట్టారు. తాజాగా ఈ విమర్శలపై ఆయన స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలే తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

గోయల్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘స్టార్టప్‌లపై నా సందేశం సానుకూలంగానే ఉంది. కాంగ్రెస్‌ పార్టీ నేతలే వాటిని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇది వారి ప్రతికూల విధానాన్ని ప్రతిబింభిస్తోంది. ఆ పార్టీకి చెందిన సామాజిక మాధ్యమాలు దీనిపై అనవసరంగా వివాదాలు రేకెత్తిస్తున్నాయి. యువ భారతీయులు ఈ స్టార్టప్‌లపై ప్రపంచంతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని గోయల్ పేర్కొన్నారు. 

గురువారం స్టార్టప్ మహాకుంభ్‌ కార్యక్రమంలో గోయల్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. మనం ఫుడ్ డెలివరీ యాప్స్‌పై దృష్టిసారించామని.. ఇలాంటి వాటివల్ల దిగువ శ్రేణి కార్మికులు తయారై సంపన్నులు కాలు బయటపెట్టకుండా ఆహారం పొందగలుతున్నారన్నారు. అదే సమయంలో చైనా సంస్థలు ఏఐ, ఈవీలు, సెమీ కండక్టర్ల రంగాలను ఎంచుకుంటున్నాయని తెలిపారు. కొత్త అంకుర సంస్థలు భవిష్యత్‌తరాల కోసం దేశాన్ని సిద్ధం చేయాలని ఈసందర్భంగా పిలుపునిచ్చారు. ‘ఐస్‌క్రీమ్‌లు, కిరాణా సరకులు వేగంగా డెలివరీ చేయడం ఆవిష్కరణా?’ అని గోయల్‌ ప్రశ్నించారు. 

ఈ వ్యాఖ్యలను జెప్టో సీఈఓ అదిత్‌ పలిచా, జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు, ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్‌ పాయ్‌ వంటి ప్రముఖులు తప్పుబట్టారు. ఉద్యోగాల సృష్టి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో జెప్టో విజయం సాధించిందని, భారత ఆవిష్కరణల్లో ఇది అద్భుతమని అదిత్‌ పలిచా పేర్కొన్నారు. ఇంజినీర్‌లు, టెక్నాలజిస్ట్‌లు సవాల్‌గా తీసుకోవాలని, విమర్శగా భావించకూడదని జోహో వెంబు అన్నారు. దేశీయ అంకురాలపై గోయల్‌ నమ్మకం ఉంచాలని, డీప్‌-టెక్‌ అంకురాలకు తోడ్పాటునివ్వాలని మోహన్‌దాస్‌ పాయ్‌ పేర్కొన్నారు. స్టార్టప్‌లలో ఉన్న ఇబ్బందులను పరిష్కరిస్తే, తప్పకుండా విజయం సాధిస్తామని.. చైనాతో భారత అంకురాలను పోల్చకూడదని తెలిపారు. 

Tags :
Published : 05 Apr 2025 09:41 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు